26.7 C
Hyderabad
May 3, 2024 08: 24 AM
Slider సంపాదకీయం

న్యూ డైమన్షన్: భోగి మంటల కోసం గుడిసె తగలబెడతామా?

jagan y s

తెలంగాణ లో ప్రతిపక్షం బలహీనంగా ఉంది. అనైక్యతతో ఉంది. అందువల్ల సిఎం కేసీఆర్ ఏం చేసినా నడుస్తుంది. మరి ఆంధ్రప్రదేశ్ లో అలాగే నడిపించాలని అక్కడి ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్షం అత్యంత బలంగా ఉంది. పైగా వివిధ డైమన్షన్లతో ఉంది.

తెలుగుదేశం, జనసేన, బిజెపి -ఈ మూడు పార్టీలూ విపరీతమైన బలంతో ఉన్నాయి. శాసనసభలో 150 సీట్లు ఉండటం ఒక్కటే బలం కాదు మరేదో కావాలి అని ప్రతి రోజూ చెబుతున్నాయి. ఈ సమయంలో తప్పులు చేయడం ప్రభుత్వానికి మంచిది కాదు. అయితే తప్పులు చేస్తున్నట్లు గుర్తించనట్లు నటిస్తూ తప్పులు చేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

ఈ తప్పులను తప్పులు కాదు మేం చేసేదే కరెక్టు అని నిరూపించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రతి రోజూ ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అన్నీ కూడా వివాదాస్పదంగానే ఉన్నాయి. రాజకీయ పరంగా చూడటం కాదు. పాలనా పరంగా కూడా తప్పులే కనిపిస్తున్నాయి.

ఇసుక సరఫరాకు కొత్త విధానం రూపొందించకుండా పాత విధానాన్ని రద్దు చేయడం నుంచి అమరావతి నుంచి రాజధానిని మార్చడం వరకూ అన్నీ పాలనాపరమైన తప్పులే. అమరావతిని ఎక్కడ మార్చారండీ జర్నలిస్టు అయి ఉండి మీరు కూడా ఇలాగే చెబుతారా అని కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి లాగా బూతులు మాట్లాడవచ్చు. కానీ జరుగుతున్నది అదే. అమరావతి రాజధానిగా ఉంటే మీకు వచ్చిన నష్టం ఏమిటి?

అక్కడ కమ్మోళ్లు ఎక్కువగా ఉన్నారనా? అక్కడ కమ్మోళ్లు ఎక్కువ ఉంటే గెలిచింది మీరే కదా? మీ ఎమ్మెల్యేలే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కదా? సంక్రాంతి తర్వాత విశాఖపట్నం నుంచి పాలన సాగిస్తారని అనుకుంటున్నారు. ప్రభుత్వం ఏదీ స్పష్టంగా చెప్పదు కాబట్టి ఎవరికి తెలియదు.

ఇంత గోప్యంగా చేయడం అన్ని సమయాలలో సాధ్యం కాకపోవచ్చు. విశాఖపట్నంలో కొత్త భవనాలు కట్టారా? గత ప్రభుత్వ నిర్మించిన భవనాలలోనే కొత్తగా ఆఫీసులు పెడుతున్నారా? అధికార వికేంద్రీకరణ అంటే ఏమిటి మూడు నాలుగు రాజధానులు పెట్టేయడమా? అలాగైతే దేశ రాజధానులు ఎన్ని ఉండాలి? ప్రధాని ఎన్ని రాష్ట్రాలలో ఆఫీసులు పెట్టుకోవాలి? ఇలా ప్రాంతీయ వాదనలు ప్రభుత్వమే రెచ్చగొడుతుంటే ప్రజల ఏం చేయాలి?

అదే ఆంధ్రప్రదేశ్ లో అర్ధం కావడం లేదు. సమస్యల్ని చంద్రబాబు మీదకు నెట్టేద్దాం అనుకోవడం కలకాలం సాధ్యం కాకపోవచ్చు. చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి మేమూ చేస్తాం అంటే మీరూ 23కు రావాల్సి ఉంటుంది కదా? తెలుగుదేశం పార్టీని నాశనం చేద్దాం అనుకుంటే చాలా మందికి అభ్యంతరం ఉండకపోవచ్చు. అయితే ఇప్పుడున్న రాజధానిని నాశనం చేద్దాం అనుకుంటే చాలా మంది సహకరించకపోవచ్చు.

