39.2 C
Hyderabad
April 28, 2024 12: 57 PM
Slider ప్రత్యేకం

కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎందుకు వెళుతున్నారు?

#kcr

తెరాస అధినేత కేసీఆర్ దృష్టి జాతీయ రాజకీయాల వైపు మళ్ళడానికి కారణాలు ఏమిటి అనే విషయంలో రాజకీయ వర్గాలలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతకాలం క్రితం వరకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి సహకరిస్తూ వచ్చిన కేసీఆర్ ఒక్కసారిగా కేంద్రంలో కాంగ్రెసేతర కూటమి ఏర్పాటుకు చిరవచూపడం పరిశీలకుల దృష్టిని ఆకర్షించింది.

నల్లడబ్బు వెలికతీసేందుకు అనే నెపంతో హటాత్తుగా ప్రకటించిన పెద్ద నోట్ల రద్దు, వివాదాస్పద పౌరసత్వ పరిరక్షణ సవరణ చట్టం, విద్యుత్ రంగానికి సంబంధించిన దిస్కం ల ఏర్పాటు, ట్రిపుల్ తలాక్ వంటి సున్నితమైన అంశాలు తెరపైకి వచ్చిన సమయాలలో తెరాస అధినేత మోదీ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు.

తెరాస, బీజేపీ ఒకే తాను ముక్కలని ప్రతిపక్ష టీ.కాంగ్రెస్ అనేక సార్లు విమర్శించినా గట్టిగా ఖండించకపోవడంతో ఈ రెండు పార్టీల మధ్య పరస్పర రాజకీయ ప్రయోజనాల కోసం అవగాహన ఉన్నదన్న అనుమానం మరింత బలపడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణకు రావాల్సిన నిధుల వాటా విషయంలో కొన్ని న్యాయపరమైన చిక్కులు ఉన్నా కేంద్రం తెలంగాణను ఆర్థికపరంగా ఆదుకున్నదని విమర్శకులు అంటున్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి వెళ్ళే ఆదాయంలో తెలంగాణకు ఇవ్వాల్సిన వాటా కంటే ఎక్కువగానే మోదీ ప్రభుత్వం చేయూత ఇచ్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

అయితే..తెరాసతో దోస్తీ ఉన్న ఓవైసీ కి చెందిన ఎమ్ ఐ ఎం పార్టీ ఉత్తరాది రాష్ట్రాలలో బలం పుంజుకోవడం సహించని బీజేపీ తెలంగాణ లో తెరాస, ఎమ్ ఐ ఎమ్ ల మధ్య ఉన్న అవగాహనను అనైతిక పొత్తు గా వర్ణిస్తూ ఆ రెండు పార్టీల మధ్య ఆజ్యం పోయడానికి విఫలయత్నం చేసింది.

దీనికి తోడు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తరచూ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు తెరాస, బీజెపీల మధ్య రాజకీయ వైరాన్ని పెంచాయి. తెరాసలో బలమైన సీనియర్ నేత ఈటెల రాజేందర్ బీజెపీ పక్షాన గెలవడం ఆ పార్టీకి కొత్త ఉత్సాహం ఇచ్చింది. తెరాస 8 ఏళ్ళ పాలన చూసిన తెలంగాణ సమాజంలో కొన్ని అంశాలలో అసంతృప్తి మొదలైంది.

దాన్ని తనకు అనుకూలంగా మార్చుకునే  ప్రయత్నాన్ని బీజెపీ స్వీకరించింది. వడ్లు కొనుగోలు అంశం పై కేంద్రంతో ముఖాముఖి ఢీ కొట్టడానికి కేసీఆర్ కు అస్త్రం దొరికింది. రైతుల సమస్యకు పరిష్కారం చూపలేని మోదీ సర్కారును గద్దె దించాలని కేసీఆర్ లో మొండి పట్టుదల పెరిగింది. కేంద్ర ప్రభుత్వం తో వ్యతిరేకత ఉన్న పలు రాజకీయ పార్టీలతో కలిసి పని చేయడానికి ఆయన ముందడుగు వేశారు.

