24.2 C
Hyderabad
July 20, 2024 19: 00 PM
Slider ప్రత్యేకం

‘ప్రతిభా మారుతం’ గొల్లపూడికి నమస్సుమాంజలి

gollapudi 12

నేను 1967వ సంవత్సరం చివర్లో (నవంబరు 29) పుట్టాను. మారుతిరావు గారు నాకంటే 28 ఏళ్లు వయస్సులో పెద్దవారు. వారి చిన్నబ్బాయి వాసుకంటే కూడా నేను చిన్నవాడిని. నా జీవితప్రయాణంలో, ఈ రోజు గొల్లపూడి వారి గురించి నాలుగు మాటలు రాసే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను.

అంతే అశ్చర్యంగానూ ఉంది. మారుతిరావుగారు మొట్టమొదటిగా ఒక సినిమా నటుడిగానే నాకు తెలుసు. నేను ఇంటర్మీడియెట్ చదివే సమయంలో చూసిన ఇంట్లో రామయ్య.. వీధిలో కృష్ణయ్య, తరంగిణి సినిమాల్లోని వారి పాత్రలు యిప్పటికీ పదిలంగా నా మదిలో ఉన్నాయి. బి.ఎస్సీ., మొదటి సంవత్సరంలో ఉండగా, గుంటూరు జిల్లా నరసరావుపేటలో మా యింటి పక్కన ఒక కుటుంబం ఉండేది.

వారింట్లో ఎటు చూసినా నవలలే. వారి ద్వారా గొల్లపూడి వారి గురించి యింకొంచెం ఎక్కువగా తెలుసుకోగలిగాను. మారుతిరావుగారు కేవలం నటుడే కాదని, గొప్ప రచయిత అని అప్పుడే నాకు తెలిసింది. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడ ముగ్గురు మహాకవులు కలిసి మహాభారతం అనే మహాకావ్యం నిర్మించారన్నది మనందరికీ తెలిసిన విషయమే.

ఆ మహాకవులతో, ఆ మహాకావ్యంతో పోలిక కాకపోయినప్పటికీ… ముగ్గురు ఆధునిక రచయితలు కలిసి ఒకే నవల రాశారని 1985లో తెలుసుకున్నాను. దాని పేరు ‘ఇడియట్.’అందులో ఇద్దరు కొమ్మూరి వేణుగోపాలరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు కాగా, మూడవవారు గొల్లపూడి మారుతిరావుగారు.

ఈ ముగ్గురిలో ఎవరిని ఎప్పుడు తలుచుకున్నా, నాకు మొట్టమొదటగా గుర్తొచ్చేది ఈ అంశమే. మారుతిరావు గారు 1980ల్లో, 1990ల్లో సినిమాల్లో విజృంభించారు. విలక్షణ పాత్రలు వేశారు. సలక్షణమైన నటనను ప్రదర్శించారు. ముఖ్యంగా వారి పాత్రల్లో విశాఖపట్నం ప్రాంతపు యాస పరికిణీలు కట్టి పరవశించింది. ‘అభిలాష’ వంటి ఎన్నో సినిమాల్లోని వారి పాత్రలు ఈ యాసకు అద్దం పడతాయి.

కె. విశ్వనాథ్ గారి మొట్టమొదటి సినిమా ‘ఆత్మగౌరవం’కు వీరే రచయిత. ఆ సినిమా తెలుగు సినిమా ఆత్మగౌరవాన్ని ఎంత పెంచిందో చరిత్ర చెబుతుంది. నాకు చిన్నప్పుడు ఎంతో యిష్టమైన ఎన్టీఆర్ ‘ఆరాధన’ సినిమాకూ వీరే రచయిత అని, కాలంలో తెలుకున్నప్పుడు పులకించిపోయాను.

