42.2 C
Hyderabad
May 3, 2024 15: 46 PM
Slider కవి ప్రపంచం

ఈ ఉదయం…

#Purimalla Sunanda Khammam

ఈ ఉదయం

సరికొత్తగా కనిపిస్తోంది

ఎందుకో మరి..!

కరిగిపోతున్న కాలంలో

ఆశల ఆకులు రాలిపోయి

వేదనలతో మోడై వాడిన నన్ను

ఓ సుప్రభాత సమీరం సున్నితంగా తాకింది!

కాంక్రీట్ జంగిల్ లో

తలదాచుకునే పచ్చని నీడ కరువై

అణువణువూ  అభద్రతా భావం ఆవరించి

గుండె గుప్పిట్లోంచి జారిపోతున్నా

గుబులును గొంతు దాటనివ్వక

కుహు కుహు రాగాలను ఆలపిస్తూ కోయిలమ్మ

ఆశే మనసుకు శ్వాసంటున్నది…

ఎదురు దెబ్బలు ఎన్ని తాకినా

ఎదుటివారికి సాయం చేయడమే మిన్నయని

గుమ్మం బయట ఉన్న గున్న మామిడి

హృదయానికి హత్తుకునేలా మధురంగా చెబుతోంది!

శార్వరిలో కరోనా చేసిన గాయాలు

మనసు పొరల్లో ఇంకలేక

ఉబికి వస్తున్న ఊటల ఉప్పదనంతో సలుపుతుంటే…

మూతికి మాస్క్ చేతికి శానిటైజర్

మనిషికి మనిషికి మధ్య ఉండాలన్న భౌతిక దూరం

మనసును మనసును విడదీసి

విభజన రేఖలు ఎన్ని గీసినా…

జీవితం షడ్రుచుల సమ్మేళనమనీ

సమ పాళ్లలో ఉన్న లేకున్నా

స్థితప్రజ్ఞతతో స్వీకరించడమే

అసలు సిసలైన జీవన సారమని

సత్య బోధ చేస్తోంది ఈ ఉదయం…

అవరోధాలను అధిగమించే ఆత్మ స్థైర్యం కలిగేలా

జ్ఞాన బోధ చేసిన కొంగ్రొత్త ఉదయానికి నమస్కరిస్తూ …

కోటి కాంతుల చైతన్యంతో

శ్రీ ప్లవ నామ సంవత్సర ఉగాదిని

సవినయంగా స్వాగతిస్తున్నా!

వురిమళ్ల సునంద, ఖమ్మం, 9441815722

Related posts

పేదల ఆత్మ గౌరవం పెంచడమే ప్రభుత్వ లక్ష్యం

Bhavani

ఓ గాడ్: శ్రీ వీరాంజనేయ స్వామి దేవాలయంలో అక్రమాలు

Satyam NEWS

పిటియబుల్ పొజిషన్: కరీంనగర్ లో ఖాతా తెరవని కాంగ్రెస్

Satyam NEWS

Leave a Comment