37.2 C
Hyderabad
April 26, 2024 22: 21 PM
ఆధ్యాత్మికం

స్వయం ప్రకాశుడు, విశుద్ధ జ్ఞాన స్వరూపుడు

#Lord Shiva 1

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

సూర్యుడు,చంద్రుడు, మొదలైన ఉజ్జ్వల వస్తువులు కూడా ఎవరిని ప్రకాశింపచేయలేవో, ఎవరి ప్రభావంతో సూర్యచంద్రాదులు ప్రకాశిస్తారో, ఎవరి వలన ఈ బ్రహ్మాండము ప్రకాశిస్తూ ఉన్నదో, అగ్ని లోహపుముద్దలో ప్రవేశించి దానిని కూడా దీపింపజేసినట్లు అన్ని వస్తువులకూ లోపల బయట వ్యాపించి ఉండి ఈ జగత్తును ఎవరు ప్రకాశింపజేస్తారో, ఆయనే బ్రహ్మ లేదా ఈశ్వరుడు.

ఎవరు – మనిషి, దేవత, బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, గృహస్థు, బ్రహ్మచారి, వానప్రస్థుడు, రాజు, భిక్షువుకాని వాడో, అయినా సర్వవ్యాపి, సర్వాంతర్యామి, జ్యోతిర్మయుడు, జ్ఞానస్వరూపుడు అయినవాడో, ఎవరు అద్వితీయుడో, నిత్యజ్ఞాన స్వరూపమైన ఆత్మను ఆశ్రయించి తమ తమ పనులను నిర్వహింపజేయటంలో ఎవరు లగ్నమై ఉంటారో – ఆయనే బ్రహ్మ లేదా ఈశ్వరుడు.

సర్వదా గోచరమయ్యేవాడే దేవుడు

సూర్యోదయము అందరి వ్యవహారానికి కారణభూతమైనట్లు, మనస్సు – బుద్ది అహంకారము – చిత్తము అనే చతురింద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు తమ తమ పనులు చేయటానికి ఎవరు కారణభూతుడో, ఎవరు ఉపాధి రహితుడో, ఆకాశంలాగా సర్వవ్యాపి మనోహరుడో, సృష్టిద్వారా సర్వదా గోచరమవుతూ ఉంటాడో – ఆయనయే బ్రహ్మ లేదా ఈశ్వరుడు.

ఎవరు అద్దము – జలము – తైలము ఇత్యాది వస్తువులలో ముఖం ప్రతిబింబించినట్లు దర్శనమిస్తాడో, ఆ ప్రతిబింబించిన ముఖం కన్న ఎవరు అభిన్నుడో, అట్లాగే బుద్దిలో ఆత్మ యొక్క ప్రతిబింబంలా భాసిస్తూ జీవాత్మకన్న అభిన్నుడో – ఆయనే బ్రహ్మ లేదా ఈశ్వరుడు.

అద్వితీయుడు ఈశ్వరుడు

ఎవరు అసలైన మనోచక్షువు, ఇంద్రియముల కన్న ఖిన్నుడై ఉండి కూడా మనస్సుకు మనస్సు, ప్రాణమునకు ప్రాణము, కంటికి కన్ను, చెవికి చెవి అయి కూడా, మనస్సు చక్షువు మొదలైన ఏ ఇంద్రియములచేతను గ్రహింపబడడో – ఆయనే బ్రహ్మ లేదా ఈశ్వరుడు.

భిన్నభిన్న పాత్రలలోని జలాలలో సూర్య కిరణాలు పడి నానా ప్రకారాలుగా కన్పించునట్లు స్వయం ప్రకాశుడు, విశుద్ధ జ్ఞాన స్వరూపుడు, అద్వితీయుడు అయి కూడా నానా ప్రకారమైన జీవుల బుద్ధిలో నానా ప్రకారములుగా భావింపబడుతూ ఉంటాడో – ఆయనే బ్రహ్మ లేదా ఈశ్వరుడు. అన్ని వస్తువులను ప్రకాశింపజేసే సూర్యుడు తాను ఒక్కడే అయినప్పటికి అందరి కండ్లలోనూ ఒకేసారి ప్రకాశింపజేసినట్టు, ఒకే సమయంలో ఎంతో మంది బుద్ధులలో ప్రకాశిస్తూ ఉండే ఆ నిత్యజ్ఞాన స్వరూపుడైనవాడే బ్రహ్మ లేదా ఈశ్వరుడు.               

