30.7 C
Hyderabad
April 29, 2024 06: 29 AM
Slider ప్రత్యేకం

కరోనా లెసన్: సమస్య వారిది కాదు దేశానిది

#Migrant Labour

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

కరోనా సృష్టించిన విలయానికి ఘోరంగా నష్టపోయిన వారిలో  వలస కార్మికుల దుస్థితి మరింత దయనీయంగా ఉంది.

పొట్టచేత పట్టుకుని గ్రామసీమల్ని వదిలి పట్టణాలకు, నగరాలకు వలసవస్తున్నవారి సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతోంది.

జన్మనిచ్చిన పల్లెల్ని కాదని బీద, మధ్యతరగతి వర్గాల ప్రజలు వలస బాట పట్టాడా నికి గల కారణాలను జాతీయ స్థాయి సర్వే సంస్థలు సోదాహరణంగా వివరించాయి. పల్లెలలో చేసేందుకు పని దొరకని నిస్సహాయత సామాన్య ప్రజలను వలసదారులుగా మార్చినట్లు సర్వే ఫలితాలు తెలిపాయి.

ఆర్ధిక వత్తిడి తెచ్చిన వలసలు

చిన్న , సన్న కారు రైతులు, వ్యవసాయ కూలీలు దిక్కుతోచని దుర్భర స్థితిలో దగ్గరలో ఉన్న పట్టణాలు, నగరాలకు తరలివస్తున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. సామాజిక, ఆర్ధిక సమస్యల ఒత్తిడి కూడా పెరగడంతో వలసలు సాధారణమయ్యాయి.

వలస వచ్చినవారు నిర్మాణ రంగం, ఆహారఉత్పత్తి రంగం, చిన్న, మధ్యతరగతి పరిశ్రమలలో రోజువారీ కూలీలుగా చేరి కాలం వెళ్ళ దీస్తున్నారు. ఇటువంటి వారిని అసంఘటిత కార్మికులుగా వ్యవహరిస్తారు. భారతదేశంలో దాదాపు12 మిలియన్లమంది వలస కార్మికులు ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

రోడ్డున పడ్డ లక్షలాది మంది వలస కూలీలు

ఇటీవల దేశంలో కరోనా ఉధృతి కారణంగా విధించిన అనిశ్చిత లాక్ డవున్ లక్షలాదిమంది వలస కార్మికులను రోడ్డున పడేసింది. బీహార్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి దిల్లీ, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు, అహ్మదాబాద్ వంటి నగరాలకు,  అనేక  పట్టణాలకు వలస వచ్చిన ప్రజలు ఒక్కసారిగా నిరుద్యోగులైపోయారు.

 ఉండటానికి వసతి లేక, చెయ్యడానికి పని దొరక్క లాక్ డవున్ ప్రకటించిన నాటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ జీ ఓ లు నిర్వహించిన సర్వేల ప్రకారం వలస కార్మికులలో  33 % మంది దగ్గర కేవలం రూ.200-500 ఉన్నట్లు, 60 నుంచి 80 శాతం వారి దగ్గర రూ.100 లోపు ఉన్నట్లు తెలిసింది.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వాలు, కొన్ని స్వచ్చంద సంస్థలు, పౌర సంఘాలు కొంతమేర ఆహార సదుపాయాలు అందించారు. ఐనా, లక్షలలో ఉన్న వలసదారులను గుర్తించి వారి అవసరాలు తీర్చడం కష్టసాధ్యం. ఎట్టకేలకు అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో కేంద్రప్రభుత్వం స్పందించి వలస కార్మికులను వారి వారి స్వస్థలాలకు పంపడానికి తగు ఏర్పాట్లు చేయాల్సిందిగా రైల్వే మంత్రిత్వశాఖను, ఆయా రాష్ట ప్రభుత్వాలను ఆదేశించింది.

