36.2 C
Hyderabad
April 27, 2024 22: 34 PM
Slider జాతీయం

పర్యావరణానికి పెద్ద పీట: ‘ప్రాజెక్ట్ చీతా’

#projectchitaa

ఒకప్పుడు మనదేశంలో చిరుతపులులు చాలా పెద్దసంఖ్యలో ఉండేవి. సింహాలు, ఏనుగులు, పులులు వంటి పెద్ద జంతువులతో పాటు అనేక పరిమాణాల్లో, ఆకృతుల్లో,వివిధ జీవలక్షణాలతో కోట్లాది జీవరాసులు ఉండేవి. అవి చాలా వరకూ అంతరించిపోయాయి. ఉన్న జంతుజాలం సంఖ్య కూడా ఒకప్పటితో పోల్చుకుంటే బాగా తగ్గిపోయింది. అటువంటి హీన,దీన పరిస్థితిల్లోనే చిరుత కూడా వుంది.

దక్షిణాఫ్రికా నుంచి 12 చీతాలను (చిరుత పులులు) ప్రత్యేక విమానంలో మనదేశానికి తెచ్చుకున్నాం. దక్షిణాఫ్రికాతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఇవి మన దగ్గరకు చేరుకున్నాయి. వీటిని మధ్యప్రదేశ్ లోని శ్యోపూర్ జిల్లా కునో జాతీయ పార్కుకు తరలించారు. ఈ సందర్భాన్ని మనవారు పెద్ద సంబరంలా భావించి వేడుక చేసుకున్నారు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ వీటిని పార్క్ లోకి విడుదల చేశారు. “మహాశివరాత్రి రోజు మధ్యప్రదేశ్ కు ప్రత్యేక కానుక అందింది,

ప్రధానమంత్రి నరేంద్రమోదీకి కృతజ్ఞతలు”అంటూ ముఖ్యమంత్రి ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్ 17 వ తేదీ నాడు తన పుట్టినరోజు నాడు ప్రధాని నరేంద్రమోదీ 8 చీతాలను కునో నేషనల్ పార్కులోకి విడిచి పెట్టి గొప్ప సందర్భంగా చాటిచెప్పారు. ఆ చీతాలు నమీబియా నుంచి అప్పుడు తెప్పించారు. ప్రస్తుతం మరో 12 చీతాలు చేరడంతో వాటి సంఖ్య పెరిగింది. వచ్చే పదేళ్ల వరకూ ప్రతి సంవత్సరం ఏడాదికి 12 చిరుతపులుల చొప్పున దిగుమతి చేసుకొనేలా కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది.

1948లో మధ్యప్రదేశ్ లో చివరి చీతా మరణించినట్లుగా చెప్పుకుంటూ వస్తున్నారు. 1952లోనే అంతరించిన జాతుల జాబితాలోకి చిరుతను చేర్చారు. వన్యప్రాణుల సంరక్షణ,పర్యావరణ సమతుల్యత,అడవుల అభివృద్ధి మొదలైన ఆశయాలతో ప్రభుత్వాలు ముందుకు సాగుతున్నాయి. ఇది ప్రశంసించాల్సిన అంశమే. గతంలోనూ, ఇప్పటి వరకూ మనిషి చేస్తున్న దుర్మార్గాలు,ప్రభుత్వాల అలసత్వం ఎప్పుడు తలచుకున్నా దుఃఖాన్నే మిగులుస్తాయి.

ఏవో లెక్కలు చెబుతున్నారు కానీ చిరుతలు మన అడవుల్లో ఏదొక స్థాయిలో,ఎక్కడో చోట,ఎంతోకొంత సంఖ్యతో ఉంటాయి కానీ, పూర్తిగా అంతరించాయని చెప్పడం సరియైనది కాదని కొందరు జీవశాస్త్రవేత్తల వ్యాఖ్య. దండకారుణ్యం లోనూ, తూర్పు కనుమల్లోనూ చిరుతలు నేటికీ ఉండకపోవని వారి విశ్వాసం. ఎక్కడో ఎందుకు? మన ప్రకాశం జిల్లా కనిగిరి కొండ ప్రాంతంలో నిన్న మొన్నటి వరకూ చిరుతలు ఉండేవని ఆ ప్రాంతవాసులు నేడు గుర్తు చేసుకుంటున్నారు. మేకలను బయటకు వదిలినప్పుడు చిరుతలు వాటిని చంపేసి తినేవని వీరు చెబుతున్నారు.

ఒక కనిగిరిలోనే కాదు, దేశంలోని మిగిలిన చోట్ల కూడా దాదాపు ఇదే పరిస్థితి ఉండేదని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. రాచరికపు రోజుల్లోనూ, బ్రిటిష్ వారి పాలనలోనూ జంతువేట ఒక క్రీడగా,దర్పానికి దర్పణంగా భావించేవారు. అలా జంతుహింస పెరిగిపోయింది. జంతు జాతులు అంతరించడం పెరిగింది. అరణ్యంలో సింహం -పులి -చిరుతపులి ‘ఆహారపు లింక్’ ( ఫుడ్ చైన్ ) ఒక క్రమం.

ఇవన్నీ తినేది శాఖాహారులైన జంతువులను, అడువులు,చెట్లు, జంతువులు,జలరాశి ఇవన్నీ కలిస్తేనే ఒక పెద్ద సంపద. వాటి మధ్య సమతుల్యత ఏ మాత్రం దెబ్బతిన్నా వినాశనమే. ఈ పాపంలో ఎక్కువ భాగం మనిషిదేనని నిపుణులు చెబుతున్నారు. ఈ చేదు సంఘటనలు,అనుభవాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ‘ప్రాజెక్ట్ చీతా’ను ప్రారంభించింది. శ్రీశైలం వంటి అడువుల్లోనూ ఈ ప్రాజెక్టులను స్థాపించాలని, ఈ తరహా ప్రయత్నాలు ముమ్మరం చేయాలని సూచిస్తున్నారు. చిరుతల్లో నలుపు,తెలుపు రెండు రకాలు ఉంటాయి.

మామూలు పులికంటే వీటి నడక వేగం చాలా ఎక్కువ. వీటి చర్మాన్ని,అవయవ భాగాలను అక్రమంగా అమ్ముకొని సొమ్ము చేసుకొనే బృందాల వల్ల కూడా ఎంతో నష్టం జరిగింది. ఇప్పటికీ స్మగ్లింగ్ జరుగుతూనే ఉంది. పరిశీలిస్తే ఒక విషయం అర్ధమవుతోంది….స్వాతంత్ర కాలంలో మనదేశంలో 30 కోట్ల మంది మానవ జనాభా ఉంటే నేడు 140 కోట్లకు చేరుకుంది. అంటే నాలుగురెట్లకు పైగా పెరిగింది, పెరుగుతోంది. పాపం! జంతుజాలం మాత్రమే తరగిపోతోంది. అదీ దుస్థితి. మనిషి మారితేనే, మనిషితనం మిగిలితేనే భవిష్యత్తులో మనిషన్నవాడు మిగులుతాడని మనిషి తెలుసుకోవాలి.

-మాశర్మ, సీనియర్ జర్నలిస్టు

Related posts

బాపునగర్ లో ఆషాకిరణ్ సెంటర్ ప్రారంభం

Satyam NEWS

మాజీ జడ్జి శ్రవణ్ కుమార్ దీక్షకు రఘురామ మద్దతు

Satyam NEWS

యాదాద్రి గోపురానికి కిలో బంగారం ఇచ్చిన మంత్రి పువ్వాడ

Satyam NEWS

Leave a Comment