29.7 C
Hyderabad
April 29, 2024 09: 52 AM
Slider ప్రపంచం

శ్రీలంక సంక్షోభం: ఆదుకుంటున్న భారత్ వాడుకుంటున్న చైనా

#srilanka

మన పొరుగు దేశమైన శ్రీలంక కనీవిని ఎరగనంత సంక్షోభంలోకి వెళ్లిపోయింది. అక్కడ పరిస్థితులు “దినగండం నూరేళ్ళ ఆయుష్షు” చందంగా ఉన్నాయి.కర్ణుడు చావుకు ఆరు శాపాల వలె,అనేక కారణాలు ఉన్నాయి.అందులో ఎక్కువ శాతం స్వయంకృతమే.

అంతటి గండంలో ఉన్న ఆ దేశానికి అండగా నిలిచిన దేశాలలో అగ్రస్థానం భారతదేశానిదే.మనపట్ల కృతజ్ఞతను నిలుపుకుంటుందా లేదా అనే విషయాన్ని పక్కన ఉంచితే? కష్ట సమయంలో అసలైన శ్రేయోభిలాషులెవరో తెలుసుకుంది.భారతదేశపు విలువ,విలువలు శ్రీలంకకు తెలిసొచ్చాయనే చెప్పాలి. చైనాతో అంటకాగడం శ్రీలంక సంక్షోభానికి బలమైన కారణాలలో ప్రధానమైంది.

దేశ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత చుట్టుముడుతోంది. స్వదేశీయుల చేతుల్లోనే ‘లంకా దహనం’ జరుగుతోంది. తీవ్రమైన ఆందోళనలు చెలరేగుతున్నాయి. అక్కడ ప్రజలు పడుతున్న కష్టాలు హృదయాలను
కలచి వేస్తున్నాయి. పసిపాపలకు పాలపొడి కూడా కొనుక్కోలేని దుస్థితిలోకి ఆ దేశం వెళ్లిపోయింది.

కాగితం కొరతతో పరీక్షలు ఆగిపోయాయి.గంటలకొద్దీ కరెంటు కోతలతో మొత్తం దేశం చీకట్లో కాపురం చేస్తోంది. తీవ్రమైన ప్రజావ్యతిరేకత నేపథ్యంలో,సోషల్ మీడియాపై ప్రభుత్వం నిషేధం కూడా విధించింది.ప్రభుత్వ నిర్ణయాన్ని దేశ ప్రధాని కుమారుడు, యువజన శాఖ మంత్రి
నమల్ రాజపక్స కూడా వ్యతిరేకించాడు.
ప్రజాగ్రహానికి భయపడి ప్రభుత్వం 36 గంటల పాటు ఎమర్జెన్సీని కూడా విధించింది.
శ్రీలంక ఆర్ధిక సంక్షోభం ప్రపంచ దేశాలకు అతి పెద్ద గుణపాఠం.దీనిని ‘కేస్ స్టడీ’ గా తీసుకొని ప్రత్యేకంగా అధ్యయనం చేయడం ఎంతో అవసరం.దేశ పాలకులు ఏమేమి చేయకూడదో? ( డోంట్స్ ) ప్రధానంగా తెలుసుకోవచ్చు.
శ్రీలంక కష్టాలకు 2007లోనే బీజం పడింది.

అప్పటి అధ్యక్షుడు మహీంద్ర రాజపక్స తీసుకున్న నిర్ణయాలు విషవృక్షాల్లా పెరిగిపెద్దవి అయ్యాయి. దేశం అప్పులకుప్పగా మారడం అప్పటి నుంచే ఆరంభమైంది. ప్రభుత్వ బాండ్లను మార్కెట్ లో విచ్చలవిడిగా విక్రయించారు.
చైనాకు అంతులేని ప్రాధాన్యాన్ని ఇచ్చారు.

