కరోనా వైరస్ తగ్గు ముఖం పట్టేంత వరకు తిరుమల శ్రీవారి సన్నిధిలో అనాదిగా జరుగుతున్న నిత్య సేవలు, వారాంతపు సేవలను ఏకాంతంలో నిర్వహించాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటన మేరకు 50 మందికి మించి గుంపులుగా ఉండటం శ్రేయస్కరం కాదనే విషయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు జరిగే నిత్య పూజలలో సుమారు 500 మందికి పైగా భక్తులు శ్రీవారి గర్భాలయంలో, ఉత్సవ మండపంలో పాల్గొంటున్నారని ఇది మంచిది కాదని ఆయన అన్నారు.
అయితే కరోనా వైరస్ పేరుతో నిత్యసేవలను లేదా వారాంతపు సేవలను వాయిదా వేసినా లేక జరపకపోయినా భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని ఆయన హెచ్చరించారు. తిరుమల శ్రీవారి, పద్మావతి అమ్మవారి ఆలయ సంప్రదాయాలకు విఘాతం కలిగించవద్దని ఆయన కోరారు.
భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, కల్యాణోత్సవం, డోలోత్సవం, సహస్రదీపాలంకరణ లాంటి నిత్య సేవలను అలాగే అభిషేకం, సహస్ర కలశాభిషేకం, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ వారాంతపు సేవలను ఏకాంతంగా జరిపించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు.
భక్తులు గానీ, అయ్యవార్లు గానీ జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడేవారు స్వచ్ఛందంగా క్వారంటైన్ చేసుకోవాలని ఆయన కోరారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ విస్తరించేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవరికి వారు స్వచ్ఛందంగా ఈ నియమాన్ని పాటించాలని నవీన్ కుమార్ రెడ్డి కోరారు.
తిరుమల శ్రీవారి ఆలయంలోని అర్చకులతో పాటు టిటిడి అనుబంధ ఆలయాల్లోని అర్చకులను, భక్తులను,టిటిడి ఉద్యోగస్తులను,తిరుమల తిరుపతి స్థానికులను కరోనా మహమ్మారి నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత టీటీడీ ఉన్నతాధికారులపై ఉందని నవీన్ కుమార్ రెడ్డి గుర్తు చేశారు.