శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం ఉదయం చిన్నశేష వాహనసేవలో కళాబృందాలు ప్రదర్శించిన కీలుగుర్రాలు, కూటు భజన, పర్బణి నృత్యం, దాస పదాల నృత్యం, శ్రీరామపరివారం వేషధారణ భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, దాససాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈ ప్రదర్శనలు ఏర్పాటుచేశారు. పలమనేరుకు చెందిన శ్రీ ఎ.సుబ్రమణ్యం ఆధ్వర్యంలోని 15 మంది బృందం కీలుగుర్రాల నృత్యాన్ని ప్రదర్శించింది. ఇందులో 4 గుర్రాలు, ఒక మరకాళ్లు(కర్రలతో నడిచే పొడవైన వ్యక్తి), ఒక కావడి, డప్పు వాయిద్యాలు ఉన్నాయి. డప్పు వాయిస్తుండగా కీలుగుర్రాలు, ఇతర కళాకారులు లయబద్ధంగా నృత్యం చేశారు. తిరుపతికి చెందిన కె.రాజేశ్వరి ఆధ్వర్యంలోని గరుడాద్రి కోలాట బృందం 15 మంది కళాకారులు కోయ వేషంలో కూట భజన చక్కగా చేశారు. అనంతపురానికి చెందిన వేదవతి ఆధ్వర్యంలోని 35 మందితో కూడిన శ్రీ కృష్ణ భజన మండలి బృందం పురందరదాస పదాలకు చక్కటి నృత్యం చేశారు. అదేవిధంగా, తిరుపతికి చెందిన రాజమోహన్ ఆధ్వర్యంలో 35 మందితో కూడిన శ్రీ మదానందనిలయ వాస భజన మండలి బృందం రాధాకృష్ణుల అన్యోన్యాన్ని నృత్యరూపంలో ప్రదర్శించారు. ఇందులోని కళాకారులు కృష్ణుడు, రాధ, గోపికల వేషధారణలో చక్కగా నృత్యం చేశారు. విశాఖకు చెందిన శ్రీ వెంకటకృష్ణ అన్నమయ్య సంస్థానం నాయకురాలు సి.విజయలక్ష్మి ఆధ్వర్యంలో 15 మంది శ్రీరామ పరివారం వేషధారణతో అలరించారు. ఇందులో రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయుడు, సుగ్రీవుడు, వాలి, శబరి వేషధారణ ఆకట్టుకుంది. మహారాష్ట్రకు చెందిన నాదబ్రహ్మ శిక్షణ సంస్థ అధ్యక్షుడు రాం మాధవ్ కాజలే ఆధ్వర్యంలో 54 మంది కళాకారులు పర్బణి నృత్యాన్ని చక్కగా ప్రదర్శించారు