తెలుగుదేశం పార్టీని నాశనం చేసేందుకు సహకరించిన వారే కొత్త శక్తులు పుట్టుకురావడానికి సహకరిస్తారని ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి గుర్తుంచుకోవడం మంచిది.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఇప్పుడు కొత్త సవాళ్లు రావడం గ్యారెంటీ. జనసేన బిజెపి కలిసి పని చేయబోతున్నాయి. మాకేంటి 151 ఉన్నాయి అని అనుకోవచ్చు కానీ పరిస్థితి అలా ఉండదు. బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ.

జన సేన ఇప్పటి వరకూ ఏపి ప్రజలు ట్రై చేయని పార్టీ. తెలుగుదేశం పార్టీని డైల్యూట్ చేసినంత సులభంగా జనసేనను చేయడం కుదరకపోవచ్చు. తెలుగుదేశం పార్టీపై కుల ముద్ర ఉండటం వల్ల మీకు లాభం చేకూరింది. జన సేన బిజెపి కాంబినేషన్ లో అది మీకు ఎడ్వాంటేజ్ కాదు. కొన్ని రోజులు గడిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ కూడా ఈ రెండు పార్టీలతో కలిసి పని చేయవచ్చు.

అప్పుడు వైసిపికి నిద్రలేని రాత్రులు గడపాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అమరావతి రైతులు అనుభవిస్తున్న విధంగా. పోలీసు వ్యవస్థను, కమ్మ కుల వ్యతిరేకత అడ్డం పెట్టుకుని రాజ్యం చేయడం చాలా కాలం కుదరకపోవచ్చు. బహుశ పైన చెప్పిన అన్ని పరిస్థితులు వైసిపి నాయకులకు ఇప్పటికే క్షేత్ర స్థాయిలో అనుభవంలోకి వస్తున్నట్లున్నాయి. అందుకే వైసిపి నాయకులు పచ్చి బూతులు తిడుతున్నారు.

ల కారంతో మొదలయ్యే పదాలు ఉపయోగిస్తున్నా అడ్డు చెప్పకపోవడం ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తికి సబబు కాదు. అంతకు ముందు మంత్రులు కూడా ఇలానే మాట్లాడారు. వారిని ఆపకపోవడం వల్ల ఇప్పుడు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. తక్షణమే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిపై చర్య తీసుకుంటే కొంత వరకైనా ప్రజలు అర్ధం చేసుకోవడానికి వీలుంటుంది.

అలా కాకపోతే పార్టీ అధ్యక్షుడి మనసులో ఉన్న మాటలే ఎమ్మెల్యే మాట్లాడినందుకే ఆయనను వదిలేశారని అనుకోవాల్సి వస్తుంది. అమరావతి మహిళా రైతులను దారుణంగా విమర్శించిన పృథ్వి కూడా ముఖ్యమంత్రి మెప్పు కోసమే చేశాడు. అయితే పదవి కోల్పోవాల్సి వచ్చింది. అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా పృథ్వి ఎగ్జాంపుల్ ను తీసుకుని ఎవరి హద్దుల్లో వారు ఉండాలి. 151 స్థానాలు ఉన్న పార్టీ ఎంతో సౌలభ్యంగా పాలన సాగించాలి. అయితే అలా జరగడం లేదు. పాపం 150 మంది టెన్షన్ లోనే ఉన్నారు. ఒక్కరు తప్ప.

Related posts

ప్రజాధనం వృధా: కడప నగరంలో అన్నా క్యాంటీన్ కూల్చివేత

Satyam NEWS

కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యంపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

మూషిక జింకల పునరుత్పత్తిపై తెలంగాణకు ప్రశంసలు

Satyam NEWS

Leave a Comment