ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం గుంటూరు జిల్లా నేతలే కాకుండా, ఇతర జిల్లాలకు చెందిన పార్టీ సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అచ్చెన్నాయుడు, చినరాజప్ప వంటి నేతలు చలో ఆత్మకూరులో పాల్గొన్న విషయం తెలిసిందే. వీరి సంగతి ఎలా ఉన్నా… టీడీపీ తలపెట్టిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు వియ్యంకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీని ఇబ్బంది పెట్టే ఈ తరహా కార్యక్రమాల్లోనూ బాలకృష్ణ పాల్గొనకపోతే ఎలా అని పలువురు చర్చించుకుంటున్నారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి పర్మిషన్ ఇవ్వని ఏపీ ప్రభుత్వం… టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సైతం ఆయన ఇంట్లోనే నిర్భందించింది. టీడీపీ ముఖ్యనేతలను సైతం ఎక్కడికక్కడ ఆ పోలీసులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే బాలకృష్ణ వంటి చరిష్మా ఉన్న వ్యక్తి ఈ రకమైన కార్యక్రమాల్లో పాల్గొనే ఉంటే టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొని ఉండేదని పలువురు టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. అయితే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటం వల్లే బాలకృష్ణ ఈ కార్యక్రమానికి రాలేకపోయారని మరికొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి టీడీపీలో అంతో ఇంతో చరిష్మా ఉన్న బాలకృష్ణ వంటి వాళ్లు పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమానికి దూరంగా ఉండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.