ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటల ప్రకారం అయితే ఈ సీజన్ లో తెలంగాణ రాష్ట్రంలోని రైతులందరికి ఎరువులు ఉచితంగా అందివ్వాలి. ఒక్క రైతు బంధు ఏంది? రైతులకు ఉచితంగానే ఎరువులు ఇచ్చేస్తాం అని ఆయన చాలా కాలం కిందట చెప్పారు. వచ్చే సీజన్ నుంచి ఎరువులు ఉచితంగా అందుతాయని చిన్నసన్నకారు రైతులు అందరూ ఎంతో సంతోష పడ్డారు. అయితే ఇప్పుడు ఉచితం సంగతి దేవుడెరుగు మార్కెట్లో ఎరువు లభ్యతే లేకుండా పోయింది.
జూన్ మొదటి వారంలోనే వర్షా కాలం వచ్చినా సరైన వానల్లేక రైతాంగం తీవ్ర నిరాశలో ఇంతకాలం ఉంది. చాలా ప్రాంతాలలో బోర్ల కింద నాట్లు వేసుకున్నారు. ఏదోక విధంగా సాగు చేసుకుందాం అనుకున్న వారికి మొక్క నిలబడ్డాక ఇప్పుడు ఎరువులు అవసరం అవుతున్నాయి. అయితే మార్కెట్ లో ఎరువుల కొరత తీవ్రంగా ఉన్నట్లు దాదాపు అన్నిజిల్లాల నుంచి రిపోర్టులు వస్తున్నాయి. ఏడాది మొత్తం రాష్ట్రానికి సుమారు 15 లక్షల టన్నుల యూరియా అవసరమవుతుంది. అయితే వ్యవసాయ శాఖ అందుకు అనుగుణంగా లెక్కలు వేయడంలో, ఎరువుల స్టాక్ ఉంచడంలో పూర్తిగా విఫలం అయింది.
అవసరానికి తగినంత యూరియాను అధికారులు సరఫరా చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొందరు వ్యాపారులు కృత్రిమ కొరతను సృష్టిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. సీజన్ ప్రారంభంలో వర్షాలు లేకపోవడం, సాగు పెద్దగా లేకపోవడంతో రైతులు యూరియా కొనుగోలు చేయడానికి ముందుకు రాలేదు. దీంతో అధికారుల వైఫల్యం అప్పటిలో కనిపించలేదు. ఆగస్టు నెల చివరికి దాదాపు ఒకటిన్నర లక్షల టన్నుల యూరియా కొరత ఏర్పడింది.
ప్రతి నెలలో అవసరమైనంత యూరియాను తెలంగాణకు కేటాయిస్తున్నా నిల్వ చేసుకునేందుకు తగినంత చోటు లేదని రాష్ట్ర ప్రభుత్వమే తీసుకోవడంలేదని కేంద్రం అంటోంది. రాష్ట్ర ప్రభుత్వం అడిగిన దానికంటే కేంద్రం నుంచి ఎక్కువ ఎరువులను కేటాయించామని.. కానీ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే యూరియా కోసం ఇబ్బందులు తలెత్తాయని కేంద్ర ఎరువుల శాఖ మంత్రి సదానందగౌడ చెప్పారు. సెప్టెంబర్ నెలకు సంబంధించి లక్ష టన్నుల ఎరువులు కావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కోరిందని, వీలైతే అదనంగా ఇవ్వాలని అడగడంతో తాము రెండు లక్షల టన్నులు కేటాయించామని తెలిపారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఢిల్లీలో సదానందగౌడను కలిసి యూరియా సరఫరా అంశంలో కేంద్ర ప్రభుత్వంపై టీఆర్ఎస్చేస్తున్న ఆరోపణలను వివరించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయించిన యూరియా లెక్కలు, వివరాలను సదానంద విడుదల చేశారు. ఎరువుల కొరత తీవ్రం కావడంతో వ్యాపారులు అందినకాడికి దోచుకుంటున్నారు. ప్రైవేటు కంపెనీలు స్టాక్ ఉన్నా కృత్రిమ కొరతను సృష్టిస్తున్నాయి. 45 కిలోల యూరియా బస్తా రూ. 266.50 కాగా దాన్ని 800 రూపాయల వరకూ అమ్ముతున్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, తీవ్ర నిర్లక్ష్యధోరణి కారణంగానే ఎరువులు అందడం లేదని జగిత్యాల జిల్లా కు చెందిన యువ రైతు వామన్ రెడ్డి తీవ్రంగా ఆరోపించారు. ఇదేనా బంగారు తెలంగాణ అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఆయన విడుదల చేసినవీడియో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ అవుతున్నది.
తెలంగాణ వ్యాప్తంగా రైతులు రోడ్డెక్కారు. మరీ ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలలో రైతుల ఆందోళన ఉధృతంగా ఉంది.