37.2 C
Hyderabad
April 21, 2024 17: 22 PM
Slider ప్రత్యేకం

కన్ఫ్యూజన్: నిమ్మగడ్డ లేఖపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేతలు

Ambati Rambabu

రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌ కుమార్ పేరు మీద సర్క్యులేట్‌ అవుతున్న లేఖపై తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ ప్రధాన కార్యాలయంలో ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, కె.పార్దసారథి, జోగి రమేశ్‌లు ప్రెస్‌మీట్‌ పెట్టారు. వారు మాట్లాడిన విషయాల్లో ముఖ్యమైనవి:

ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు, ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, దాని నిర్ణయాలను తప్పుబట్టిందన్న వార్త మీడియాలో వస్తే దాన్ని డైవర్ట్‌ చేయడానికి ముందుగానే ఒక పథకం ప్రకారం ఒక ఉత్తరాన్ని కేంద్ర హోంశాఖకు ఎన్నికల కమిషనర్‌ రాసినట్టుగా సర్క్యులేట్‌ చేయడం ద్వారా ఆ పన్నాగాన్ని అమలు చేయడానికి టీడీపీ, దాంతోపాటు 5–6 ఛానళ్ల ప్రతినిధులు చేసినట్టుగా మాకు నిర్దిష్ట సమాచారం అందింది.

ఏం జరిగిందో ఒక్కసారి క్లుప్తంగా చెప్తాం. ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వాయిదాకు సంబంధించి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిర్ణయాలను పక్కనపెట్టి కోడ్‌ను ఎత్తివేసింది. అంతేకాకుండా ఇకపై తేదీలు ప్రకటించే ముందు రాష్ట్ర ప్రభుత్వంతో తప్పనిసరిగా సంప్రదించాలని తేల్చిచెప్పింది.

ఎన్నికల వాయిదాతో రాజకీయ కోణాలున్న అభిప్రాయాలను తానే వ్యక్తంచేసింది. ఈ మొత్తాన్ని ఇంతకు ముందే 4 గంటలకు ముందే ప్రజలకు చెప్పాం. ప్రభుత్వ అడ్వకేట్‌ జనరల్‌ కూడా చెప్పారు. ఆ తర్వాత ఉన్నట్టుండి 5 పేజీల లేఖ ఒక దాన్ని మీడియాకు వదిలారు. ఎవరు వదిలారు? ఎందుకు వదిలారు? ఎలా వదిలారు?

అనే విషయాలు ఒక క్రైం స్టోరీలో భాగంగా కనిపిస్తున్నాయి. ఒక కుట్రలో భాగంగా కనిపిస్తున్నాయి. మాకు తెలిసినంత వరకూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న మూడు ఎల్లో ఛానళ్లతో పాటు మరో రెండు పత్రికల రిపోర్టర్లు ఇందులో నేరుగా తమ పాత్ర పోషించారు. ఇంతకీ ఈ ఉత్తరం అసలుదా? నకిలీదా? అని నిర్ధారించుకున్న తర్వాతనే మా పార్టీ ప్రతిస్పందించాలని నిర్ణయించుకుంది.

కాబట్టే ప్రభుత్వంలో అత్యున్నత అధికారులను మేం సంప్రదించాం. వారే కేంద్ర హోంశాఖ వారితో నేరుగా మాట్లాడి నిమ్మగడ్డ రమేశ్‌ అనే పేరుమీద ఉన్న ఈ మొయిల్‌ నుంచి తమకు ఈ లేఖ వచ్చిందని అధికారికంగా ధృవీకరించారు. లేఖ పంపిన ఆ మెయిల్‌ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌దా? కాదా? అనే విషయం మాకు తెలియదు.

ఆయనే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ట్విస్ట్‌ ఏంటంటే.. ఎన్నికల కమిషన్‌ ఈ లేఖ రాశారని ఎల్లో ఛానళ్లలో ముందు హడావిడి జరిగింది. ఆ తర్వాత నిమ్మగడ్డ రమేశ్‌ మరి ఎక్కడకు వెళ్లారో మాకు తెలియదు. ఆయన ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు.

కాని ఈ సాయంత్రం ఎన్నికల కమిషన్‌ కార్యాలయం నుంచి ఆయన బయటకు వెళ్లిపోతున్నప్పుడు మాత్రం కొంతమంది విలేఖరులు ఈ ఉత్తరం మీరే పంపారా? అని సూటిగా అడిగితే నేను ఎవరికీ పంపలేదు, నాకు సంబంధం లేదని సమాధానం ఇచ్చారని మాకు తెలిసింది.

