మైనారిటీ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం మానుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షి బ్లీ మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు అనుకూలంగా ఉంటుందనుకున్న వైసీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని అన్నారు. ఈ నెల 11 న జరిగే భారత దేశ మొట్ట మొదటి విద్యా శాఖ మంత్రి భారతరత్న అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకల సమయంలో జీవో నెంబర్ 393 విడుదల చేయడం సబబు గా లేదని ఆయన అన్నారు. అందులో ఉస్మానియా యూనివర్సిటీ వ్యవస్థాపకులు ఆంధ్రరాష్ట్ర వాసి అయిన డాక్టర్ అబ్దుల్ హక్ పేరుతో ఉన్న అవార్డుని తొలగించడం, గతంలో 2 లక్షల 50 వేల రూపాయలు ఉన్న అబ్దుల్ కలాం ఆజాద్ నేషనల్ అవార్డు పైకాన్ని లక్ష రూపాయలకు కుదించటం, బెస్ట్ ఉర్దూ టీచర్ అవార్డు గ్రహీతలకు ఇచ్చే పైకాన్ని పది వేల రూపాయల నుండి ఐదు వేల రూపాయలకు కుదించడం, ప్రతి ఏటా 8 మందికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చేవారు కానీ వాటిని 8 నుండి నలుగురికి కుదించటం అత్యంత దారుణమైనటువంటి సంఘటన అని ఆయన అన్నారు. ఇది మాత్రమే కాకుండా నవంబర్ 11న మైనారిటీ డే, ఎడ్యుకేషన్ డే అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలు జరుగుతాయని తెలిసి కూడా అదే రోజున పరీక్షలు నిర్వహించడం తర్వాత తప్పును తెలుసుకుని సరిదిద్దటం, అదే విధంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి తెలియకుండానే మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాన్ని డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి పేరుతో మార్చడం కరెక్టుగా లేదని ఆయన అన్నారు. దాన్ని తీవ్రంగా ఖండించిన ఫలితంగా మరల ఏపీజే అబ్దుల్ కలం పేరుతోనే ప్రతిభా పురస్కారాలు ఇవ్వాలని అని ఆదేశాలు ఇవ్వడం హర్షణీయం. అయితే మైనారిటీ మంత్రిత్వ శాఖ అధికారులు ఏం చేస్తున్నారు అని ఆయన ప్రశ్నించారు? ఈ సమస్యలను సానుకూలంగా పరిష్కరించే విధంగా కృషి చేయాలని ఫారూఖ్ షిబ్లీ డిమాండ్ చేశారు.
previous post