స్పష్టత లేని విధానంతో మరింత నష్టం

కానీ వలస కార్మికుల రవాణా ఖర్చు ఎవరు భరించాలనే అంశంపై కేంద్రం-రాష్ట్రాల మధ్య స్పష్టత లోపించడం శోచనీయం. కరోనా విపత్తు సంభవించిన సందర్భంలో అతి ముఖ్యమైన కార్యాచరణ కోసం  బేరసారాలు చోటు చేసుకోవడం సభ్యదేశాలలో భారతదేశం  పరువు తీయవద్దని ప్రజాస్వామ్య ప్రియులు ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ వంటి ప్రతిపక్షాలు అవసరమైతే వలస కార్మికుల రవాణా ఖర్చులు తామే భరిస్తామని ప్రకటించాయి. చివరికి మధ్యేమార్గంగా ఒక నిర్ణయానికి రావడంతో వలసదారుల రవాణాకు మార్గం సుగమమైంది. వారు స్వస్థలాలకు సురక్షితంగా తిరిగివెళ్తున్నారు.

తేలికపాటి వైరస్  వైద్యపరీక్షలతో వారిని స్వగ్రామాలకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడే కొత్త సమస్య ఉత్పన్నమవుతోంది. లాక్ డవున్ ను దశలవారీ సడలిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో పునఃప్రారంభమైన రంగాలు కార్మికులు దొరక్క ఇబ్బందులు పడుతున్నాయి.

వట్టిపోతున్న పల్లెలు కిటకిటలాడే నగరాలు

ప్రయాసపడి గ్రామీణ ప్రాంతాలకు తిరిగివచ్చిన ప్రజలు సరైన జీవనోపాధి దొరక్కపోతే వారి పరిస్థితులు మరింత దుర్భరంగా మారడం ఖాయమని విశ్లేషణలు వినవస్తున్నాయి. ఇది ఏ ఒక్క దేశానికో సంబంధించిన సమస్య కాదు. ప్రపంచ పరిస్థితుల రీత్యా పల్లెల నుంచి పట్టణాలకు ప్రతిఏటా లెక్కలేనంతమంది వలసపోతున్నారు.

ఈ వలసల కారణంగా మురికివాడల విస్తరణ, పర్యావరణానికి హాని మొదలు  అనేక సామాజిక సమస్యలు తలెత్తుతాయి. వీటన్నింటికి పరిష్కారంగా వలస ప్రక్రియను క్రమబద్ధీకరించడం మంచిదని కొందరు సామాజిక శాస్త్రవేత్తలు అంటున్నారు. ఒక నగరం లేదా పట్టణం ఏటా ఎంతమందికి ఆశ్రయం కల్పించగలదో అంచనా వేసి వలస దారులను అనుమతిస్తే శ్రేయస్కరమని వారు సూచిస్తున్నారు.

పట్టించుకునే నాథుడే లేని జీవితాలు

కొత్తగా వచ్చే వారికి కనీస మౌలిక వసతులు కల్పించడం, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత వంటి అంశాలలో వారికి సలహాలు, సూచనలు అందించడం పని కల్పించే వారు బాధ్యతగా స్వీకరించాలని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఇప్పటి కైనా మించిపోయిందిలేదు.

కరోనా నేర్పిన  పాఠంగా గుర్తించి  ప్రభుత్వాలు సానుకూలంగా స్పందిస్తే వ్యవసాయ అనుబంధ కుటీర పరిశ్రమలు, గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించదగిన చిన్న,మధ్యతరహా పరిశ్రమలు ప్రజలకు కనీస జీవనోపాధి కల్పిచే అవకాశం ఉంది. సహజంగా లభించే ప్రకృతి వనరులను సక్రమంగా వినియోగిస్తే కొద్దిపాటి శిక్షణతో గ్రామస్తులు లబ్ధి పొందగలరని గ్రామీణ వికాసాభిలాషులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఎక్కడ ప్రజలు అక్కడే ఉండి గ్రామసీమల్ని బంగారు సీమలుగా మార్చగల ప్రణాళికలు ప్రభుత్వాలు, స్థానిక సంస్థలు  సిద్ధం చేసి అమలుచేస్తే భారతదేశం రానున్న రోజులలో అభివృద్ధి చెందిన దేశాల సరసన గర్వంగా తలెత్తి నిలబడగలదని ప్రజాస్వామ్య ప్రియుల ఆకాంక్ష.

కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

19 నుంచి ఏపి శాసనసభ సమావేశాలు?

Satyam NEWS

కడప లో రాష్ట్ర మత్స్య శాఖ కమిషనర్ కు చుక్కెదురు

Bhavani

మాస్క్ ధరించని వారికి ఇక నుంచి జరిమానాలు

Satyam NEWS

Leave a Comment