తెలుగుదేశం- జనసేన కార్యకర్తలంతా వైకాపా ఓట్ల దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీమంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు సూచించారు. రాష్ట్రంలో వైకాపాకు ఓటమి ఖాయమైన పరిస్థితుల్లో విపక్షాల ఓట్ల జాబితాల్లో గోల్‌మాల్‌కు జగన్ రెడ్డి ముఠా ఎంతకైనా తెగించే అవకాశం ఉందన్నారు. సొంతపార్టీ నేతలే జగన్ బై బై అని పారిపోతున్న పరిస్థితుల్లో బ్లూ బ్యాచ్ విపక్షాల ఓట్లు తొలగించడం, దొంగఓట్లు చేర్పించడమే పనిగా పెట్టుకున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ నెల 22న ఫొటోలతో కూడిన తుది ఓటరు జాబితాలో విడుదల చేసేందుకు ఈసీ సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రతి ఓటును చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఉన్న ఓట్ల తొలగింపు, కొత్త ఓట్ల చేర్పులపై ఎలాంటి అనుమానం ఉన్నా తక్షణం ఫిర్యాదులు చేయాలని, పార్టీ నాయకత్వం దృష్టికి తీసుకుని రావాలని ఆయన సూచించారు. ఈ విషయాలతో పాటు పట్టణంలో తెదేపాను బలోపేతం చేయడానికి చిలకలూరిపేట 10, 11 వార్డుల తెదేపా నాయకులతో శుక్రవారం ప్రత్తిపాటి సమీక్ష జరిపారు.
పార్టీ నాయకులు, కార్యకర్తలు కలసికట్టుగా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. ఓటరు జాబితా విషయంలో జాగురకతతో ఉండడంతో పాటు… వైకాపా ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. అదే సమయంలో తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కోరారు. తొలి విడత మేనిఫెస్టోలో భాగంగా చంద్రబాబు ప్రకటించిన 6 పథకాల్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. మినీ మేనిఫెస్టో పథకాలపై ప్రతి ఇంట్లో రిజిస్ట్రేషన్ విధిగా జరగాలన్నారు.
ఓటర్ల పరిశీలనపై ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని, జాబితాపైనే ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రతి ఓటు కీలకమని, పొరపాటు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. అనేకమంది వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభపరిణామం అని ప్రత్తిపాటి తెలిపారు. వైకాపాను శాశ్వతంగా ఇంటికి పంపించే విధంగా వచ్చే ఎన్నికల్లో తెదేపా, జనసేన శ్రేణులు సమష్టిగా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలన్నారు.