సూర్యుడు ఒక్కడే అయి ఉండి కూడా చంచలమైన నీటిలో అనేక రూపాలతోను, స్థిరమైన జలంలో ఒకేరూపంతోను కన్పించునట్లు, తాను ఒక్కడే అయి ఉండి కూడా చంచలమైన బుద్దిలో ఎన్నో రకాలుగా ప్రతీయమానమయ్యే నిత్యజ్ఞాన స్వరూపుడే బ్రహ్మ లేదా ఈశ్వరుడు.

జ్ఞానులకు గోచరించేవాడే దేవుడు

అజ్ఞాని అయినవాడు మసక కళ్లతో చూసి సూర్యుడు మేఘావృతుడై ఉన్నాడని కాంతిహీనుడై ఉన్నాడని చెప్పునట్లు, నిత్యుడు – శుద్ధుడు – చైతన్యుడు అయిన ఈశ్వరుడు జ్ఞానులకు చాలా దగ్గరలో ఉన్నట్లు కనపడతాడు. ఆ నిత్యజ్ఞాన స్వరూపుడే బ్రహ్మ లేదా ఈశ్వరుడు.

తాను ఒక్కడే అయినా, అన్నింటిలోనూ అంతర్యామియై ఉంటూ కూడా, ఏ వస్తువుచేత స్పృశింపబడలేనివాడు, ఆకాశంలాగా సర్వవ్యాపి అయినవాడు బ్రహ్మ లేదా ఈశ్వరుడు. ఆత్మ పృథ్వి కాదు. ఎందుకంటే పృథ్విలో ఉండే గంధగుణం ఆత్మలో లేదు. అది కేవలం గంధమును ప్రకాశింపజేస్తుంది. ఆత్మజలము కాదు. ఎందుకంటే జలములోని రసలక్షణము ఆత్మలో లేదు.

కేవలం రసలక్షణము తెలిసినది, ఆత్మకు తేజస్సు ఉన్నదని చెప్పలేము. ఎందుకంటే తేజస్సులోని రూపం ఆత్మలో లేదు. అది ఆ రూపాన్ని కేవలం చూపిస్తుంది. ఆత్మ వాయువని కూడా చెప్పలేము. ఎందుకంటే వాయువుకు ఉన్న స్పర్శగుణం దానికి లేదు. ఆకాశాన్ని కూడా ఆత్మ అని చెప్పలేము.

నిత్యమంగళ స్వరూపమైనది

ఎందుకంటే ఆకాశంలాగా ఆత్మకు శబ్దగుణం లేదు. ఆది కేవలం ఉచ్చరించగలుగుతుంది. ఆత్మ ఇంద్రియం కూడా కాలేదు. ఎందుకంటే – ఇంద్రియాలు చాలా ఉన్నాయి. కాని ఆత్మ ఒక్క భావము మాత్రమే. భూమి నుంచి వేరైనది, నిత్యమంగళ స్వరూపమైనది ఏదో అదే ఆత్మ – ఆదే బ్రహ్మ లేదా ఈశ్వరుడు.

ఏ సచ్చిదానంద బ్రహ్మకు స్థానము, పరిమాణము, వర్ణములు లేవో, ఎవరికి ఏ ఆకృతి విశేషమూ లేదో ఎవరికి దర్శనము, దృశ్యము, శ్రవణము, శ్రావ్యములు ఏవీ లేవో, ఎవరు వృక్షరూపం అయి ఉండి కూడా మూలము, బీజము, శాఖలు , పత్రములు, లతలు, పల్లవములు, పుష్పములు, సుగంధము, ఫలములు ఛాయాదులు ఏవీలేవో ఆ నిత్యజ్ఞానమయుడే బ్రహ్మ లేదా ఈశ్వరుడు ( బహుళ గుణాదులు లేవని భావము)

ఎవరికి వేదము, శాస్త్రము, శైవము, సంధ్య, మంత్రము, జపము, ధ్యానము, ధ్యేయము, హోమము, యజ్ఞము, వంటి కర్మల అవసరంలేదో, ఎవరికి ఊర్ద్వము, అధమములు కూడాలేవో, ఎవరికి శివము, శక్తులు లేవో, ఎవరు పురుషుడు కాని, స్త్రీ కాని కారో, ఎవరు బ్రహ్మకాని, విష్ణువుకాని, గ్రహనక్షత్రములుకాని, మేఘమాలకాని

