38.2 C
Hyderabad
April 29, 2024 11: 53 AM
Slider హైదరాబాద్

తెలంగాణ వ్యవసాయరంగం దేశానికే రోల్ మోడల్

#Minister Harish Rao

సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలతో తెలంగాణ వ్యవసాయరంగం దేశానికి రోల్‌మోడల్‌గా మారిందని, దేశం యావత్తు తెలంగాణ వైపు చూస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌రావు అన్నారు. ఈ మేరకు గురువారం నాబార్డ్‌ వార్షిక రుణ ప్రణాళిక సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాగానే సీఎం కేసీఆర్‌ వ్యవసాయరంగ అభివృద్ధిపైనే దృష్టి పెట్టారని, ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ వ్యవసాయాన్ని పండుగ చేశారని అన్నారు.

తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను కేంద్ర ప్రభుత్వం ఇతర పేర్లతో దేశ వ్యాప్తంగా అమలు చేస్తుందన్నారు. మిషన్‌ కాకతీయ పథకాన్ని అమృత్‌ సరోవర్‌ పేరుతో, రైతుబంధు పథకాన్ని పీఎం కిసాన్‌ పేరుతో అమలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో సాగు భూమి, పంటల ఉత్పత్తి భారీగా పెరిగిందన్నారు. రాష్ట్ర జీఎస్‌డీపీలో వ్యవసాయ, అనుబంధ రంగాల వాటా 19శాతం అని తెలిపారు. అదే దేశ జీడీపీలో వ్యవసాయరంగ వాట కేవలం 3.5శాతం మాత్రమేనని తెలిపారు.

అదే విధంగా తెలంగాణలో ఈ రంగాల వృద్ధిరేటు 10శాతంగా నమోదైతే దేశంలో కేవలం 3శాతం మాత్రమేనని తెలిపారు. నాబార్డ్‌తో కలిసి ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. కాళేశ్వరం, చెక్‌ డ్యాంల నిర్మాణం, మైక్రో ఇరిగేషన్‌, గోదాముల నిర్మాణం ఇలా పలు కార్యక్రమాలకు నాబార్డ్‌ రుణాలు అందించి సహకరించిందన్నారు. ప్రతి మండలానికి ఒక గోదాము ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినప్పుడు నాబార్డ్‌ సహాయంతో 25 లక్షల టన్నుల స్పేస్‌ గల గోదాములను నిర్మించినట్లు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, ధాన్యం దిగుబడి భారీగా పెరిగిందన్నారు.

సాగు విస్తీర్ణం 1.34 కోట్ల ఎకరాల నుంచి 2.03 కోట్ల ఎకరాలకు పెరిగిందని, అదే విధంగా ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2.49 కోట్ల టన్నులకు పెరిగిందన్నారు. గతంలో ముందు జాగ్రత్తగా నాబార్డ్‌తో కలిసి గోదాములు ఏర్పాటు చేయడంతో ఇప్పుడు ధాన్యం నిల్వలకు ఇబ్బంది కలుగడం లేదన్నారు. అదే విధంగా అవసరమైన ఎరువులను ముందుగానే తీసుకొచ్చి గోదాముల్లో నిల్వ చేయడం వల్ల రైతులకు సరైన సమయంలో ఎరువులను అందిస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాలో ఎరువుల కోసం క్యూలైన్లలో ఉండి రైతులు చనిపోయిన ఘటనలు చూస్తున్నామన్నారు.

దేశంలో వ్యవసాయరంగానికి మరే రాష్ట్రం ఖర్చు చేయని విధంగా తెలంగాణ రాష్ట్రం భారీగా నిధులను వెచ్చించిందన్నారు. రైతుబంధు పథకానికి ఇప్పటి వరకు తొమ్మిడి విడతల్లో రూ. 57882 కోట్లు ఖర్చు చేశామని, ఈ నెల 28 నుంచి 10 విడత పంపిణీ ప్రారంభించనున్నట్లు తెలిపారు. కరోనా కాలంలో తమ జీతాలు నిలిపామే తప్పా.. రైతులకు అందించే రైతుబంధును మాత్రం సమయానికి అందించామన్నారు. యాంత్రీకరణకు రూ. వెయ్యి కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలిపారు. గతంలో రాష్ట్రంలో 94వేల ట్రాక్టర్లు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 3.52 లక్షలకు పెరిగిందన్నారు.

