స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అంతా తామై సర్వం నడిపించిన అధికారులు ఎవరూ తప్పుచేయలేదని జగన్ ప్రభుత్వం నిర్ణయించడంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టులో సీమెన్స్ కంపెనీ వాటా 90 శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వం వాటా కేవలం 10 శాతమే.
ఈ పది శాతం నిధులను అయిన రూ.370కోట్లు వెంటనే విడుదల చేయాలని చంద్రబాబునాయుడు ఒత్తిడిచేశారని ముఖ్యమంత్రి జగన్, సీఐడీ అధికారులు చెప్పడం విడ్డూరం. అందుబాటులోఉన్న నిధుల్ని ఏ ప్రాజెక్ట్ కు ఎంత కేటాయించాలి.. ప్రాధాన్యతా క్రమంలో దేన్ని తొలుత అమలు చేయాలని నిర్ణయించే అధికారం ముఖ్యమంత్రిది.
స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ నా తొలి ప్రాధాన్యత అని చెప్పడం ముఖ్యమంత్రి గా చంద్రబాబు ఛాయిస్. ఆయనతో పాటు ఆయన నిర్ణయాన్ని కేబినెట్ సహచరులు పరిశీలిస్తారు. దానిలో తప్పేముంది? జగన్ రెడ్డికి విశాఖపట్నం రుషికొండలో గెస్ట్ హౌస్ కట్టుకోవడం తన తొలి ప్రాధాన్యత కావచ్చు. అదే విధంగా పెద్ద పెద్ద సమస్యలు పట్టించుకోకుండా సినిమా టిక్కెట్ల ధరలు కంట్రోల్ చేయడం జగన్ కు ప్రాధాన్యత కావచ్చు.
అయితే చంద్రబాబు కి రాయలసీమలో ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం తొలిప్రాధాన్యత కావచ్చు. అమరావతికి ఎక్కువ నిధులు తీసుకువచ్చి త్వరగా పూర్తి చేయడం చంద్రబాబు ప్రాధాన్యత కావచ్చు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడం చంద్రబాబు ప్రాధాన్యత కావచ్చు.
ఇలా ఎవరి ప్రాధాన్యతలు వారివి. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ కు నిధులు విడుదలచేసిన ఐ.ఏ. ఎస్ అధికారి పీవీ.రమేశే “ఇందులో ఎలాంటి తప్పు జరగలేదు” అన్నారు. గతంలో ఈ ప్రభుత్వంలో చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ ప్రభుత్వం చేసిన దానితో “భవిష్యత్ లో ఏ అధికారి.. ఏ ముఖ్యమంత్రి తనకు తానుగా సొంత నిర్ణయాలు తీసు కోలేడు” అని చెప్పారు.
దీనికి అనుగుణంగానే అన్నట్లు అవినీతి నిరోధక చట్టంలో అందుకే 17 ఏ క్లాజ్ అమలుచేశారు. ఆ క్లాజ్ లో ఏముంది అంటే ఒకస్థాయి అధికారి తప్పు చేశాడని భావించి అతనిపై కేవలం విచారణ మాత్రమే జరపాలంటే, అతని కంటే పై అధికారి, లేదా అతనికి జీతమిచ్చే అధికారి అనుమతి తీసుకోవాలని స్పష్టంగా ఉంది.
అలానే ఈ స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో నిజంగా తప్పు జరిగిందని భావిస్తే, కేబినెట్ తప్పుచేసిందని నిర్ధారణకు వస్తే, దానిపై నుండే వ్యవస్థ అయిన గవర్నర్ అనుమతి తప్పనిసరి. వైసీపీప్రభుత్వం ఈ పనిచేసిందా? గవర్నర్ అనుమతి తర్వాతే విచారణ చేపట్టాల్సిన దాన్ని, వీళ్లకు నచ్చినట్టు చేయడం, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసి, విచారించి ఆధారాలు సంపాదిస్తామని చెప్పడం ముమ్మాటికీ కక్షసాధింపే అనడంలో సందేహం లేదు.
గత 20 రోజల నుంచీ జగన్ ప్రభుత్వం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు సంబంధించి అవాస్తవాలు… అసత్యాలు… అర్థసత్యాలను ప్రజలకు చెప్పడానికి నానా తంటాలు పడుతోంది. వ్యక్తిగత విద్వేషాలతో, రాజకీయ కక్షతో చంద్రబాబుకి కష్టం కలిగించారు కానీ, అంతిమంగా జగన్ ప్రభుత్వం రాష్ట్ర యువత జీవితాల్లో నిప్పులు పోసింది అనేది ఇప్పుడు చాలా మంది చెబుతున్న మాట.
చంద్రబాబు హయాంలో అప్పటి ఏపీ ప్రభుత్వం అమలుచేసిన స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ ను ప్రశంసిస్తూ కేపీఎంజీ, నీతి అయోగ్, సెంట్రల్ షిప్పింగ్ శాఖ ఇచ్చిన ప్రశంసాపత్రాలు ఉన్నాయి. అవేవీ జగన్ ప్రభుత్వానికి, సీఐడీకి కనిపించవు.. ఎక్కడా జరగని, జరిగినట్టు చెప్పడానికి ఎలాంటి ఆధారాలులేని అవినీతి మాత్రమే కనిపిస్తుంది అని కూడా సాధారణ ప్రజలు వ్యాఖ్యానిస్తున్నారు. శిక్షణ పొందిన 2లక్షలమంది యువతకు ఇచ్చిన సర్టిఫికెట్లు ఉన్నాయి.
ఉద్యోగాలు చేస్తున్నవారు కళ్లముందున్నారు.
శిక్షణా కేంద్రాల ప్రిన్సిపాల్స్ తమకు అన్నిఅందాయనిచెబుతూ ఇచ్చిన లేఖలున్నాయి. శిక్షణా కేంద్రాల్లోని పరికరాలు సాఫ్ట్ వేర్ కు సంబంధించిన వీడియోలున్నాయి. మరి ప్రభుత్వం ఇచ్చిన నిధులన్నీ పక్కదోవ పడితే మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? ఇదే ప్రశ్న అందరూ అడుగుతున్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసుతో జగన్ ప్రభుత్వం తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అయింది.