కాని.. కేంద్ర హోంశాఖ కార్యదర్శికి తన లెటర్‌ హెడ్‌ పేరుమీద… తన సంతకంతో లేదా? తన సంతకంలాంటి సంతకంతో 5 పేజీల లేఖ ఒకటి మీడియాలో వచ్చిందని, అదీ తెలుగుదేశం మీడియాలో వస్తే.. అది అవునో, కాదో స్పష్టం చేయకుండా కొన్ని గంటలుగా నిమ్మగడ్డ రమేశ్‌ చోద్యం చూస్తున్నారంటే… ఈ కుట్రలో నేరుగా ఆయన్ని భాగస్వామిగా చేస్తూ చంద్రబాబు, ఆయన అనుకూల మీడియా ప్రతినిధులు చేసిన కుట్రగానే భావించాల్సి వస్తుంది.

ఈ విషయాన్ని తన పేరిట ఒక ఫేక్‌ లెటర్‌ సృష్టించి మీడియాలో ప్రధానంగా వస్తుంటే… ఆయన ఆ విషయాన్ని నేరుగా రాష్ట్ర పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? తన పేరుమీద అధికారికంగా ఎందుకు ఖండన ఇవ్వలేదు. మరో ముఖ్యాంశం ఏంటంటే.. తెలుగుదేశం తాబేదార్లు అయినా 5–6 మీడియా రిపోర్టర్లు పనిగట్టుకుని ఎందుకు ఫార్వార్డ్‌ చేయాల్సి వచ్చింది?

ఈ అంశాలపై ఒక పార్టీగా మేం, ఒక ప్రభుత్వంగా ప్రభుత్వాధికారులు కూడా తీవ్రంగా పరిగణించి.. రేపు ఏపీ డీజీపీకి ఫిర్యాదు ఇవ్వడమే కాకుండా దీనివెనుక ఉన్న మొత్తం కుట్రను ఛేదించాల్సిందిగా అభ్యర్థిస్తాం. ఇక ఈ ఉత్తరం రమేశ్‌ కుమార్‌.. రాశాడా? లేదా అన్నది ఒక అంశం అయితే… ఇది ఎల్లోమీడియానే భుజాన మోసింది కాబట్టి.. .ఇది పచ్చిగా తెలుగుదేశం పార్టీ ఆఫీసులోనే తయారు అయ్యిందన్నది నగ్నసత్యం.

లేని పక్షంలో ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి కొన్ని ఛానళ్లు దీనిమీద అంత ప్రేమ చూపవన్నది అంతకుమించిన సత్యం. ఏది ఏమైనా ఇందులో కొన్ని ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు సమాధానం ఇస్తున్నాం. అందులో మొదటి ఆరోపణ ఈ ఎన్నికల ప్రక్రియను హడావిడిగా ప్రకటించాం అన్నది.

మార్చి 31 లోపు ముగించడానికి మేం ప్రయత్నిస్తున్నాం అన్నది. నిజానికి ఈ ఎన్నికలు 2018లోనే జరగాలి. అవి జరపనిది చంద్రబాబు ప్రభుత్వం. 2019 జూన్‌లో మేం అధికారంలోకి వచ్చిన వెంటనే మరీ ముఖ్యంగా 3–4 నెలలుగా ఈ ఎన్నికలు వెంటనే నిర్వహించాలని మేం ప్రయత్నిస్తుంటే.. కోర్టుకు వెళ్లింది చంద్రబాబు మనుషులు. కాబట్టి… ఆలస్యానికి కారణం చంద్రబాబే తప్ప, మేం కాదు.

ఈ ఎన్నికలు సత్వరం పూర్తిచేయడానికి మేం చివరకు సుప్రీంకోర్టుకూ వెళ్లాం. నిమ్మగడ్డ ఉత్తరంలో ఈ వాస్తవాలు లేవు. అదీకాక ఎన్నికలు వాయిదా వేసినప్పుడు మొన్న చూపిన కారణాలు… ఇవాళ ఎందుకు కనిపించలేదు? ఎలక్షన్లు పోస్ట్‌పోన్‌చేసి వ్యవహారంలో సీఎస్‌కు రాసిన లేఖలో ఈ అంశాలేవీ కూడా లేవు.

