దేశానికి అన్నం పెట్టే రైతన్న ఆదుకోండి మహాప్రభో అని ప్రభుత్వానికి చేయిచాచే పరిస్థితి ఎదురైంది. ఆరు నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ళముందే వరదల్లో కొట్టుకుపోతుంటే భగవంతుడా… అని నోరెళ్ళబెట్టే స్థితిలో అన్నదాత ఉండిపోయాడు. చేతికొచ్చిన పంట వ్యాపారి వద్దకు వెళ్లి చేతికి డబ్బులు వస్తాయని ఆశిస్తున్న రైతులను అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. ఫలితంగా రైతులు లబోదిబోమంటున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మధ్యాహ్నం సమయంలో సుమారు గంటపాటు భారీ వర్షం పడింది. భారీ వర్షానికి జిల్లా కేంద్రంలోని ప్రధాన రహదారులన్నీ జలమయం అయి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలిగించాయి. జిల్లా కేంద్రంలోని గంజ్ వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు అరబోసుకున్న మొక్కజొన్న తడిసి ముద్దయింది. భారీ వర్షానికి మార్కెట్లో నీరంతా వరదగా రావడంతో మొక్కజొన్న మొత్తం ఆ వరద నీటిలో కొట్టుకుపోయింది. మార్కెట్లో సుమారు వెయ్యి క్వింటాళ్లకు పైగా మొక్కజొన్న ధాన్యాన్ని రైతులు అరబెట్టుకోగా అందులో సుమారు 3 వందల క్వింటాళ్ల మక్కలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. దాంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షం తగ్గినాక నీటిలో మిగిలిపోయిన మక్కలను తీసుకుని అరబెట్టుకుంటున్నారు. అకాల వర్షం తమ కష్టాన్ని వృధాగా చేసిందని రైతులు వాపోతున్నారు. ఇక తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు
previous post