30.7 C
Hyderabad
April 29, 2024 05: 32 AM
Slider సినిమా

సత్యం న్యూస్: క్షీరసాగర మథనం చిత్ర సమీక్ష

#ksheerasagaramadhanam

చిత్రం: క్షీరసాగర మథనం

నటీనటులుః మానస్ నాగులపల్లి, సంజయ్ కుమార్,  గౌతమ్ శెట్టి,  ప్రియాంత్, మహేష్ కొమ్ముల, ప్రదీప్ రుద్ర, అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్

సంగీతం: అజయ్ అరసాడ

ఛాయాగ్రహణం: సంతోష శానమోని

కూర్పు: వంశీ అట్లూరి

నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్

రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి

విడుదల తేదిః 2021 ఆగస్టు 06

సత్యం న్యూస్ రేటింగ్: 3

ఎక్కువ జీతాలు తీసుకునే సాఫ్ట్ వేర్ ఉద్యోగుల జీవితాలు ఎంతో సుఖంగా సాగిపోతాయని అనుకుంటారు అందరూ. ఎంత చెట్టుకు అంతగాలి అన్నట్లుగానే వారి జీవితాలు కూడా ఉంటాయి. సాప్ట్ వేర్ ఉద్యోగుల జీవితాలకు అద్దంపట్టే కథ తో వచ్చిన తాజా చిత్రం క్షీరసాగర మథనం.

సాప్ట్ వేర్ రంగంలో ఉద్యోగాలు, ప్రాజెక్టులు, ప్రమోషన్లు ఎలా ఉంటాయి, విలాసవంతమైన జీవితాన్ని కోరుకుని కుటుంబాలను అప్పులపాలు చేసే యువత పరిస్థితి ఎలా ఉంటుందో దర్శకుడు అనిల్ ఈ చిత్రంలో చక్కగా చూపించారు.

సినిమా రంగంపై ప్రత్యేకమైన అభిరుచితో సాప్ట్ వేర్ రంగం నుంచి సినిమా రంగంలోకి దర్శకుడిగా అడుగుపెట్టాడు ఒంగోలు యువకుడు అనిల్ పంగులూరి. పలు సాప్ట్ వేర్ సంస్థల్లో పనిచేస్తున్న 20 మంది మిత్రుల సహకారంతో తొలి ప్రయత్నంగా “క్షీర సాగర మథనం” చిత్రాన్ని నిర్మించారు. ఎన్నో అవాంతరాలను దాటుకుంటూ ఆగస్టు 6న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం ఎలా ఉంది? సినిమా సంద్రాన్ని చిలికిన అనిల్ విజయాన్ని అందుకున్నాడా లేదా ? చూద్దాం.

సంక్షిప్తంగా ఇదీ కథః

ఒక వ్యక్తి ఐదుగురు సాప్ట్ వేర్ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని పన్నిన కుట్ర ఎలాంటి పరిణామాలకు దారి తీసింది, చివరకు ఆ కుట్ర నుంచి ఆ ఉద్యోగులు ఎలా బయటపడ్డారనేది సంక్షిప్తంగా క్షీరసాగర మథనం కథ. హైదరాబాద్ క్యూ హబ్ సాప్ట్ వేర్ కంపెనీలో ఓంకార్ (సంజయ్ కుమార్), గోవింద్ (గౌతమ్ శెట్టి), యోగేశ్( ప్రియాంత్), భరత్(మహేశ్ కొమ్ముల)లు ఇంజినీర్లుగా పనిచేస్తుంటారు.

గూగుల్ కు పోటీగా ఇమేజ్ సెర్చ్ఇంజిన్ ప్రాజెక్టును తయారు చేయాలన్నది వీరి లక్ష్యం. ఈ నలుగురిని రిషి(మానస్ నాగులపల్లి) రోజు తన క్యాబ్ లో క్యూ హబ్ లో డ్రాప్ చేసి వస్తుంటాడు. ఈ క్రమంలో ఓ రోజు మత్తు పదార్థాలను సరఫరా చేస్తూ సంజయ్ పోలీసులకు చిక్కుతాడు. స్నేహితుడ్ని కాపాడేందుకు వచ్చిన మిగతా నలుగురు  ప్రమాదంలో పడతారు. ఆ ప్రమాదం ఎవరి నుంచి ఎదురైంది? అందులో నుంచి ఈ ఐదుగురు ఎలా బయటపడ్డారు? క్యాబ్ డ్రైవర్ గా పనిచేసే మానస్ కు అమెరికా నుంచి వచ్చిన సాప్ట్ వేర్ అమ్మాయి విశిత (అక్షత సోనావని)తో ఉన్న సంబంధం ఏమిటీ? అనేదే క్షీర సాగర మథనం కథ.

ఎలా ఉందంటేః

అయితే ప్రథమార్థం మొత్తం పాత్రల పరిచయానికే సరిపోయింది. అసలు కథ ద్వితీయార్థంలో మొదలవుతుంది. పాత్రల మధ్య భావోద్వేగాలు కథకు బలాన్ని చేకూర్చాయి. పతాక సన్నివేశాల్లో 20 నిమిషాలు చాలా ఉత్కంఠను రేకెత్తిస్తాయి. ద్వితీయార్ధంలో కథనం వేగంగా సాగుతుంది. అజయ్ అరసాడ అందించిన పాటలు బావున్నాయి. క్యాబ్ డ్రైవర్ గా నటించిన మానస్ నాగులపల్లి ట్రాక్ ఫర్వాలేదనిపిస్తుంది. దర్శకుడు అనిల్ కు తొలి సినిమా కావడంతో తన అనుభవం మేరకు బాగానే కష్టపడి సినిమాను తెరపైకి తీసుకొచ్చారని చెప్పవచ్చు.

ఇటీవల వైల్డ్ డాగ్ చిత్రంలో నటించిన ప్రదీప్ రుద్ర ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి కొత్తగా అనిపించాడు. కథానాయికలు అక్షత సోనావని, చరిష్మా శ్రీకర్ తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేదనిపంచుకున్నారు.

భాస్కర్ పాత్రలో సాప్ట్ వేర్ ఇంజినీర్ గా నటించిన మహేశ్ పాత్ర ప్రేక్షకులకు ఊరటనిస్తుంది. సాంకేతికంగా సంతోష శానమోని కెమెరా పనితనం బాగుంది. నిర్మాణ విలువలు కథకు అనుగుణంగా సరిపోయాయి.

క్యాబ్ డ్రైవర్ రిషి ట్రాక్, ద్వితీయార్థంలో కొన్ని సన్నివేశాలు, పాటలు ఈ చిత్రానికి అదనపు బలాన్నిచ్చాయి. మొత్తానికి తొలి చిత్రమే మంచి ప్రయత్నం అని చెప్పవచ్చు. ఈ దర్శకుడి నుంచి మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు కూడా.

సత్యం న్యూస్ సినిమా డెస్క్

Related posts

మతకలహాలు రెచ్చగొట్టే సోషల్ మీడియాపై కన్నేసిన పోలీసులు

Satyam NEWS

భారీ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

ఓరుగంటి రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు గురించి సీఎం కు చెప్పండి

Satyam NEWS

Leave a Comment