38.2 C
Hyderabad
May 3, 2024 20: 23 PM
Slider ముఖ్యంశాలు

కమల వికాసానికి కలిసి వస్తున్న కాలం

#PoliticalSituation

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పులి జూదం మొదలైందా? రెండుచోట్లా అధికార ప్రాంతీయ పార్టీలు.. ప్రతిపక్ష పార్టీలను నామమాత్రావశిష్టంగా మార్చేందుకు వ్యూహాలు అమలు చేస్తున్నారా? లేక భారతీయ జనతా పార్టీ కోసం కృత్రిమ రాజకీయ శూన్యతను సృష్టిస్తున్నారా?

బీజేపీ ప్రాపకం కోసం ఇద్దరు ముఖ్యమంత్రులు పులిస్వారీ చేసేందుకు సిద్ధమయ్యారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ పులి స్వారీ వల్ల ఎవరికెంత లాభం? ఎవరికెంత నష్టం… ఒక్కసారి చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో 2019 సార్వత్రిక ఎన్నికల తరువాత భవిష్యత్ రాజకీయ చిత్ర పటం నెమ్మదిగా మారుతూ వస్తోంది.

తెలంగాణలో కేసీఆర్ రెండోసారి అధికారం నిలబెట్టుకుంటే.. ఆంధ్రప్రదేశ్ చంద్రబాబును మట్టి కరిపించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఇద్దరు అధికారంలోకి రావడం వెనుక పరోక్షంగా బీజేపీ సహకారం ఉందని ఇటు విమర్శకులు, అటు ప్రజలు.. అనుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే.

సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా ఆరు నెలల ముందు కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి.. బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి.. హైదరాబాద్ కు రాగానే అసెంబ్లీ రద్దుచేసి ముందస్తుకు వెళ్లి విజయం సాధించారు. ఏపీ విషయానికి వస్తే చంద్రబాబును ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో.. బీజేపీ, దాని అనుబంధ సంఘాలు పరోక్షంగా వైసీపీకి సహకరించాయి.

ఇది అందరికీ తెలిసిన వాస్తవమే. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు.. బీజేపీకి రుణం తీర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయనే సందేహాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా బీజేపీ కోసం కృత్రిమ రాజకీయ శూన్యతను ఇద్దరు ముఖ్యమంత్రులు సృష్టించేశారు.

ఇక బీజేపీ ఎదిగేందుకు అవసరమైన వేదికలను కూడా వారే సిద్ధం చేస్తున్నట్లుగా.. జరుగుతున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. బీజేపీ రాజకీయ ఉనికి హిందుత్వ అజెండా మీదే అధారపడి ఉందన్న విషయంలో ఎవరికీ ఎటువంటి సందేహాలు లేవు.

ఇప్పటివరకూ బీజేపీకీ దక్షిణాదిన సరైన హిందుత్వ ఎజెండాతో పార్టీని బలోపేతం చేసేందుకు సరైన అవకాశాలు రాలేదు. కేరళలో శబరిమల అంశం వచ్చినా.. అక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రన్.. అందిపుచ్చుకున్నారు. దీంతో దక్షిణాదిన బీజేపీకి మార్గం దాదాపు లేకుండా పోయింది.

తాజాగా తెలుగు ముఖ్యమంత్రులు బీజేపీ ఎదుగుదలకు దోహదం చేసేలా.. హిందుత్వ ఓట్ బ్యాంక్ పోలరైజ్ అయ్యేలా.. నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా సమయంలోనూ.. ఒక వర్గం వారికి అనుకూలంగా వారి మత విశ్వాసాలను అనుసరించేలా, నిర్దిష్ట నియమాలతో పండుగలు జరుపుకునేలా అనుమతులు ఇచ్చాయి.

హిందువులకు అత్యంత ప్రాముఖ్యత కలిగిన వినాయక చవితి పండుగకు వచ్చే సరికి ఇద్దరు ముఖ్యమంత్రులు అనుమతులు ఇచ్చే విషయంలో నాటకీయ నిర్ణయాలు చోటు చేసుకున్నాయి. ఇది బీజేపీ, దాని అనుబంధ సంఘాలకు కలిసివచ్చింది. పండుగకు అనుమతలు ఇవ్వకపోవడంతో హిందుత్వ ఎజెండాను బీజేపీ బయటకు తెచ్చింది.

ఈ కారణంతోనే హిందూ వర్గాల ఏకీకరణకు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రయత్నం మమ్మురం చేసింది. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏమిటంటే.. ఎక్కడా అధికార పార్టీమీదనో, ముఖ్యమంత్రుల మీదనో విమర్శలు చేయకుండా.. కేవలం హిందూ పోలరైజేషన్ మీదే బీజేపీ దృష్టి సారించడం.

సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల్లోనూ.. హిందువుల ఆలోచనా ధోరణి మార్చేలా.. ఉంటోంది. అంతేకాక ప్రతిపక్ష పార్టీల మీద.. వారి పాలనాకాలంలో జరిగిన ఘటనలమీద వ్యాఖ్యానాలు చేస్తూ ఉండడం ఆశ్చర్యకరం. ఇదంతా చూస్తుంటే.. రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలు.. బీజేపీ కోసం రాజకీయ శూన్యతను సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇద్దరు ముఖ్యమంత్రులు ఆడుతున్న ఈ పులి జూదంలో.. మేకలుగా మారేది ఎవరన్నది కాలమే చెప్పలి. దక్షిణాదిలో  శక్తివంతమైన పార్టీగా ఎదగాలన్న బీజేపీ ఆశలు.. ఎంతవరకూ నెరవేరతాయన్నది.. 2023 తరువాతే తేలనుంది..

-చామరాజు శేషుబాబు, సీనియర్ జర్నలిస్టు

Related posts

తుఫానును ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధం

Bhavani

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన జిల్లా సహకార అధికారి

Satyam NEWS

తెలంగాణలో వ్యవసాయానికి పెద్దపీట వేశాం

Satyam NEWS

Leave a Comment