హత్యలు, కిడ్నాప్‌లు, భూకబ్జాలతో తెలంగాణ రాష్ట్రాన్ని వణికించిన గ్యాంగ్‌స్టర్ నయీం ఆస్తులు ఏమయ్యాయి? నయీం ఆస్తులు అలానే ఉన్నాయా? పరాధీనం అయ్యాయా? అనేది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నయీం ఆస్తులపై సస్పెన్స్ విడివడేలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గ్యాంగ్‌స్టర్ నయీం ను ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌లో 2016 ఆగస్టు 9న పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే.
ఆయనపై అనేక చోట్ల నమోదైన 197 కేసులను దర్యాప్తు చేసేందుకు అప్పటిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్) ఏర్పాటుచేసింది. ఈ నేపథ్యంలోనే నయీం అక్రమంగా సంపాదించిన ఆస్తులను సిట్ వెలుగులోకి తెచ్చింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో నయీంకు స్థిరాస్తులు ఉన్నట్లు సిట్ అప్పటిలో నిర్ధారించింది. నయీం పైనా ఆయన బినామీల పేరిట ఉన్న ఆస్తుల విలువ సుమారు రూ.1,200 కోట్లు ఉండొచ్చని ఆదాయపు పన్ను శాఖ కూడా అప్పటిలో అంచనా వేసింది.
తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో 1015 ఎకరాల భూములు, లక్షా 67 వేల 117 చదరపు అడుగుల ఇళ్ల స్థలాల్ని సిట్ గుర్తించింది. హైదరాబాద్‌లోని నయీం డెన్‌లో నిర్వహించిన సోదాల్లో 2 కోట్ల 8 లక్షల 52 వేల 400 రూపాయల నగదుతోపాటు 1.90 కిలోల బంగారు ఆభరణాలు, 873 గ్రాముల వెండి వస్తువులు, 258 సెల్‌ఫోన్లు, వేర్వేరు వ్యక్తుల పేర్లతో ఉన్న 203 రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పేలుడు పదార్థాలు, ఖరీదైన కార్లు, ద్విచక్ర వాహనాల్ని అప్పటిలో పోలీసులు అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
నయీం ఇంట్లో పట్టుబడ్డ వంటమనిషి ఫర్హానా పేరిట హైదరాబాద్, సైబరాబాద్‌తో పాటు రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో సుమారు 30 నుంచి 40 ఇళ్లు, ఇంటి స్థలాలు రిజిస్ట్రేషన్ చేసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఫర్హానా పేరుతో ఉన్న ఆస్తుల విలువే వందల కోట్లు ఉంటుందని సమాచారం. చరాస్తుల గురించి అనుమానం లేకపోయినా కూడా స్థిరాస్తుల గురించి మాత్రం పలు అనుమానాలు చెలరేగుతున్నాయి.
ఆ ఆస్తులన్నీ కూడా పరాధీనం అయ్యాయని కూడా కొందరు అంటున్నారు. రాజకీయ నాయకులు ఆ ఆస్తులను గుర్తించి తమ పేరిట మార్చుకున్నారని కూడా అంటున్నారు. అప్పటిలో నయీం తన పేరు మీద, తన కుటుంబ సభ్యులు, అనుచరుల పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములను ప్రభుత్వం ఎలా స్వాధీనం చేసుకుంటుందనేది సమస్యగా ఉండేది. ఒకసారి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తేకే అన్ని హక్కులూ లభిస్తాయి.
బెదిరింపులతో ఆస్తులు కూడపెట్టుకున్నా అన్ని ఆస్తులను సంపాదించే శక్తి నయూంకు లేదన్న కారణాలతో అక్రమాస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని అప్పటిలో అనుకున్నారు. అయితే అక్రమాస్తులను బాధితులకు అప్పగించే విషయంలో చట్టపరమైన సమస్యలు వస్తాయని కూడా అప్పటిలో భావించారు. బెదిరించి బలవంతంగా తీసుకుని రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములు కాబట్టి వాటిని బాధితులకు అప్పగించాలనే వాదన ఉంది.
పోలీసు అధికారులు, ప్రభుత్వ పెద్దలు కూడా దాన్ని తొలుత సమర్థించారు. ఈ ప్రక్రియ న్యాయస్థానం ద్వారానే జరగాల్సి ఉంటుంది. అయితే, ఆక్రమించుకున్న ఆస్తులు బాధితులకు అప్పగించేందుకు సాంకేతికపరమైన సమస్యలు వచ్చాయి. ఆక్రమణల్లో నయీం చట్టబద్దమైన వ్యూహాన్ని అనుసరించాడు.
నయీం రెండు రకాలుగా ఆస్తులు సంపాదించేవాడు. తన అనుచరుల ద్వారా ఆస్తుల సమాచారం సేకరించి, వాటి యజమానులకు ఎంతో కొంత ముట్టజెప్పి ఆక్రమించుకునే వాడు. ఎవరైనా భాగస్వామ్య వివాదాలతో తన వద్దకు వస్తే ఇద్దర్నీ కాదని ఆ ఆస్తిని తనపరం చేసుకునేవాడు. ఆక్రమించుకున్న ఆస్తులను నయానోభయానో చట్టబద్ధంగా తన పేరుతోనే, అనుచరులు, బంధువుల పేరుతోనే రిజిస్ట్రేషన్ చేయించుకునేవాడు. సంబంధిత దస్త్రాలన్నీ తన వద్దనే ఉంచుకునేవాడు.
అయితే ఎన్ కౌంటర్ తర్వాత నయీం భూములు ఏమయ్యాయి అనే అంశంపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తి స్థాయి న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ వినిపిస్తున్నది. చూడాలి మరి సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారో.