31.2 C
Hyderabad
May 29, 2023 22: 05 PM
Slider సంపాదకీయం

అరెస్టు భయం: అధికార పార్టీలకు ఎంత కష్టం…..

#kalvakuntlakavita

రెండు తెలుగు రాష్ట్రాలలోని అధికార పార్టీలకు ఒకే రకమైన ‘కష్టం’ రావడం చర్చనీయాంశం అయింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కొట్లాడుతున్న బీఆర్ఎస్, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో ఎంతో సఖ్యతగా ఉన్న వైసీపీలకు కష్టం కూడబలుక్కుని వచ్చినట్లుగా కనిపిస్తున్నది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ సోదరుడు వై ఎస్ అవినాష్ రెడ్డి లపై అరెస్టు కత్తి వేలాడుతుండటం రెండు అధికార పార్టీలను కంగారు పెడుతున్నది. తెలంగాణ లో సీఎం కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎన్ ఫోర్సు మెంట్ డైరెక్టరేట్ కేసులో అరెస్టు అవుతారని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కంగారు పడుతున్నాయి.

అదే విధంగా ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయి దారుణ హత్య కేసులో మూడో సారి సీబీఐ విచారణకు పిలవడంతో ఆయనను కూడా అరెస్టు చేస్తారేమోనని వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇటు కవిత అరెస్టు కానీ, అటు జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి అరెస్టు కానీ ఆపలేరని బీఆర్ఎస్, వైసీపీ పార్టీల వ్యతిరేక శక్తులు అభిప్రాయపడుతున్నాయి.

9వ తేదీన కవిత అరెస్టు ముహూర్తం ఖరారు అయిందని పుకార్లు వ్యాపిస్తుండగా 10వ తేదీన వై ఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు తప్పదనే పుకార్లు విస్తృతంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో అధికారంలో ఉన్న రెండు పార్టీల ముఖ్యమంత్రులకు సంబంధించిన వారే ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో ఉండటంతో సర్వత్రా చర్చనీయాంశం అయింది.

తెలంగాణలో ముఖ్యమంత్రి కుమార్తె, ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి సోదరుడు అరెస్టు అయితే ఇద్దరు ముఖ్యమంత్రులకూ గడ్డుపరిస్థితి దాపురించినట్లుగా పరిగణించాల్సి ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. పైకి ఎన్ని విషయాలు చెప్పినా ఢిల్లీ కుంభకోణంలో కవిత కనుక అరెస్టు అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ రాజీనామా చేయాలనే డిమాండ్ పైకి రావచ్చు.

అదే విధంగా సొంత బాబాయి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీఎం జగన్ సోదరుడు వై ఎస్ అవినాష్ రెడ్డిని కనుక సీబీఐ అరెస్టు చేస్తే ముఖ్యమంత్రి పదవికి జగన్ రాజీనామా చేయాలనే డిమాండ్ పైకి వస్తుంది. ఇలా ముఖ్యమంత్రుల సొంత మనుషులే తీవ్రమైన కేసుల్లో అరెస్టు అయ్యే పరిస్థితులు తలెత్తడం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అయింది. ఈ ఇద్దరు ప్రముఖుల విషయంలో ఏం జరుగుతుందో అర్ధం కాని పరిస్థితిలో రెండు పార్టీల కింది స్థాయి నాయకులు అయోమయంలో ఉన్నారు.

వై ఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య జరిగిన వెనువెంటనే ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ పైనా, ఆ పార్టీ అధినేత పైనా నెట్టే ప్రయత్నం జరిగింది. పులివెందుల, జమ్మలమడుగు తెలుగుదేశం, బీజేపీ నేతలపై కూడా అనుమానం వచ్చే విధంగా అప్పటిలో వైసీపీ అగ్రనాయకులు తీవ్రంగా ప్రచారం చేశారు. అప్పటిలో ఈ ప్రచారం నిజమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మారు.

ఈ కారణంగానే వైసీపీని భారీ మెజారిటీతో గెలిపించారు. అనేక పరిణామాల అనంతరం సీబీఐ ఈ హత్య కేసుకు ముందుకు తీసుకువెళ్లడం, అది కడప ఎంపి, ముఖ్యమంత్రి జగన్ సోదరుడు వై ఎస్ అవినాష్ రెడ్డి అరెస్టు వరకూ రావడం రాజకీయంగా కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నది. సీఎం సోదరుడు కనుక ఈ కేసులో అరెస్టు అయితే ప్రజలు కూడా వైసీపీ ఇంత కాలం చేస్తున్న ఆరోపణలను ఇక నమ్మే పరిస్థితి ఉండదు.

తెలుగుదేశం పార్టీ చెప్పినట్లు సీబీఐ ప్రవర్తిస్తున్నదని, సీబీఐపై తెలుగుదేశం పార్టీ ప్రభావం ఎక్కువగా ఉందని వైసీపీ నాయకులు చెప్పిన సమయంలోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఎంతో సఖ్యతగా వైసీపీ ఉన్న తరుణంలో తెలుగుదేశం చెప్పినట్లు సీబీఐ ఎందుకు వింటుందని పలువురు వ్యాఖ్యానించారు. వైసీపీ ఇలాంటి చౌకబారు ఆరోపణలు చేయడం వల్ల తనకు ఉన్న ప్రతిష్టను కూడా కోల్పోయిందని అంటున్నారు. తెలంగాణ, ఆంధ్రాలో కీలక నేతలు అరెస్టు అయితే తీవ్రమైన రాజకీయ మార్పులు జరుగుతాయని పరిశీలకులు భావిస్తున్నారు.  

Related posts

మద్యం షాపుల బిజినెస్ అవర్స్ పెంపు

Satyam NEWS

ఏపి సీఎం జగన్ ను మర్యాద పూర్వకంగా కలిసిన పిల్లుట్ల రఘు

Bhavani

పందెం కోళ్లను అరెస్టు చేసిన పాల్వంచ పోలీసులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!