1990 ప్రారంభ దశలో నేను విజయవాడలో ఉండగా మారుతిరావుగారి ఎన్నో ఉపన్యాసాలను రోటరీ క్లబ్ వేదికపై విన్నాను. మధ్యమధ్యలో చెప్పే ఎనక్డోట్స్, మలయమారుతంలా వచ్చిపోయే ఇంగ్లీషు వాక్యాలతో సాగే ఆ ప్రసంగాలు ఇప్పటికీ నాకుదృశ్యమానాలే. మారుతిరావు గారిది గొప్ప ఉపన్యాస శిల్పం. ఉపన్యాసం అంటే ఇలా ఉండాలి… అని నా మెదడుపై ఆనాడే ముద్రపడిపోయింది.

1996లో నేను విశాఖపట్నం వచ్చిన తరువాత మారుతిరావుగారితో ప్రత్యక్ష పరిచయం ఏర్పడింది. అది ఈ 23 ఏళ్లలో దినదిన ప్రవర్థమానమైంది. ఈ రోజు వారి కోసం ఇలా ఒక ఆర్టికల్ రాసే దశకు చేరింది. 2001లో విశాఖకు చెందిన ప్రముఖ కాంట్రాక్టర్ ఎం. వెంకటరావుగారు ‘కన్యాశుల్కం’ సీరియల్ నిర్మించారు. రావి కొండలరావుగారు దర్శకత్వం వహించిన ఈ సీరియల్ లో ప్రధానమైన గిరీశం పాత్రని గొల్లపూడి మారుతిరావు గారు పోషించారు.

ఈ నిర్మాణంలో నేనూ కొన్ని బాధ్యతలు పంచుకున్నాను. ఈ దశలో మా ఇద్దరి పరిచయం స్నేహంగా పరిణితి చెందింది. నేను మీడియాలో ఉండడం వలన ఇద్దరమూ తరచూ కలుసుకొనే అవకాశం దక్కింది. ప్రతి ఏటా ప్రదానం చేసే ప్రతిష్ఠాత్మకమైన గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ అవార్డ్ కు సంబంధించిన మీడియా సమావేశ నిర్వహణలో ‘నేను సైతం’ అన్నట్లు మారుతిరావు గారికి కొంత సేవ చేసే భాగ్యం నాకు కలిగింది.

నేను 2002లో శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం స్థాపించినప్పటి నుండి మా ఇద్దరి బంధం మరింత దృఢమయ్యింది. పీఠం ప్రచురించిన ప్రతి పుస్తకాన్ని వారు అడిగి మరీ తీసుకొనే వారు. 2008లో మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కొప్పరపు కవుల పురస్కారం అందుకోవడానికి అంగీకరించడంలో మారుతిరావుగారి భూమిక ప్రధానమైనది.

వారి పట్ల నా కృతజ్ఞతా వీచికలు ఎప్పటికీ వీస్తూనే ఉంటాయి. నేను హెచ్.ఎం.టి.వి.లో ఉత్తరాంధ్ర న్యూస్ బ్యూరో చీఫ్ గా పనిచేసిన క్రమంలో, మారుతిరావు గారితో ఒక పరమాద్భుతమైన కార్యక్రమ నిర్వహణలో నాకు భాగస్వామ్యం దక్కే భాగ్యం ప్రాప్తమైంది. తెలుగు కథ పుట్టి అప్పటికి 100 ఏళ్లు పూర్తయింది.

ఈ అపురూప సందర్భాన్ని ఛానల్ కు అందంగా మలుచుకుందాం అనే సంకల్పం అప్పటి హెచ్ఎంటివి చీఫ్ ఎడిటర్ కె.రామచంద్రమూర్తి గారికి కలిగింది. ఇదే సమయంలో ఈ సంరంభాన్ని తెలుగు లోకంతో పంచుకోవాలనే ఆలోచన మారుతిరావు గారికీ వచ్చింది. నేను వీరిద్దరి మధ్య అనుసంధానం చేశాను. విశాఖలో మారుతిరావు గారి ఇంటికి మూర్తిగారిని తీసుకెళ్లాను. హెచ్ఎంటివిలో కథకు పట్టం కట్టే బృహత్ కార్యక్రమానికి ఇద్దరూ కలిసి శ్రీకారం చుట్టారు.

