తహసీల్దార్ విజయారెడ్డి సజీవదహనం ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఆఫీసులోనే ఆమెను దారుణంగా హత్య చేయడంపై విజయారెడ్డి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తమ కూతురిని అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని వాపోయారు. సమాచారం తెలిసిన వెంటనే సీపీ మహేష్ భగత్, ఘటనా స్థలికి వెళ్లి విచారణ చేపట్టారు. ఘటనకు దారి తీసిన పరిణామాలపై ప్రాథమిక సమాచారం సేకరించారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. భూవివాదమే తహసీల్దార్ హత్యకు కారణమని సీపీ మహేష్ భగత్ తెలిపారు.
విజయారెడ్డి తనకు ప్రమాదం ఉందనే విషయాన్ని ముందుగానే ఊహించారా అంటే అవుననే అంటున్నారు బంధువులు. కొద్దిరోజుల క్రితమే కలెక్టర్ ఆఫీసులో సెక్యూరిటీ కావాలంటూ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. భూవివాదాలను ఎక్కవగా డీల్ చేయాల్సి వస్తుండటం ఎప్పుడూ ఎదో ఒక గొడవ జరుగుతూ ఉండటంతో ఆమె సెక్యూరిటీని నియమించుకోవాలని భావించినట్లు సమాచారం. చివరికి ఆమె భయపడినట్లే జరిగింది. విధుల్లో ఉండగానే ఓ కిరాతకుడి ఘాతుకానికి బలైపోయారు. విధుల్లో నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించే ఆమెను అత్యంత కిరాతకంగా హత్య చేయడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం తోటపల్లి విజయారెడ్డి సొంతూరు. ఆమె తండ్రి లింగారెడ్డి కొండారంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గ్రామం విజయారెడ్డి అత్తగారి ఊరు. ఆమె భర్త సుభాష్ రెడ్డి హయత్‌నగర్ ప్రభుత్వ కాలేజీలో డిగ్రీ కాలేజ్ లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వీరి కుటుంబం కొత్తపేటలోని గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసముంటోంది. విజయారెడ్డికి ఇద్దరు సంతానం. పాపకు పదేళ్లు, బాబుకు ఐదేళ్లు. మొదట ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేశారు విజయారెడ్డి. 2009లో గ్రూప్-2కు సెలక్టయ్యారు. ఎమ్మార్వోగా రంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో పనిచేశారు. అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కొత్తగా ఏర్పడడంతో ఆమెకు అక్కడ పోస్టింగ్ ఇచ్చారు. అబ్దుల్లాపూర్‌మెట్‌కు తొలి తహసీల్దార్‌గా 3 ఏళ్ల నుంచి ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గతేడాదే విజయారెడ్డి ఉత్తమ ఎమ్మార్వోగా కలెక్టర్ నుంచి అవార్డు తీసుకున్నారు.