26.7 C
Hyderabad
May 3, 2024 11: 01 AM
Slider ప్రత్యేకం

బాలు ఆత్మ శాంతించాలంటే?

#SPBalasubrahmanyamFamily

సినిమా పాటకు పర్యాయ పదం బాలు. కోట్లాది మందికి ఆత్మానందాన్ని పంచిన అమరగాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

తెలుగు, తమిళ, కన్నడ, హిందీ  మొదలు అనేక  భాషా నటులకు, హీరోలకు వేల పాటలు పాడి, తన గొంతులో వాళ్ళ పాత్రలను పలికించి,  వారి విజయ సోపానంలో కీలక భూమిక పోషించిన నేపథ్య గాయక శిఖరం ఎస్పీబి.

ఇటు ప్రేక్షకులకు, అటు నటులకు ఆనందాన్ని పంచాడు. ఇందరికి ఆత్మానందాన్ని పంచిన బాలు ఆత్మకు  అనందం, శాంతి ఇవ్వాలి. అదే నిజమైన నివాళి.

అందులో అందరూ పాత్రధారులవ్వాలి. వీళ్లందరి కంటే ముందుగా బాలు ఆత్మకు శాంతి చేకూర్చాల్సిన బాధ్యత బాలు పిల్లలదే.

పల్లవి… చరణం…బాలుకు ప్రాణం

బాలును  ఇంతవాడిని చేసింది “పాట”. ఆ పాటపై ప్రేమతో కూతురుకు పల్లవి, కుమారుడుకి చరణ్ అని పేర్లు పెట్టుకొని బాలు మురిసిపోయాడు. ఈ మురిపం వెనుక బలమైన కోరిక  దాగివుంది.

పల్లవి, చరణ్ లు సినిమాల్లో పాటలు పాడుతూ, బాగా పేరు తెచ్చుకొని, తన వారసత్వాన్ని నిలబెట్టాలని బాలు  సంకల్పం. అది పెద్దగా నెరవేరలేదు. పల్లవి  పాడిన సందర్భాలు  ఎక్కువగా లేవు.

చరణ్ ఎప్పుడో ప్రారంభంలో కొంతకాలం, అప్పుడప్పుడు  పాడుతున్నాడు. చరణ్ కు నేపథ్య గాయకుడుగా ఇంకా  పెద్దగా గుర్తింపు  రాలేదు.

పాడి మెప్పించే లక్షణం ఉన్నా…ఎందుకో…

బాలు 50 ఏళ్ళ సినీ ప్రస్థానం సందర్బంగా విదేశాల్లోనూ, ఈ మధ్య కొన్ని వేదికల్లోనూ చరణ్ కాస్త పాడుతున్నడు. ఈ కాస్త దానికే బాలు ఎంతో మురిసిపొయ్యేవాడు.

ఇది బాలుకు కుమారుడు ఇచ్చిన తాత్కాలిక అనందం మాత్రమే. నిజం చెప్పాలంటే, పల్లవి, చరణ్ ఇద్దరు బాగా పాడుతారు. పాడించి మెప్పించే లక్షణం, గొంతు, ప్రతిభ ఇద్దరికీ ఉన్నాయి. 

సంసార జీవితంలో ఉన్న పల్లవికి ఒకవేళ సంపూర్ణంగా సాధ్యపడక పోయినా, వీలైనప్పుడు పాడుతూ వుండాలి. ముఖ్యంగా, బాలు వారసత్వాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత చరణ్ కే వుంది.

చరణ్ బాగా పాడతాడు, మంచి గొంతు,తనదైన ప్రతిభ కూడా ఉన్నాయి. బాలు కుటుంబం నుండి ప్రేక్షకులు కోరుకొనేది  మంచి పాటలు.

చరణ్, తండ్రి బాధ్యత స్వీకరిస్తావు కదూ

ఆ బాధ్యత చరణ్ చేపట్టాలి.  పూర్తిస్థాయి గాయకుడుగా  అవతారమెత్తాలి. విరివిగా  పాడాలి. అందర్నీ మెప్పించాలి. తండ్రిని తలపించాలి. అప్పుడు అందరూ సంతోషిస్తారు.

ఆత్మలనేవి వుంటే? దివ్య లోకాల్లో ఉండే బాలు ఆత్మ ఎంతో సంతోషిస్తుంది. శాంతిస్తుంది. ఆత్మలు లేకపోయినా, బాలు జీవించి ఉన్నప్పుడు పెట్టుకున్న కోరిక, ఆశయం, సంకల్పం నెరవేరుతాయి. 

బాలు నుండి చరణ్ స్ఫూర్తి పొంది,  ఆ వారసత్వం కొనసాగించాలి. ప్రేక్షకులు, పాటల ప్రేమికులు బాలును ఎప్పటికీ మర్చిపోలేరు. మరచిపోకుండా ఉండాల్సింది సినిమా పరిశ్రమ.

తెలుగు చలనచిత్ర పరిశ్రమ ముందుకు రావాలి

ముఖ్యంగా,  తెలుగు సినిమా రంగం. కోవిడ్ వల్ల, కరోనా సాకుతో బాలు భౌతికకాయ సందర్శనానికి తెలుగు పరిశ్రమకు చెందిన  వ్యక్తులు వెళ్లలేక పోయారు.

వెళ్లలేక పోయినా, బాలు పేరు మీద చిరస్థాయిగా ఉండేలా తెలుగు సినిమా పరిశ్రమ ఏదైనా బృహత్ కార్యక్రమం చేపట్టాలి. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) దానికి  నడుం బిగించాలి. చిరంజీవి వంటి పెద్దలు దీనికి నాయకత్వం వహించాలి.

ఇప్పటికైనా తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు రావాలి

రెండు తెలుగు ప్రభుత్వాలు  బాలు స్మృతిని గౌరవించాలి. ముఖ్యంగా,ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషించాలి. బాలు  సొంత ఊరు ప్రకాశం జిల్లా కందుకూరు దగ్గర మాచవరం, పెరిగిన నెల్లూరు, గడిపిన నగరి, శ్రీకాళహస్తి మొదలైన ప్రాంతాల్లో స్మృతి చిహ్నాలు ఏర్పాటు చెయ్యాలి.

బాలు ఆశయం సిద్ధించేలా నెల్లూరులో మహాకవి తిక్కన విగ్రహం, స్మృతి భవనం స్థాపించాలి.

హైదరాబాద్ లో రవీంద్ర భారతి ప్రాంగణంలోనో, శిల్పకళా వేదికలోనో, టాంక్ బండ్ పైనో, నెక్లెస్ రోడ్డులోనో బాలు కాంశ్య విగ్రహం స్థాపించాలి. అడుగడుగునా గుడి కట్టాల్సిన బాలును మరువ రాదు.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

కరోనా బారిన పడిన జర్నలిస్టులకు అకాడమీ సాయం

Satyam NEWS

భారత్ 50 కోట్ల డాలర్ల అప్పు ఇవ్వాలని శ్రీలంక వేడుకోలు

Sub Editor

సకల వసతులతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల

Satyam NEWS

Leave a Comment