ఈ శీర్షికకు మంచి పేరు పెట్టాలి అన్నారు. అన్న వెంటనే నేను ‘వందేళ్ల కథకు వందనాలు’అన్నాను. వారు విన్న వెంటనే, ఈ పేరు చాలా బాగుందని ఆనందించారు, అంగీకరించారు. అలా ఈ శీర్షికకు పేరు పెట్టే అదృష్టం నన్ను వరించింది. ‘వందేళ్ల కథకు వందనాలు’ శీర్షిక హెచ్ఎంటివిలో చాలా విజయవంతంగా నడిచింది.

ఎన్నో గౌరవ, పురస్కారాలు తెచ్చింది. నా వృత్తి బాధ్యతలో భాగంగా ఈ శీర్షిక నిర్మాణంలో నేనూ కొంత పని చేశాను. ఆ విధంగా తెలుగు కథామతల్లికి కృతజ్ఞతాసుమం అందించాను. ఈ శీర్షిక విజయంలో మారుతిరావు గారి భూమిక శిఖరప్రాయం. కె. రామచంద్రమూర్తి గారి పూనిక హిమశైల శిఖర సదృశం.

ఇటీవలే, మారుతిరావు గారు దృశ్యరూపాలుగా ఉన్న‘వందేళ్ల కథకు వందనాలు’ను ఒక బృహత్ గ్రంథంగా ఆ అద్భుతాన్ని అక్షరబద్ధం చేశారు. మారుతిరావు గారు అనేకసార్లు కొప్పరపు పీఠం సభల్లో పాల్గొన్నారు. వేటూరి సుందరరామ్మూర్తి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మాడుగుల నాగఫణిశర్మలకు కొప్పరపు కవుల పురస్కారం ప్రదానం చేసిన సంరంభాల్లో మారుతిరావు గారు ఆత్మీయ అతిథిగా పాల్గొని రసాత్మకమైన ప్రసంగాలు అందించారు.

యివన్నీ ఒక ఎత్తయితే, కొప్పరపు వారి సీమ నరసరావుపేటలో నిర్వహించిన ‘కొప్పరపు కవుల 120 ఏళ్ల అవధాన ప్రస్థాన మహోత్సవం’లో అధ్యక్ష స్థానంలో ఆ సభ నిర్వహించిన తీరు, చేసిన ప్రసంగం పరమాద్భుతం.

అంతటితో ఆగక ఆ మహాకవుల జన్మస్థలమైన కొప్పరం కూడా సందర్శించారు. ఆ తరువాత కొప్పరపు కవుల జయంతి సందర్భంగా మారుతిరావు గారు అందించిన వ్యాసం మహాద్భుతం. ఆ మహాకవుల ఉపాసనా బలం, ప్రజ్ఞా విశేషాలను విశేషమైన రీతిలో వారు బొమ్మ కట్టించారు.

సాహిత్యం, నటన, వక్తృత్వం, ప్రయోక్త ప్రతిభ, పత్రికా రచన… ఇలా బహుముఖీనమైన అంశాలపై వారికుండే ప్రభుత్వం…రంగస్థలం, పత్రిక, రేడియో, టివి, సినిమా రంగాల్లో వారు పొందిన ప్రభ… జగమెరిగిన జీవన సత్యాలు. ఈ విశేష ప్రతిభామూర్తికి వినయపూర్వకంగా ప్రణమిల్లుతున్నాను.

వినయ వినమిత శిరస్కుడనై

మా శర్మ

(80 ఏళ్ళు పూర్తయిన సందర్బంగా ప్రత్యేక సంచిక కోసం రాసిన వ్యాసం)

Related posts

గుంటూరు జిల్లాలో అతి భారీ మద్యం డంప్

Satyam NEWS

మనోధైర్యంతో కరోనాను జయించి తిరిగి విధుల్లో చేరిన సిఐ

Satyam NEWS

కరీంనగర్ ఈ ఎన్ సి గా బాధ్యతలు చేపట్టిన శంకర్

Satyam NEWS

Leave a Comment