మమతా బెనర్జీ, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, కేజ్రీవాల్ వంటి నేతలను కలిసి వారితో జాతీయ స్థాయి ప్రత్యామ్నాయం కోసం చర్చలు జరపడం ఆ ప్రయత్నంలో భాగమే. జాతీయ స్థాయిలో బీజెపీ కి వ్యతిరేకంగా కాంగ్రెస్ లేని రాజకీయ పార్టీల ఏకీకరణ ఎంత మేరకు సాధ్యం అనే విషయంలో ఆయా నేతలకు వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నాయి.

ఆసక్తి కలిగిస్తున్న కేసీఆర్ రాజకీయం

ఇప్పటికీ దాదాపు 25 శాతం ఓట్ బ్యాంక్ ఉన్న కాంగ్రెస్ తో పొత్తు లేకపోతే బీజీపీ దూకుడును ప్రతిఘటించడం అసాధ్యం అని శివసేన వంటి పార్టీలు అంటున్నాయి. జాతీయ స్థాయిలో ఏదో ఒక ఐక్య కార్యాచరణ అమలుకు అవకాశం ఉందని రాజకీయ వర్గాలు ఉత్కంఠ భరితంగా ఎదురుచూస్తున్న సమయంలో తెరాస అధినేత కేసీఆర్ జాతీయ స్థాయిలో భారత రాష్ట్రీయ సమితి లేదా భారత నిర్మాణ సమితి అనే పేరుతో కొత్త రాజకీయపార్టీ పెట్టడానికి సిద్ధపడటం ఆసక్తి కలిగించే అంశం.

తనపై అక్రమంగా కేసులు బనాయించి భయపెట్టాలని చూస్తే సహించేది లేదని కేసీఆర్ బహిరంగ యుద్ధం ప్రకటించడం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనేది ప్రధాన చర్చనీయాంశం.

జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టడం అంటే ఇప్పటి వరకు ఇతర పార్టీల నేతలతో సాగించిన చర్చలకు చరమ గీతం పాడినట్లేనా? లేక ఇదంతా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ వెనుక ఉండి కేసీఆర్ ను నడిపిస్తున్న రాజకీయ మంత్రాంగం అనుకోవాలా?

మిగిలిన నేతలు అడపా దడపా మోదీ నిర్ణయాలను, పరిపాలనా తీరును విమర్శించినా కేసీఆర్ విమర్శిస్తున్న స్థాయిలో లేవన్నది గమనార్హం. బంగారు తెలంగాణ నినాదం మాదిరిగానే బంగారు భారత్ నినాదంతో దేశ రాజకీయాల్లో దూసుకు వెళ్ళడానికి కేసీఆర్ కు ఉన్న బలం, బలహీనతలు బేరీజు వేసుకోకుండా మోదీ ప్రభంజనాన్ని ఢీ కొనేందుకు సాహసిస్తున్నారని విమర్శకులు అంటున్నారు.

ఏది ఏమైనా రానున్న రోజుల్లో కేంద్ర రాజకీయ చిత్రపటంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయని వారు అంచనా వేస్తున్నారు. అది కేసీఆర్ నేతృత్వంలో నడిచే పలు ప్రాంతీయ పార్టీల సహకారం పై ఆధార పడి ఉంటుంది. అయితే..ప్రస్తుతం మోదీ చరిష్మాతో పోటీ పడగల జాతీయ స్థాయి నేత ఎవరూ ఇప్పట్లో కనిపించడం లేదని విశ్లేషకులు అంటున్న మాటల్లో నిజం లేకపోలేదు.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ సామాజిక విశ్లేషకుడు

Related posts

బూతు…. బూతు…: రేవంత్ రెడ్డిపై తొడగొట్టి బూతులు మాట్లాడిన మంత్రి

Satyam NEWS

పోలవరంలో సీఎం జగన్ ఏరియల్ సర్వే

Satyam NEWS

ఉచిత విద్యుత్‌‌పై రేవంత్‌ రెడ్డి క్లారిటీ

Bhavani

Leave a Comment