40.2 C
Hyderabad
May 2, 2024 17: 49 PM
Slider కవి ప్రపంచం

నింగి గర్జించె

#Manjula Surya New

చుక్కల చీరలో సింగారించావని మురిసిపోకు

చక్కని చంద్రుడు పక్కనున్నాడని

పొగరు చూపమాకు

సిగలోన సూరీడుని తురిమావని

మాపై శివాలెత్తబోకు

ఎత్తులో ఉన్నావని ఎకసెక్కాలాడకు

కరిమబ్బు ముసుగేసి కనువిందు చేసేయ్

నింగికి నేలకు వారధినే వేసేయ్

సూర్య చంద్రులని కాసేపు దాచేయ్

సప్తవర్ణాల హరివిల్లుతో

అంబరం సంబరంగా కనరాగా

వ్యాఘ్రమువలె గర్జించె

మెరుపులనే మెరిపించే

ఆర్ద్రతతో ఆకాశం భారంగా అగుపించే

ఘనమైన మేఘం వర్షాన్ని కురిపించే

ఒడిసిపట్టిన చినుకులను ఒదిలే వేళ

ప్రతి బిందువు పుడమిని తడిమే వేళ

ఆ కరుణారసహృదయ ఝరికి

విరులు తరువులు జీవజంతువులు పుణ్యనదిలో మునకలేసినట్లు మురిసిపోగా తడిసి ముద్దై కొత్తగా కనిపించే

ప్రకృతి తొలకరి జల్లులో

పులకరించే ప్రతి చినుకులో

ఆర్తితో అక్కున చేర్చుకునే

బావులు చెరువులు

దాహార్తినే తీర్చుకునే పిడచకట్టిన నోళ్లు

ఉగ్ర నారసింహుణ్ణి చందన లేపనంతో శాంతిమ్ప చేసినట్టు

పచ్చని పసరు పూసి

పుడమిగాయాలను మాన్ప

పలుగు పారలతో బయలుదేరెను  

ప్రకృతి వైద్యుడు

చిటపటల చిరుదాడి

చిరునామాకే ఎసరు పెట్టినా కానీ

చినుకు కోసమే కళ్ళలో వత్తులేసుకొని పరితపించే ఆ పిచ్చి మారాజు

నేల తల్లి కట్టిన ఎరుపు చీర

తీక్షణమైన ఎండలో వెలిసిపోయేనేమో

పచ్చని పట్టుచీరను కట్టి

మానాన్ని మట్టిలో కలిపోనీకుండా చేసే

ఈ పచ్చని చందమామకు

ఏమిచ్చిఋణం తీర్చుకోగలం

అవని అల్లకల్లోలం అవుతున్న

ఉత్పాతసమయాన

సరిహద్దుల్లో సైనికుడిలా కాపు కాస్తున్న

ఈ వీర జవానును ఏ సత్కారంతో సన్మానించగలం

పొలం గట్టుపై నడుం బిగించి నేనున్నానంటూ

ధైర్యాన్ని ఇస్తున్న రైతన్నకు

ఏ కవాతుతో వందనాలు

సమర్పించగలం

మట్టిని నమ్ముకున్నోడు మట్టిలో

కలిసేవరకు

స్వేదాన్ని చిందిస్తూ సేద్యాన్ని చేస్తూనే ఉంటాడు

కన్నతల్లిలా మన బొజ్జలు నింపుతూనే ఉంటాడు

నింగికీ నేలకూ వారధి వీడు

గుర్తింపునే కోరని కృషీవలుడే వీడు

మంజుల సూర్య, హైదరాబాద్

Related posts

ఒమిక్రాన్‌ గుర్తింపుకు ఐసీఎంఆర్ సరికొత్త కిట్‌

Sub Editor

జగన్ ముందు మంత్రులు… పదును లేని కోరలు…

Satyam NEWS

ముస్లింల సమస్య తీర్చని హోమ్ మంత్రిని అడ్డుకుంటాం

Satyam NEWS

1 comment

Yssubramanyam July 4, 2020 at 11:27 AM

చాలా బాగుంది. కవిత.

Reply

Leave a Comment