ఇక వ్యవసాయ ట్రాక్టర్లకు రూ. 550 కోట్ల రోడ్‌ ట్యాక్స్‌ను రద్దు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు రూ. 2108 కోట్ల ఖర్చుతో 3.50 లక్షల ఎకరాలకు డ్రిప్‌ అందించామన్నారు. ఉచిత విద్యుత్‌ కోసం ప్రతి రైతుపై రూ. 18వేలు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ప్రతియేట రైతుల తరుపున ప్రతియేట రూ. 11, 500 కోట్లు విద్యుత్‌ సంస్థలకు చెల్లిస్తున్నట్లు తెలిపారు. అంతే కాకుండా విద్యుత్‌ సరఫరాను పునరుద్దరించేందుకు, విద్యుత్‌రంగంలో సంస్కరణల కోసం రూ. 36వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. దీంతో పాటు 1.50 లక్షల కోట్లు సాగునీటి రంగానికి, రూ. 5వేల కోట్లు రైతుబీమా కోసం, సాగునీటి తీరువా పన్ను రద్దుకు రూ. 500 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

నాబార్డ్‌ మూడు అంశాలపై ఫోకస్‌ చేసి అధిక రుణాలు ఇవ్వాలని మంత్రి హరీష్‌రావు కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్‌పామ్‌ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని సాగు చేస్తుందని, ఇందుకు సంబంధించి రైతులను ప్రోత్సహించేందుకు విరివిగా రుణాలు ఇవ్వాలని కోరారు. అదే విధంగా రాష్ట్రంలో వరిసాగు భారీగా పెరుగుతున్నదని, దీంతో కూలీల సమస్య పెరిగి రైతుకు పెట్టుబడి భారం అధికమవుతుందన్నారు. దీన్ని నివారించేందుకు గానూ వరిసాగులో నాట్లు వేసేందుకు యాంత్రీకరణను ప్రోత్సహించి యంత్రాలను అందించాలన్నారు.

దీంతో పాటు ప్రభుత్వం ఫుడ్‌ ప్రాసెసింగ్‌ జోన్లు ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ నేపథ్యంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు రుణాలు ఇవ్వాలని నాబార్డ్‌ను కోరారు. ఇది పారిశ్రామికవేత్తలకు ఉపయోగపడంతో పాటు రైతులకు కూడా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

రైతుల ఆదాయం రెట్టింపు అనేది నినాదం కాకూడదని, నిజం కావాలని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకున్నదన్నారు. ప్రధానంగా యాంత్రీకరణపై దృష్టి పెట్టడం వల్ల రైతులకు ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుందన్నారు. సీఎం కేసీఆర్‌.. రైతుల విషయంలో సీఎంగా కాకుండా ఓ సాధారణ రైతుగా ఆలోచిస్తారని అన్నారు. అందుకే దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని తెలిపారు.

ఇప్పటికే అనేక పథకాలకు రుణ సహాయం చేసిన నాబార్డ్‌ ముందు సంగమేశ్వర-బసవేశ్వర ప్రాజెక్టుకు సంబంధించి రుణ ప్రతిపాదన కూడా పెట్టామని, దీనికి తొందరగా అనుమతి ఇవ్వాలని నాబార్డ్‌ సీజీఎం సుశీల చింతలను కోరుతున్నాను. ఈ ప్రాజెక్ట్‌ పూర్తయితే సంగారెడ్డి జిల్లా ప్రాంతంలోని రైతులకు ఎంతో మేలు జరుగుతుంది.’ అని మంత్రి హరీష్‌రావు నాబార్డ్‌ సీజీఎం సుశీల చింతలను కోరారు.

Related posts

మిల్లుల్లో యంత్ర సామాగ్రిని అప్ గ్రేడ్ చేసుకోవాలి

Murali Krishna

ప్రభుత్వ ఉద్యోగులే ప్రభుత్వ భూమిని కబ్జా

Bhavani

సీఎం కేసీఆర్‌తో డోనాల్డ్ ట్రంప్‌ కరచాలనం

Satyam NEWS

Leave a Comment