38.2 C
Hyderabad
May 3, 2024 20: 41 PM
Slider సంపాదకీయం

జరుగుతున్న పరిణామాలతో దిగాజారుతున్న ప్రతిష్ట

#Y S Vivekanandareddy

ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర ఇబ్బందికరంగా మారాయి. ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరుడు, కడప ఎంపి వై ఎస్ అవినాష్ రెడ్డి అరెస్టుకు అడ్డుకోవడానికి అనుసరిస్తున్న వైఖరితో బాటు మరణించిన వివేకా వ్యక్తిగత విషయాలపై చేస్తున్న ప్రచారం పార్టీని మరింత డ్యామేజీ చేస్తున్నది.

వివేకానందరెడ్డి అంటే సౌమ్యుడని, మంచి వ్యక్తి అనే నమ్మకంతో ఉన్న వైసీపీ శ్రేణులు తాజాగా వైసీపీ అధికార పత్రికలో ఆయనపై చేస్తున్న ప్రచారం చూసి తట్టుకోలేకపోతున్నారు. వై ఎస్ రాజశేఖరరెడ్డి తర్వాత అంతటి నాయకుడుగా పేరు పొందిన వై ఎస్ వివేకానందరెడ్డి వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారంతో వైసీపీ అభిమానులకు వైసీపీ అంటేనే చిరాకు పుడుతున్నది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐ అధికారులు దూకుడుగా విచారణ జరుపుతున్నారు.

ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిల చుట్టూ కేసు తిరుగుతోంది. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన కోర్టుల్లో పిటిషన్లు వేస్తూ తాత్కలికంగా ఎలాగో ఊరట పొందుతున్నారు. ఆ హత్యకూ తమకు ఏం సంబంధించలేదని అనవసరంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన గగ్గోలు పెడుతున్నారు. తనకు ఆ హత్యకు సంబంధం లేదని చెప్పే క్రమంలో వివేకా వ్యక్తిగత జీవితంపై బురదచల్లడం వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి.

వైఎస్ వివేకా వివాహేతర సంబంధాల గురించి ఎక్కువగా చెబుతున్న అవినాష్ రెడ్డి, వైఎస్ వివేకా హత్య కేసుతో తనకు సంబంధమే లేదని అవినాష్ రెడ్డి గట్టిగా చెబుతున్నారు. ఆయన పదే పదే కోర్టుల్లో వైఎస్ వివేకా వివాహేతర సంబంధాల గురించి చెబుతున్నారు. వివేకా హత్యకు మహిళలతో ఉన్న వివాహేతర సంబంధాలే కారణమంటూ ఆయన తాజాగా దాఖలుచేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు.

అయితే A 2 సునీల్ యాదవ్ తల్లితో పాటు ఉమాశంకర్ రెడ్డి భార్యతో కూడా వివేకాకు సంబంధం ఉన్నట్లుగా ఆరోపించారు. మొదట వివేకానందరెడ్డి రెండో పెళ్లి గురించి చెప్పారు. ఆయన ముస్లిం కుమారుడు.. వారసుడు.. ఆస్తి గొడవలు అని చెప్పారు. తర్వాత విచ్చలవిడి లైంగిక సంబంధాల గురించి చెబుతున్నారు. వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్‌లో సునీల్ యాదవ్ తల్లిని వేధించడం వల్లే సునీల్ యాదవ్ చంపేశాడని చెబుతున్నారు.

వైఎస్ వివేకా చనిపోయిన రోజున ఏం జరిగిందో అందరికీ తెలుసు. మొదట గుండె పోటు అని ప్రచారం చేశారు. హైదరాబాద్‌లో ఉన్న వివేకా కుమార్తె, అల్లుడు రాక ముందే ఖననం చేయాలనుకున్నారన్న ప్రచారమూ జరిగింది. పోస్టుమార్టం నిర్వహించలేదు. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని.. పోస్టుమార్టంకు పంపించారు. అప్పటి వరకూ అందరూ గుండెపోటు అనే ప్రచారం చేశారు.

పోస్టుమార్టంలో గాయాలు బయటపడిన తర్వాతనే హత్య అని అంగీకరించారు. అదే సమయంలో వివేకా ఇంట్లో సాక్ష్యాలు మాయం చేసేందుకు ప్రయత్నించారు. రక్తాన్ని తుడిచేశారు. ఇవన్నీ పోలీస్ రికార్డుల్లో ఉన్నాయి. మృతదేహానికి కట్లు కట్టారు. ఇదంతా జరిగినప్పుడు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఎందుకో ఈ సాక్ష్యాలను పకడ్బందిగా నమోదు చేసి నిందితులను అప్పుడే అరెస్టు చేసి ఉంటే సరిపోయి ఉండేది కానీ హత్య కేసులో చొరవ తీసుకోవడం ఇబ్బంది అని భావించో లేక అప్పటికే ఎన్నికల సమయం దగ్గరపడ్డందునో ఆయన ఎలాంటి చర్యలు తీసుకోలేకపోయారు.

ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వివేకానందరెడ్డి హత్య కేసును పరిష్కరించేందుకు ఎంతో సమయం ఆయనకు దొరికింది. వివేకానందరెడ్డికి మహిళలతో ఉన్న అక్రమ సంబంధాల వల్లే ఈ హత్య జరిగిందని అవినాష్ రెడ్డి తన అఫిడవిట్ లలో చెబుతున్నదే నిజమైతే జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేసు తన వద్దే ఉన్న సమయంలో ఈ అన్ని ఆరోపణలతో కేసును ముగించేసి ఉండవచ్చు.

అయితే జగన్ మోహన్ రెడ్డి ఆ పని చేయలేదు. చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయి, హత్య కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్లే సమయానికి అంటే దాదాపు 11 నెలల పాటు వివేకా హత్య కేసు జగన్ ఆధీనంలోని పోలీసుల వద్దే ఉన్నది. ఆ సమయంలో సీఎం జగన్ ఆ అక్రమ సంబంధం విషయాలన్నీ రుజువులతో సహా కోర్టుకు సమర్పించి వివేకా హత్య కేసుకు ఈ పాటికే ఫుల్ స్టాప్ పెట్టి ఉండవచ్చు.

కడప ఎంపి, తన సోదరుడైన అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ కూడా ఈ పాటికి వచ్చి ఉండేది. అయితే సీఎం స్థాయిలో ఉన్న జగన్ ఆ చర్యలు ఏవీ తీసుకోలేదు. ఇప్పుడు వివేకానందరెడ్డికి సంబంధించిన అక్రమ సంబంధం విషయాలు అవినాష్ రెడ్డి తరచూ చెప్పడం, వాటిని సాక్షి దినపత్రిలో క్రమం తప్పకుండా ప్రచురించడం చూస్తూ వైసీపీ నాయకులే గుసగుసలు ఆడుకుంటున్నారు.

Related posts

రాజన్న సిరిసిల్ల జిల్లాలో టిఫిన్ బాక్స్ బాంబ్ కలకలం

Satyam NEWS

ప్రముఖ ర‌చ‌యిత ప‌తంజలి జ‌యంతి సంద‌ర్బంగా సాహిత్య పుర‌స్కారం

Satyam NEWS

పంద్రాగస్టు

Satyam NEWS

Leave a Comment