కృష్ణాజిల్లా, మచిలీపట్నంలోని కలెక్టరేట్ లో ఏసీబీ అధికారులు దాడి చేశారు. అధికృత అధికారి (భూసంస్కరణలు) పనిచేస్తున్న ప్రశాంతిని ఏ.సి.బి అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఏసీబీ అధికారుల రైడ్ తో కలెక్టరేట్లో కలకలం చెలరేగింది. రూ 3 లక్షల లంచం తీసుకుంటూ ప్రశాంతి ఏసీబీ అధికారులకు చిక్కారు. సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయంలోనే అవినీతి అధికారిణి పట్టుబడటంతో ఇతర శాఖల అధికారులు బెంబేలెత్తిపోయారు. ప్రశాంతి తన కొద్ది పాటి సర్వీసులోనే రెండొవసారి ఏ .సి.బి కి చిక్కారు.
వివరాల్లోకి వెళ్తే కృష్ణా జిల్లా, తాడేపల్లి మండలం, ఉండవల్లి సెంటర్ లో నివాసముంటున్న మెకా రామలింగేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు ఏ .సి.బి అడిషనల్ ఎస్.పి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో వలపన్ని ఆమెను పట్టుకున్నారు. నాలుగు ఎకరాల భూమికి సంబంధించి లొసుగులు తొలిగించే నిమిత్తం 3 లక్షలు లంచం ఇవ్వాలని ఆమె రామలింగేశ్వరరెడ్డి ని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు ఏసీబీ కు అందింది. ఏసీబీ అధికారులు ఏ .ఓ భూసంస్కరణలు అధికారిణి దాసరి ప్రశాంతిని రెడ్ హ్యాండ్ డ్ గా పట్టుకున్నారు.