తమ సొంత ఓడరేవు హంబన్ టోటాను అభివృద్ధి చేసే నెపంతో చైనా నుంచి భారీమొత్తంలో రుణాలు తీసుకున్నారు.కనీసం వడ్డీలు కూడా కట్టలేని పరిస్థితి వచ్చింది.చివరకు ఆ ఓడరేవును 99ఏళ్ళకు చైనాకు లీజుకు ఇవ్వాల్సి వచ్చింది.ఒకరకంగా ఆ ఓడరేవును చైనా స్వాధీనం చేసుకున్నట్లే భావించాలి.
శ్రీ లంకకు చెందిన ప్రధానమైన మౌలిక వసతుల ప్రాజెక్టులన్నీ చైనాకే ధారాదత్తం అయిపోయాయి.
‘ఎల్ టీ టీ ఈ’ తో చేసిన సుదీర్ఘ పోరాటం ఆ దేశానికి పెద్ద దెబ్బ కొట్టింది.విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడంలోనూ తప్పటడుగులు వేసింది. పర్యాటకం శ్రీలంకకు ప్రధానమైన ఆదాయమార్గం. తేయాకు,రబ్బరు, వస్త్రాల వంటి ఎగుమతి మరో ముఖ్యమైన ఆదాయ మార్గం.

2013 ప్రాంతంలో ప్రపంచ వ్యాప్తంగా సరుకల ధరలు ఇబ్బడిముబ్బడిగా పడిపోయాయి. ఈ పరిణామం ఆ దేశ ఆర్ధిక వ్యవస్థపై గొడ్డలిపెట్టుగా మారిపోయింది.
2008-9 ప్రాంతంలో వచ్చిన ‘ప్రపంచ ఆర్ధిక సంక్షోభం’ కూడా తీవ్ర దుష్ప్రభావాన్ని చూపించింది.విదేశీ మారక నిల్వలు కరిగిపోయాయి.
ఆ సమయంలో
‘ఐ ఎం ఎఫ్’ ( అంతర్జాతీయ ద్రవ్య నిధి) నుంచి రుణం తీసుకోవాల్సి వచ్చింది. ఎగుమతులు పుంజుకొకపోవడంతో, ఆ తర్వాత కూడా అనేక పర్యాయాలు అదే సంస్థ నుంచి రుణాలు తీసుకోక తప్పలేదు.

ఈస్టర్ బాంబు దాడి పర్యాటకంపై పెద్దదెబ్బ కొట్టింది. ఆ తర్వాత వచ్చిన కోవిడ్ సంక్షోభంతో దేశం కోలుకోలేని ఆర్ధికసంక్షోభంలోకి వెళ్లిపోయింది.వీటికి తోడు, దేశాధినేత గొటబాయ రాజపక్స తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు ఆ దేశాన్ని విలయంలోకి తీసుకెళ్లాయి.వాటిల్లో ‘పన్నుల విధానం’ ప్రధానమైంది.

పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా పూర్తిగా పడిపోయింది. 2021లో ఎరువుల దిగుమతిపై ప్రభుత్వం నిషేధం విధించింది. దీనితో ముఖ్యమైన వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పూర్తిగా పడిపోయింది.మితిమీరిన అప్పులు,అనాలోచిత నిర్ణయాలు,చైనాకు దాసోహం కావడం,కోవిడ్ దుష్ప్రభావాలు మొదలైనవి శ్రీలంకను ఘోరమైన సంక్షోభంలోకి నెట్టేశాయి.

విధానాలలో మార్పులు తెచ్చుకోవడం, పర్యాటకం అభివృద్ధి చెందడం, భారత్ వంటి ఆదర్శనీయమైన దేశాలతో చెలిమిని పెంచుకోవడం మొదలైన చర్యలతో శ్రీలంకకు మళ్ళీ మంచిరోజులు వస్తాయి.
శ్రీలంక సంక్షోభం నుంచి మిగిలిన దేశాలు కూడ గుణపాఠాలు నేర్చుకోవాలి.

మాశర్మ, సీనియర్ జర్నలిస్ట్

Related posts

భద్రాచలం – పాల్వంచల మధ్య రాకపోకలు నిలిపివేత

Satyam NEWS

రాజధాని ప్రాంతం లో మరో రైతు ఆత్మహత్య

Satyam NEWS

ఓటర్ల అవగాహనా పోస్టర్లను ఆవిష్కరించిన సిఇఓ మీనా

Satyam NEWS

Leave a Comment