38.2 C
Hyderabad
April 29, 2024 19: 46 PM
Slider సంపాదకీయం

కోనసీమ తగలబడటానికి కారణం ఎవరు?

#konasema

ప్రశాంతంగా ఉన్న కోనసీమ ఒక్క సారిగా భగ్గుమనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న పలు మెదళ్లను తొలచివేస్తున్నది. అయితే దీనికి సమాధానం దొరకడం లేదు. కోనసీమ జిల్లాకు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం వల్లే ఇలా జరిగిందని అందరూ అనుకుంటున్నారు.

అంబేద్కర్ పేరు పెట్టడం వల్ల కోనసీమలో ఎక్కువగా ఉన్న కాపు కులస్తులు, శెట్టిబలిజ కులస్తులు మానసిక సంఘర్షణకు లోనై ఉద్యమం చేపట్టారని కూడా అందరూ అనుకుంటున్నారు. కోనసీమ జిల్లా సాధన సమితి కోనసీమ జిల్లాకు అదే పేరు ఉండాలని, అంబేద్కర్ పేరు పెట్టాల్సిన అవసరం లేదని చెబుతున్నది.

అక్కడ ఈ సంస్థ ఆందోళన చేస్తున్నది కానీ ఎక్కడా ఏ రోజూ కూడా పరిధి దాటలేదు. నిరసన కార్యక్రమాల పేరుతో పట్టుమని పది మంది కూడా రాని విధంగా అక్కడ ఉద్యమం ఉంది. ఈ ఉద్యమాన్ని ఎవరూ కూడా సీరియస్ గా తీసుకోలేదు. ఒక్క సారిగా వేలాది మంది కార్యకర్తలు వచ్చేసి మంత్రి ఇంటిని, ఎమ్మెల్యే ఇంటిని తగులబెట్టేంత ఊపు లేదనేది జగమెరిగిన సత్యం.

మరి అలాంటిది ఒక్క సారిగా జనం ఎక్కడ నుంచి వచ్చారు? మంత్రి ఇంటిని తగులబెట్టే సాహసం ఎలా చేశారు? ఇలా విధ్వంసం పెద్ద ఎత్తున జరగడం కోనసీమ లాంటి ప్రశాంతమైన ప్రాంతంలో సాధ్యమేనా? ఈ ప్రశ్నలన్నీ ఒక్క చోటకు వచ్చి ఆగిపోతున్నాయి.

అదే ‘‘రాజకీయం’’. అంబేద్కర్ పేరు ఉంచాలి అని అంటే అక్కడ ఎక్కువగా ఉన్న కాపులు, శెట్టిబలిజలకు ఆగ్రహం వస్తుంది. అంబేద్కర్ పేరు తీసేయాలి అంటే అక్కడ ఉన్న దళితులకు ఇతర మైనారిటీలకు కోపం వస్తుంది. అంబేద్కర్ పేరు పెట్టాలి, కాపులకు, శెట్టిబలిజలకు కోపం రాకూడదు. అందుకోసం ఏం చేయాలి? పేరు పెట్టి మంచి పేరు మనం తీసుకుని ఆగ్రహాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టాలి….. ఇదే స్ట్రాటజీ ఇప్పుడు కోనసీమను మంటల్లో పడేసింది.

కోనసీమకు అంబేద్కర్ పేరు వద్దు అనే కమిటీలో ఎక్కువ మంది కాపు నాయకులు ఉన్నారు. వీరంతా జనసేన పార్టీతో కూడా సంబంధం కలిగి ఉన్నవారే. ఇది అక్కడ సహజం. అందుకే ఎవరూ పెద్దగా దీని గురించి ఆలోచించలేదు. సీరియస్ గా కూడా తీసుకోలేదు.

పైగా ఉద్యమాన్ని శాంతియుతంగా చేయాలని మొదటి నుంచి వారు చెబుతూనే ఉన్నారు. ఏ మాత్రం ఆవేశం పొందినా తమ తమ గ్రామాలలోనే ఉన్న దళిత సోదరుల మనసు నొచ్చుకుంటుందని కాపు నాయకులు చెబుతూనే ఉన్నారు. అందుకే ఉద్యమాన్ని శాంతియుతంగా చేస్తున్నారు.

