24.7 C
Hyderabad
March 26, 2025 09: 37 AM
Slider జాతీయం

సీఎంకు తెలియకుండా మంత్రిని డిస్మిస్ చేసిన గవర్నర్

#tamilnadu

ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలలో గవర్నర్ వ్యవస్థను దుర్వినియోగం చేయడం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అలవాటుగా మారింది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల గవర్నర్లు చేపడుతున్న అనేక చర్యలు వివాదాస్పదమవుతున్నాయి. పలువురు గవర్న‌ర్లు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా చేపడుతున్న చ‌ర్యలు రాజ్యాంగాన్ని కించపర్చే విధంగా ఉన్నాయని అనేక మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు విమర్శలు చేస్తున్నప్పటికీ  గవర్నర్ల పద్ధతి మాత్రం మారడం లేదు.

ముఖ్యంగా తెలంగాణ, తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్ గవర్నర్లు, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ చేపడుతున్న చర్యలపై దేశవ్యాప్తంగా అన్ని బీజేపీయేతర పక్షాలు మండిప‌డుతున్నాయి. తమిళనాడు గవర్నర్ RN రవి, ముఖ్యమంత్రి MK స్టాలిన్ ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయిలో గొడవలు జరుగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రికి కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా హఠాత్తుగా గవర్నర్ ఓ మంత్రిని తొలగించారు.

ఇది  దేశ చరిత్రలోనే అనూహ్యమైనది. ఇటువంటి పరిణామం ఇటీవల కాలంలో ఎన్నడూ జరగలేదు. ఉద్యోగాల కోసం నగదు కుంభకోణంతో సహా అనేక అవినీతి కేసుల్లో జైలులో ఉన్న  తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని  స్టాలిన్ పోర్ట్‌ఫోలియో లేకుండా మంత్రిగా కొనసాగిస్తున్నారు. అయితే ముఖ్యమంత్రికి తెలియకుండానే గవర్నర్ ఈ రోజు గవర్నర్ రవి ఏకపక్షంగా మంత్రి వి సెంథిల్ బాలాజీని మంత్రి మండలి నుండి తొలగించారు.

తమిళనాడు రాజ్ భవన్ ఒక అధికారిక ప్రకటనలో,  ”బాలాజీ ఉద్యోగాల కోసం నగదు తీసుకోవడం, మనీలాండరింగ్‌తో సహా అనేక అవినీతి కేసులలో తీవ్రమైన క్రిమినల్ ప్రొసీడింగ్‌లను ఎదుర్కొంటున్నారు” అని పేర్కొంది. ఈ పరిస్థితుల్లో గవర్నర్ సెంథిల్ బాలాజీని తక్షణమే మంత్రి మండలి నుంచి తొలగించారు’’ అని రాజ్ భవన్ ప్రకటనలో పేర్కొంది. కాగా గవర్న‌ర్ చేపట్టిన ఈ చర్యను సుప్రీంకోర్టులో సవాలు చేయాలని తమిళనాడు ప్రభుత్వం యోచిస్తోంది.

సెంథిల్ బాలాజీ అరెస్ట్ అయిన కొద్ది సేపటికే ఆయనకు తీవ్రమైన గుండేపోటు రావడంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఆయనకు గుండె శస్త్రచికిత్స జరిగింది. అంతకు ముందు, అతను అనారోగ్యం, ఛాతీ నొప్పి ఫిర్యాదులతో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డిఎంకె ప్రభుత్వానికి , గవర్నర్ కార్యాలయానికి మధ్య సంబంధాలు చాలా రోజులుగా ఉద్రిక్తంగా ఉన్నాయి.

ముఖ్యంగా రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించిన చట్టానికి గవర్నర్ ఆమోదం నిరాకరించడంతో డీఎంకే ఆయనపై కారాలు మిరియాలు నూరుతోంది. గవర్నర్ రవి రాజ్యాంగ విరుద్ధమైన ప్రవర్తన, అసెంబ్లీ ఆమోదించిన అనేక   బిల్లులపై  సంతకం చేయకపోవడంపై  డిఎంకె గత సంవత్సరం అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముకు పిర్యాదు కూడా చేసింది. రాజకీయంగా క్రియాశీలకంగా మారిన గవర్నర్ పదవినుండి తొలగించాలని డిఎంకె డిమాండ్ చేస్తోంది. 

Related posts

Good Word : విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

Satyam NEWS

భూకబ్జా పై నిరసన సెగ: సీపీఎం ధర్నా

Satyam NEWS

శ్రీ రామజన్మ భూమిలో భవ్య మందిర నిర్మాణానికి ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

Leave a Comment