38.2 C
Hyderabad
May 1, 2024 21: 44 PM
Slider ప్రత్యేకం

ఎన్నికల వేళ తప్పుకున్న త్రిపుర సీఎం బిప్లబ్ కుమార్

#biplavkumar

మరో ఎన్నికల రాష్ట్రంలో బిజెపి ముఖ్యమంత్రి రాజీనామా చేశారు. ఈసారి త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ తన కుర్చీని వదులుకోవాలని నిర్ణయించుకున్నారు. నిజానికి 2018లో రాష్ట్రంలో బీజేపీ అధికారాన్ని కైవసం చేసుకుంది. వచ్చే ఏడాది అంటే 2023లో ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

బిప్లబ్ ఆకస్మిక రాజీనామా రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించింది. బిప్లబ్ కుమార్ దేబ్ శుక్రవారం హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. దీంతో ఆయన రాజీనామాపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. దేబ్ స్వయంగా షాను కలిసిన విషయాన్ని ట్వీట్ ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత శనివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో బిప్లబ్ కుమార్ దేబ్ సీఎం పదవికి రాజీనామా చేశారు.

తన రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు. రాజీనామా అనంతరం కార్యకర్తగా పార్టీని బలోపేతం చేయడంపై మాట్లాడారు. రాజీనామా అనంతరం బిప్లబ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడాను. దీని గురించి వారికి తెలుసు. నాకు పార్టీ నిర్ణయమే ప్రధానం అని అన్నారు.

రాజీనామాకు కారణం ఏమిటి?

తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకుని పార్టీ హైకమాండ్ కు తెలిపానని బిప్లబ్ అన్నారు. తన నిర్ణయానికి అధిష్టానం సమ్మతించిందని దాంతో పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని ఆయన అన్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల కోసం కష్టపడి పనిచేస్తాను అని అన్నారు.

కాబోయే సీఎం ఎవరు?

కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రి, బీజేపీ నేత భూపేంద్ర యాదవ్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే త్రిపురలో ఉన్నారు. బిప్లబ్ కుమార్ దేబ్ స్థానంలో కొత్త నాయకుడిని ప్రకటించనున్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు బిప్లబ్ దేబ్‌పై ఏడాది కాలంగా కారాలు మిరియాలు నూరుతున్నారు. గత ఏడాది జూన్‌లో బిప్లబ్ దేబ్‌పై ఫిర్యాదు చేసేందుకు ఎమ్మెల్యేల బృందం ఢిల్లీకి వచ్చింది.

అయితే, అప్పుడు హైకమాండ్ జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సమస్యను పరిష్కరించాలని రాష్ట్ర ఇన్‌ఛార్జ్ వినోద్ సోంకర్‌ కు బాధ్యతలు అప్పగించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో మాణిక్‌ సర్కార్‌ నేతృత్వంలోని కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని కూలదోయడంతో బీజేపీ రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకుంది. 60 మంది సభ్యుల త్రిపుర అసెంబ్లీలో అధికార కూటమికి 36 మంది ఎమ్మెల్యేలు, ఇండిజినస్ పీపుల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ)కి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

2023లో ఎన్నికలు జరగాలి

త్రిపురలో ప్రస్తుత శాసనసభ పదవీకాలం వచ్చే ఏడాది అంటే 2023తో ముగియనుంది. అంటే వచ్చే ఏడాది ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది జరిగే ఎన్నికలకు కార్యకర్తగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని కూడా బిప్లబ్ తెలిపారు. త్రిపురలో మాత్రమే బీజేపీ సీఎంను మార్చిందని కాదు.

గతంలో కర్ణాటక, గుజరాత్‌, ఉత్తరాఖండ్‌లలో కూడా బీజేపీ ఇదే చేసింది. ఉత్తరాఖండ్‌లో బిజెపి ఒకటి కంటే ఎక్కువసార్లు సిఎంను మార్చింది. చివరకు పుష్కర్ సింగ్ ధామి నాయకత్వంలో ఎన్నికలలో పోటీ చేసి మెజారిటీతో తిరిగి అధికారంలోకి వచ్చింది. త్రిపుర బీజేపీ అధ్యక్షుడు, రాజ్యసభ ఎంపీ మాణిక్ సాహా ముఖ్యమంత్రి పదవి రేసులో ముందంజలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో పాటు డిప్యూటీ సీఎం జిష్ణు దేవ్ వర్మ పేరు కూడా వార్తల్లో నిలుస్తోంది.

Related posts

పోలీసులు మాకు రక్షకులు…

Satyam NEWS

మినిస్టర్స్ వాయిస్: పల్లెలు, పట్టణాల అభివృద్ధే లక్ష్యం

Satyam NEWS

కల్వకుర్తి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా

Satyam NEWS

Leave a Comment