సూర్యచంద్రులు కానీ కారో, ఎవరికి ఉదాయాస్తమయములు లేవో, ఎవరు స్వర్గంలోకాని, నరకంలోకాని, భూమిమీదకాని ఉండరో, ఎవరికి జాతిగతమైన లేదా జాతిరహితమై మిత్రత్వం ఉండదో, ఎవరు కేవలం నిర్వాణరూపి, పుణ్యమయుడు, జగత్తు యొక్క సారము, పాపపుణ్య విహీనుడు, సర్వమయుడు, చైతన్య స్వరూపుడు అయి ఉన్నాడో ఆయనే ఈశ్వరుడు.

కిరణాల వెలుతురు వలన చీకటి నాశనమైనప్పటికీ అంధకారము యొక్క తత్త్వము మాత్రము తెలియదు. అజ్ఞానము అంతరించిన తరువాత బ్రహ్మయే సర్వశక్తిమంతుడు, జీవాత్మ, సత్యము, చైతన్యము అని ఆయన స్వరూపము విశదమవుతుంది. బ్రహ్మమే సర్వస్వరూపమని, అంతకన్న భిన్నుడుకాడని తెలుసుకోవాలి. ఆకాశం మేఘావృతమైనప్పుడు ఆకాశ స్వరూపం తెలియదు.

కాని మేఘాలు వెళ్ళిపోగానే ఆకాశం అంతకు ముందులాగానే స్వచ్ఛంగా ప్రకాశిస్తూ ఉంటుంది. అప్పుడు ఆకాశం యొక్క అస్తిత్వం ఆకాశ రూపంలో కన్పిస్తుంది. అట్లాగే దృశ్య ప్రపంచం అంతరించగానే చిత్తశక్తి యొక్క స్వాభావిక శక్తి ఉదయిస్తుంది.

ఆ శక్తి చిత్తముకన్న భిన్నమైనదికాదు. ఏ పదార్ధం దేని నుంచి పుడుతుందో అది దానికన్న భిన్నం కాదు. ఎట్లాగంటే చెరుకురసం యొక్క మధురత, అగ్ని ఉష్ణత, మంచు శీతలత, తైలము యొక్క స్నిగ్థత, వాటి కన్న భిన్నములుకావు.

అట్లాగే చిత్తశక్తియే జగత్తు యొక్క శక్తి.  జగత్ శక్తి వల్లనే చిత్తశక్తిని తెలుసుకోవచ్చును.

చిగురాకులలో ఉండే పై భాగం చిగురాకుల కన్న భిన్నం కానప్పటికీ, విభిన్నమైన రూపంలో కన్పించినట్లు, బ్రహ్మముకూడా జగత్తు కన్న అభిన్నము. బ్రహ్మము జగత్తుకు, జగత్తు బ్రహ్మమునకు అభిన్నులైనప్పటికి బ్రహ్మమే జగత్తును ధరిస్తున్నాడు. రాగము, ద్వేషము, ప్రాణము, వాయువు, మనస్సు, బుద్ధి, మాయ, ఆశ, వాసన, చింత మొదలైన వాటిని ఎవ్వరూ  చూడలేదు.

అవి అప్రత్యక్ష పదార్ధములైనప్పటికీ వాటి పనులను బట్టి వాటిని తెలుసుకోగలుగుతాము. అట్లాగే, దేవుణ్ణి  ఎవ్వరూ చూడలేదు. కాని ఆయన చేసే అలౌకిక కార్యకలాపాలను చూసి, ఆయనను ప్రత్యక్షంగా చూడలేకపోయినప్పటికి ఉనికిని తెలుసుకోగలుగుతాము.

(ఏ పండుగ అయినా జరుపుకునేది జ్ఞాన సముపార్జన కోసమే)

Related posts

యువర్ హైనెస్: హిమాలయాల సమీపంలో శ్రీవారి ఆలయం

Satyam NEWS

కోటప్పకొండలో కార్తీక మాసం సందడి

Satyam NEWS

శ్రీశైలం లో పవిత్ర కార్తీకమాసోత్సవాలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment