దీపావళి పండుగ కు ముందే ప్రభుత్వం గోపాలమిత్రులు, పాడి రైతుల కుటుంబాలలో వెలుగులు తీసుకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో మూగ జీవాలకు వైద్య సేవలు అందిస్తున్న గోపాలమిత్రులకు 8.63 కోట్ల రూపాయల పారితోషికం, పాడి రైతులకు 4 రూపాయల ప్రోత్సాహకం క్రింద 55.50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ ఆర్ధిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా పశు వైద్యశాలలకు మందుల సరఫరా కోసం 6.5 కోట్లు, పరికరాల సరఫరా కోసం 2.50 కోట్లు, సంచార పశువైద్యశాలల నిర్వహణ కోసం 7.87 కోట్ల రూపాయలు, NCDC రుణం చెల్లింపు కోసం 22.39 కోట్ల రూపాయలు మంజూరు చేస్తున్నట్లు ఉత్తర్వులలో పేర్కొన్నారు. పాడి రైతుల 4 రూపాయల ప్రోత్సాహకం, గోపాలమిత్రుల పారితోషికం నిధుల విడుదల చేయడంపై పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్ధక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.