అంతేకాదు… సుప్రీంకోర్టులో ఇవాళ జరిగిన విచారణ సందర్భంలో కూడా మీ వాదనల్లో ఈ లేఖలోని అంశాలు ఒక్కటైనా కనిపించాయా? అని అడుగుతున్నాం. సుప్రీంకోర్టు తీర్పు మీకు వ్యతిరేకంగా వచ్చింది కాబట్టే.. ఇవాళ కొత్త కారణాలను చూపిస్తూ.. ఈ లేఖను సృష్టించారు. ఏకగ్రీవాల గురించి ఈ లేఖలో రాశారు.

2014తో పోలిస్తే.. అనూహ్యంగా ఏకగ్రీవాలు జరిగాయని, ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనూ, జిల్లాలో కూడా ఏకగ్రీవాలు అనూహ్యంగా ఉన్నాయని లేఖలో రాశారు. ఈ సందర్బంగా మేం ఒక్కటే చెప్తున్నాం. 175 స్థానాల్లో 151 స్థానాల్లో గెలుపొందాం. 86శాతం స్థానాల్లో గెలిచాం.

చంద్రబాబుకు వచ్చినవి కేవలం 14శాతం సీట్లు. అదే రిపీటైతే ఎన్ని గెలవాలి? మేం. పైగా ఈ 9 నెలల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన విధంగా 90శాతం పనులు కళ్లముందే కనిపిస్తున్నాయి. ప్రజలు మెచ్చుకునే పాలన చేస్తున్నాం. రైతు భరోసా, అమ్మ ఒడి, పెన్షన్ల పెంపు, ఇంటివద్దకే పరిపాలన, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ, కొత్తగా 4.5 లక్షల ఉద్యోగాలు… ఇలా చరిత్రలో ఉన్నడూలేని విధంగా పనులు చేశాం.

అవినీతికి తావులేకుండా జ్యుడిషియల్‌ ప్రివ్యూ పెట్టాం, రివర్స్‌ టెండరింగ్‌తో ప్రజల ఖజానాను ఆదా చేశాం. అట్టడుగును ఉన్న వారి అభ్యున్నతికోసం ఎన్నో చర్యలు తీసుకున్నాం. రిజర్వేషన్లు, పదవులు, పనుల్లో వారికి 50శాతం రిజర్వేషన్లు ఇచ్చాం. మహిళా సాధికారిత కోసం చాలా పనులు చేశాం. మహిళల ప్రభుత్వంగా పనిచేశాం.

ఎక్కడా జరగని విధంగా పథకాలను మహిళల పేర్లమీదే అందిస్తున్నాం. దిశలాంటి చట్టాన్ని తీసుకువచ్చాం. ఈ రకంగా గొప్పపాలన అందిస్తున్నాం. గత సాధారణ ఎన్నికల్లో 86 శాతం స్థానాల్లో కాదు, 90 శాతం స్థానాల్లో విజయాలు సాధించాలి. మా నాయకుడు జగన్‌కి పులివెందుల నియోజకవర్గంలో వచ్చిన మెజారిటీ ఎంత? అదే సమయంలో కడప జిల్లాల్లో 10 కి 10 స్థానాలు సాధించామా? లేదా?

కర్నూలు, విజయనగరం, నెల్లూరు జిల్లాల్లో కూడా క్లీన్‌ స్వీప్‌ చేయలేదా? మరి మాకు ఎన్ని సీట్లు రావాలి? ఎన్ని ఏకగ్రీవాలు కావాలి. మీ బాధ ఏంటంటే.. సుప్రీంకోర్టు తీర్పు వల్ల కోడ్‌ ఎత్తేశారు. ఫలితంగా పేదలకు ఇళ్లపట్టాలు వస్తున్నాయి. మీరు రానీయకుండా అడ్డుకోవాలని నానా ప్రయత్నాలు చేశారు. అది కుదర్లేదు. ఇప్పుడు రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంది. అది తట్టుకోలేకే ఈ కుట్రలు పన్నుతున్నారు. ఈ లేఖ మీద ఎన్నికల కమిషనర్‌ అధికారికంగా స్పందించాలి. మరోవైపు ఈ లేఖ నిజమో, కాదో తెలియకముందే… నేరుగా  కేంద్ర హోంమంత్రికి కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడం హాస్యాస్పదం.

Related posts

ఏపిపిటిడిఏఈఏ రాష్ట్ర నూత‌న క‌మిటీ ఆవిర్భావం

Satyam NEWS

బ్రహ్మోత్సవాలలో శాస్త్రోక్తంగా చక్రధారుడి చక్రస్నానం

Satyam NEWS

మళ్ళీ పెరిగిన పెట్రోల్,డీజిల్ ధరలు

Sub Editor 2

Leave a Comment