మంగళవారం అర్థరాత్రి లోగా విధుల్లో చేరని కార్మికులను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా మంచి అవకాశం ఇచ్చినట్లయిందని, దాన్ని ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేయడమా ? అనేది కార్మికులే తేల్చుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
గడువులోగా కార్మికులు చేరకుంటే, మిగిలిన ఐదు వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇవ్వాలని, అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మె, సమ్మె విషయంలో హైకోర్టు విచారణ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, సునిల్ శర్మ, సందీప్ సుల్తానియా, అరవింద్ కుమార్, లోకేశ్ కుమార్, అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్, అడిషనల్ ఎజి రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
సమ్మె విషయంలోనూ, కోర్టు విచారణ సందర్భంగానూ అనుసరించాల్సిన వైఖరిపై చర్చించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించారు. ఈ సమావేశంలో వ్యక్తమైన ఏకాభిప్రాయం ఇలా ఉంది. ‘‘మంగళవారం అర్థరాత్రి లోగా విధుల్లో చేరాలని గడువు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం కార్మికులకు మంచి అవకాశం కల్పించింది.
కార్మికుల భవిష్యత్తు, కార్మికుల కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ఎవరి చేతుల్లోనూ లేదు. ఉద్యోగాలను కాపాడుకోవడం పూర్తిగా కార్మికుల చేతుల్లోనే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధమైనదని కార్మిక శాఖ ఇప్పటికే నివేదిక ఇచ్చింది. అయినప్పటికీ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించింది. విధుల్లో చేరడానికి మూడు రోజుల గడువు ఇచ్చింది. ఆ అవకాశం వినియోగించుకోకుంటే అర్థం లేదు. కార్మికులు ఎవరినీ బద్నాం చేయలేరు.
ఇచ్చిన గడువు ప్రకారం కార్మికులు చేరకపోతే అది కార్మికుల ఇష్టం. మంగళవారం అర్థరాత్రి (5వ తేదీ అర్థరాత్రి) దాటిన తర్వాత ఏ ఒక్క కార్మికుడినీ విధుల్లో చేర్చుకునే ప్రసక్తి లేదు. ఈ విషయంలో ప్రభుత్వం తన నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. తన నిర్ణయాన్ని అమలు చేసే విషయంలో కఠినంగానే ఉంటుంది. గడువులోగా కార్మికులు విధుల్లో చేరకుంటే, మిగిలిన 5వేల రూట్లలో కూడా ప్రైవేటు వాహనాలకు ప్రభుత్వం పర్మిట్లు ఇస్తుంది. 5వ తేదీ అర్థరాత్రి గడువు ముగిసే సరికి చేరకుంటే ఆ తెల్లారో,మర్నాడో మిగతా ఐదు వేల రూట్లకు పర్మిట్లు ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తుంది.
అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్టీసీ రహిత రాష్ట్రంగా మారుతుంది. ఈ పరిస్థితికి ముమ్మాటికీ కార్మికులే కారణమవుతారు’’ అని సమావేశం అభిప్రాయపడింది. ‘‘హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి, యూనియన్ నాయకులు కార్మికులను మభ్య పెడుతున్నారు. కానీ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో కోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే, ఇంతదూరం వచ్చిన తర్వాత ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సుప్రీంకోర్టుకు వెళుతుంది. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళితే, అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుంది. గతానుభాలను బట్టి చూస్తే సుప్రీంకోర్టులో నెలల తరబడి, ఒక్కోసారి సంవత్సరాల తరబడి కేసుల విచారణ సాగుతుంది. అది అంతంలేని పోరాటం (never ending battle) అవుతుంది. కాబట్టి కార్మికులకు ఒరిగేదేమీ ఉండదు’’ అని ఈ సమీక్షలో అభిప్రాయం వ్యక్తమయింది.