38.2 C
Hyderabad
April 29, 2024 11: 12 AM
Slider ఆధ్యాత్మికం

హర హర మహాదేవ అంటూ మార్మోగిన మేళ్ళచెరువు

#MellacheruvuTemple

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని స్వయంవ్యక్త శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శివరాత్రి మహా పర్వదిన సందర్భంగా గురువారం తెల్లవారుజామున నుండి స్వామివారికి పంచామృతాలతో, మహన్యాస, రుద్ర,నమక,చమకాలతో, వేద పండితులతో మహా రుద్రాభిషేకం నిర్వహించారు.

కాకతీయుల కాలమునాటి సుప్రసిద్ధ చరిత్ర కలిగిన స్వయంభు శంభు లింగేశ్వర స్వామివారిని ఈ ప్రాంత ప్రజలు తమ ఇష్టదైవముగా, ఇలవేల్పుగా ఆరాధిస్తుంటారు. ఇక్కడ  లింగ రూపములో దర్శనమిస్తున్న శివుడు తలపై గంగతో విరాజిల్లుతూ ఉంటాడు. శివుని శిరస్సుపై ఉన్న గంగ ఎప్పుడు తగ్గకుండా తీసిన కొద్దీ రావటం ఇక్కడి ప్రత్యేకత.

విశేషంగా తరలి వచ్చిన భక్త జనం

ప్రతి మహా శివరాత్రికి తెలంగాణ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రముల లోని వివిధ పట్టణ, గ్రామాల భక్తులు స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. మహాశివరాత్రి పర్వదినం రోజున స్వామివారికి అభిషేకం చేసుకొని స్వామి వారిని దర్శించుకోవడం తమ పూర్వజన్మ సుకృతంగా భక్తులు భావిస్తారు.

ఐదు రోజులు ఘనంగా నిర్వహించే మహా శివరాత్రి పర్వదిన ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఎద్దుల పందాలు వైభవంగా నిర్వహిస్తారు. ఇరు రాష్ట్రాల లోని రైతులు తమ వృషభాలను అందంగా అలంకరించి పందాలలో నిలుపుతారు. స్వయంభు శంభు లింగేశ్వర స్వామి, శ్రీ ఇష్ట కామేశ్వరి అమ్మవారి కళ్యాణాన్ని కన్నుల పండుగగా వేద మంత్రోచ్ఛారణల మధ్య వేద పండితులు నిర్వహిస్తారు.

ఉత్తమ్, సైదిరెడ్డి ప్రత్యేక పూజలు

మహా శివరాత్రి  పర్వదిన సందర్భంగా నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు నలమాద ఉత్తం కుమార్ రెడ్డి, హుజూర్ నగర్ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి, స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో, పైరు పంటలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. ఆలయ సిబ్బంది, అర్చకులు శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. వేల సంఖ్యలో భక్తులు బారులు తీరి స్వామివారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకున్నారు.

ఐదు రోజుల మహా శివరాత్రి ఉత్సవాలు

త్రిశక్త్యాత్మక చండీ పీఠం ఆధ్వర్యంలో శ్రీ ఇష్టకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామివారి సన్నిధిలో  శ్రీ శ్రీ శ్రీ కొంకపాక రాధాకృష్ణ మూర్తి శర్మ, సీతాకుమారి వార్ల ఆధ్వర్యంలో స్వయంభ శంభు లింగేశ్వర స్వామి, చండీ పరమ దేవత, కంచి కామకోటి సర్వజ్ఞ పీఠాధిశ్వర పరమహంస శ్రీ శ్రీ శ్రీ శ్రీ జగద్గురు శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారి అనుగ్రహంతో మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఐదు రోజుల పాటు శక్తి పంచాయతన పూర్వక శ్రీ రుద్ర ఏకాదశ సహిత ఆశ్లేష మహాబలి, శత చండి, విశ్వశాంతి 54వ, మహా యాగం ఉదయం ప్రారంభమైంది.

యాతవాకిళ్ళ భాను కిరణ్ శర్మ పర్యవేక్షణలో గణపతి పూజ,పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాసన, రక్షా బంధనం, దీక్ష ధారణ, ప్రధాన దేవత ఆవాహనం, కలశ స్థాపన, అగ్నిమధనం,అగ్ని ప్రతిష్టాపన, గణపతి హోమం ప్రారంభించారు.ఈ సందర్భంగా   మహా శివరాత్రికి వచ్చే భక్తులకు లేదనకుండా అన్నదాన కార్యక్రమం చేపట్టారు.

ఈ అన్నదాన కార్యక్రమాన్ని పార్లమెంటు సభ్యుడు నల్లమల ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. విశేష యాగ, హోమాది క్రతువుల్లో అనేక మంది దంపతులు దీక్షాదారలై పీటలపై కూర్చుని యజ్ఞ,యాగాది, పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్నారు.

ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో గ్రామ ప్రజలు, భక్తులు పాల్గొన్నారు. దేవస్థాన సిబ్బంది భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు.

బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్

Related posts

ఆల హటావో… దేవరకద్ర బచావో: రాచాల

Satyam NEWS

కొల్లాపూర్ ఎంపిడిఓ కార్యాలయ పరిధిలోని సెటర్లకు ఓపెన్ టెండర్ నిర్వహించాలి

Satyam NEWS

కొల్లాపూర్ లో యాసంగి పంట వెరిఫికేషన్ ప్రారంభం

Satyam NEWS

Leave a Comment