39.2 C
Hyderabad
April 28, 2024 14: 43 PM
Slider నిజామాబాద్

టెండర్ హెడేక్: అభ్యర్థులకు తలనొప్పిగా మారిన రీపోలింగ్

kamareddy vote

కామారెడ్డి మున్సిపాలిటీ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ ఓ పోలింగ్ కేంద్రంలో టెండర్ ఓటు పడటమే కారణం. టెండర్ ఓటు పోటీలో ఉన్న కౌన్సిలర్ అభ్యర్థులకు తలనొప్పిగా మారింది. అభ్యర్థులకి మాత్రమే కాదు ఆయా పార్టీలకు ఈ పోలింగ్ సవాల్ గా మారనుంది.

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న 41 వ వార్డులో నిన్న జరిగిన ఎన్నికల్లో ఓ మహిళా ఓటరు వేసిన టెండర్ ఓటు చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అన్ని పోలింగ్ బూత్ ల మాదిరిగానే 101 పోలింగ్ బూత్ లో కూడా ఎన్నిక జరిగింది. ఆ బూత్ కు సంబంధించిన ఓ ముస్లిం మహిళ ఓటు ఇతర వ్యక్తి ఫేక్ ఓటరు కార్డు చూపించి ఓటు వేసి వెళ్ళిపోయింది.

సాయంత్రం 4 గంటల సమయంలో అసలు ఓటరు వచ్చి చూసేసరికి ఆమె పేరుమీద ఓటు వేయడం జరిగిందని అధికారులు ఆమెకు తెలిపారు. దాంతో ఆమె తనకు సంబంధించిన అసలు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు తీసుకువచ్చి చూపించడంతో అధికారులు ఆమెకు టెండర్ ఓటు వేసుకునే అవకాశం కల్పించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక్క టెండర్ ఓటు పడినా ఆ పోలింగ్ కేంద్రంలో రీ పోలింగ్ చేయాలని నిబంధన ఉండటంతో రీ పోలింగ్ అనివార్యమైంది.

ఈ విషయమై ఎన్నికల కమిషన్ నుంచి కలెక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు అందడంతో రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రీపోలింగ్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఆ వార్డులో వెహికిల్ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నామని, ఓటరు స్లిప్పులు కూడా పంపిణీ చేశారన్నారు.

నిన్న జరిగిన పోలింగ్ సందర్బంగా 378 ఓట్లు పొలయ్యాయని, మిగతా ఓటర్లు కూడా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. రాష్ట్రంలో కామారెడ్డితో పాటు నిజామాబాదు జిల్లా బోధన్, మహబూబ్ నగర్ జిల్లాలో సైతం రీపోలింగ్ జరగనుంది. మరో వైపు రీపోలింగ్ తో ఆయా పార్టీల అభ్యర్థులకు తలనొప్పులు తప్పేలా లేవు. ఇప్పటికే పెద్ద ఎత్తున డబ్బులు పంపిణీ చేసిన అభ్యర్థులు మళ్ళీ రీపోలింగ్ అంటే తల పట్టుకుంటున్నారు.

రీపోలింగ్ తప్పదని తెలిసిన వెంటనే అభ్యర్థులు అప్రమత్తమై ఓటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేపట్టారు. ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి అభ్యర్థులు అనధికార ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే అభ్యర్థి గెలుపు దాదాపు ఒక అంచనాకు రావచ్చని భావిస్తున్న  నేపథ్యంలో ప్రత్యర్థి అభ్యర్థి పెద్ద మొత్తంలో డబ్బులు పంపిణీ చేసే అవకాశం ఉంది. మరో వైపు ఒకే పోలింగ్ బూత్ లో ఎన్నిక ఉండటంతో అధికారులు కూడా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నారు.

అయితే 101 పోలింగ్ బూత్ లో మొత్తం 580 మంది ఓటర్లు ఉండగా ఇందులో నిన్న జరిగిన పోలింగ్ లో 378 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ రేపు జరగబోయే పోలింగులో ఎన్ని ఓట్లు పడతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే ఓటు హక్కు వినియోగించుకోవడానికి దాదాపు ఇతర చోట నుంచి వచ్చినవాళ్ళంతా నిన్న సాయంత్రం, లేదా నేడు ఉదయమే తిరిగు ప్రయాణమయ్యారు.

ఈ నేపథ్యంలో మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే అవకాశం లేదు. దాంతో అభ్యర్థులకు టెన్షన్ మొదలైంది. కనీసం 2 నుంచి 3 వందల మంది అయినా ఓటు వేస్తారా లేదా అని సంశయంలో అభ్యర్థులు కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే నిన్న ఓటు వేసిన ఓటర్ల జాబితాను తయారు చేసుకుని వారిని మళ్ళీ ఓటు వేసేలా ఒప్పించడానికి అభ్యర్థులు వారి ఇళ్ళ చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు.

ఇప్పటికే పెద్ద మొత్తంలో ఖర్చు చేసిన అభ్యర్థులకు మరింత భారం పడనుంది. రేపు జరగబోయే ఎన్నిక ఏ మలుపులు తిరుగుతుందో ఎవరు మెజారిటీ ఓట్లతో బయటపడతారో తెలియని పరిస్థితి నెలకొంది.

Related posts

కాకతీయ వర్సిటీలో జిమ్ సౌకర్యం ఏర్పాటు చేయాలి

Bhavani

ఉత్తరాన ఎన్టీఆర్ విగ్రహం… దక్షిణాన సావిత్రి భాయి విగ్రహం…!

Bhavani

చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ తో మంత్రి కేటీఆర్ సమావేశం

Satyam NEWS

Leave a Comment