సంఘటన జరిగిన రోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు….. గ్రామంలోకి అసాంఘిక శక్తులు వచ్చాయని, వాటిపట్ల అప్రమత్తంగా ఉండాలని…. ఇలా చెబుతున్న వారు హింస చేయలేరు కదా? ఎవరో అసాంఘిక శక్తులు ఉద్యమంలోకి చొరబడి ఈ దురాగతానికి పాల్పడ్డారనేది సుస్పష్టం.

ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు?

ఇంత జరుగుతున్నా పోలీసులు ఏం చేస్తున్నారు? అధికారంలో ఉన్నవారు హింస జరిగినా ఫర్వాలేదు అనే సంకేతాన్ని ఇచ్చినా సరే పోలీసులు చూస్తూ ఎలా ఊరుకుంటారు? హింస చెలరేగడం కొందరికి రాజకీయంగా ప్రయోజనం కలిగించే విషయం. మరి కొందరికి అంటే జనసేన లాంటి వారికి నష్టం జరిగే అవకాశం ఉంది.

ఒక్క జనసేనే కాదు కాపు ఓట్లపై ఆధారపడిన పార్టీలకు హింస జరిగితే నష్టం వాటిల్లుతుంది. ఈ లాజిక్ తోనే అక్కడ హింసాత్మక సంఘటనలు జరిగాయి. అయితే ప్రతిఘటన లేదు కాబట్టి మనుషులకు ఎలాంటి ప్రమాదం లేకుండానే ప్లాన్ ప్రకారం నిప్పు పెట్టుకున్నారు.

జిల్లా పేరు పై ఏ మాత్రం ఆసక్తి లేని దళిత నాయకులు ఈ ఉద్యమం గురించి (కోనసీమకు అంబేద్కర్ పేరు పెట్టాలనే ఉద్యమం) గురించి పట్టించుకోనే లేదు. ఇంత పెద్ద సంఘటన జరిగిన తర్వాత కూడా హర్ష కుమార్ లాంటి దళిత నాయకులు ఏ మాత్రం స్పందించలేదు.

ఒక్క హర్ష కుమారే కాదు దళిత నేతలు ఎవరూ కూడా ఆవేశం ప్రదర్శించలేదు. అసాంఘిక శక్తులు చొరబడుతున్నాయని అనుమానం రావడమే దళిత నేతలు మౌనం పాటించడానికి కారణంగా అక్కడి ప్రజలు అంటున్నారు. ఒక్క చిన్న జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టడం అంబేద్కర్ ను అవమానించడమే అనే వాదన బయటి వారి నుంచి వచ్చింది తప్ప స్థానికులు దీనిపై పెద్దగా స్పందించలేదు.

కులాల కుంపటితో ఇప్పటికే నష్టం

కులాల కుంపటితో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ నాశనం అయింది. రెడ్డి కమ్మ కొట్లాట రాష్ట్ర పరువును పూర్తిగా దిగజార్చింది. కాపు కులస్తులు, దళితులను ప్రధాన కుల రాజకీయాలలోకి తీసుకురావాలని చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నించినా వారు తెర వెనుకే ఉండిపోయారు తప్ప తెరపైకి రాలేదు…. ఒకరితో ఒకరు తలపడలేదు.

అయితే ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తేలా చర్యలు జరుగుతున్నాయి. కమ్మ రెడ్డి తగాదా వల్ల కొన్ని కొన్ని చోట్లే రాష్ట్రానికి నష్టం జరిగింది. ఈ కుటిల రాజకీయాల్లోకి మెజారిటీ జనాభా ఉన్న కులాలను లాగితే రాష్ట్రం మొత్తం రావణ కాష్టం అవుతుంది. అందరూ ఈ సున్నితమైన అంశాన్ని గుర్తు పెట్టుకోవాలి. మా రాజకీయమే మాకు ప్రాధాన్యం అనుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ ను ఇక ఆ దేవుడు కూడా కాపాడలేడు.  

Related posts

శంకరాభరణం చిత్రానికి మరో అరుదైన గౌరవం

Bhavani

మచ్చలేని మహానేత గిరిప్రసాద్

Bhavani

తెలంగాణ ప్రభుత్వమా? కల్తీ కల్లును అరిక‌ట్ట‌లేవా?

Satyam NEWS

Leave a Comment