38.2 C
Hyderabad
April 29, 2024 21: 17 PM
Slider విశాఖపట్నం

విశాఖలో క్రూయిజ్ టెర్మినల్ ప్రారంభానికి సిద్ధం

#Visakhapatnam

విశాఖపట్నం ఔటర్ హార్బర్లో క్రూయిజ్ కమ్ కార్గో టెర్మినల్ నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు పర్యాటక శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ ప్రకటించారు. అలాగే విశాఖపట్నంలో పర్యాటకుల సౌకర్యార్ధం సీ ప్లేన్‌ సర్వీసులను ప్రారంభించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.

రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి ఈ అంశంపై అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి మౌఖికంగా జవాబులు ఇచ్చారు. అయిదేళ్ళ క్రితం విశాఖపట్నం ఔటర్ హార్బర్లో క్రూయిజ్ బెర్త్ నిర్మాణానికి అనుమతులు జారీ అయినప్పటికీ ఇప్పటికీ పనులు పూర్తికాని విషయం వాస్తవమేనా అన్న ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ విశాఖపట్నం పోర్టులోని ఔటర్ హార్బర్లో క్రూయిజ్ కమ్ కార్గో బెర్త్ నిర్మాణానికి అయ్యే వ్యయంలో కొంతమేర నిధులు సమకూర్చవలసిందిగా పోర్టులు, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ చేసిన విజ్ఞప్తికి 2018-19లో పర్యాటక మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపిందని మంత్రి వెల్లడించారు. క్రూయిజ్-కమ్-కార్గో బెర్త్ నిర్మాణానికి 77 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ (విపిటి) ప్రతిపాదించింది.

ఇందులో సగం మొత్తం అంటే 38.50 కోట్ల రూపాయలు పర్యాటక మంత్రిత్వ శాఖ భరించడానికి సిద్ధమైంది. మిగిలిన మొత్తం విపిటి తన సొంత నిధుల నుంచి ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. పర్యాటక మంత్రి శాఖకు సంబంధించిన వాటా మొత్తం 38.50 కోట్ల రూపాయల నిధులను విపిటికి విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు.

విపిటి అభ్యర్ధన మేరకు 2019లో ఈ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు అథారిటీ ముందుగా నౌకా దళం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసి) తీసుకోవాలని సూచించింది. నౌకా దళం ఈ ప్రాజెక్ట్‌కు 2021 జూలైలో ఆమోదం తెలుపుతూ ఎన్‌వోసి జారీ చేసిన అనంతరం అదే ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర పర్యావరణ ప్రభావ మదింపు అథారిటీ కూడా పర్యావరణ అనుమతులు మంజూరు చేసిందని మంత్రి వివరించారు.

ఈ క్రూయిజ్‌ టెర్మినల్‌ 2023 ఏప్రిల్‌ నాటికి పూర్తి చేయనున్నట్లు అప్పటి విపిటి చైర్మన్‌ ప్రకటించినప్పటికీ పనులు పూర్తికాక ఇంకా ప్రారంభానికి ఎందుకు సిద్ధం కాలేదని విజయసాయి రెడ్డి అడిగిన అనుబంధ ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ 2020-21లో రెండు దశలుగా వచ్చిన కోవిడ్‌ మహమ్మారి కారణంగా పనులు స్తంభించిపోయినందునే నిర్మాణంలో జాప్యం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం 2500 మంది ప్రయాణికులు క్రూయిజ్‌ నౌకలో ప్రయాణించడానికి వీలుగా నిర్మిస్తున్న క్రూయిజ్‌ బెర్త్‌ను భవిష్యత్తులో 5 వేల మంది ప్రయాణికుల సామర్ధ్యానికి విస్తరించే ఆలోచన ఉందా అన్న ప్రశ్నకు మంత్రి జవాబు ఇవ్వలేదు. పర్యాటకుల కోసం విశాఖలో సీ ప్లేన్‌ సర్వీసులను ప్రారంభించే ప్రతిపాదనకు సంబంధించి ప్రస్తుతం సర్వే నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు.

Related posts

అంగరంగ వైభవంగా జేడ్పీ చైర్మన్ బిడ్డ..నిశ్చితార్థం..

Satyam NEWS

పదోన్నతుల కోసం విద్యా మంత్రికి టిఎస్పిటిఎ వినతి

Satyam NEWS

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు.. ఇద్దరు యువకులు మృతి

Bhavani

Leave a Comment