40.2 C
Hyderabad
April 26, 2024 12: 17 PM
Slider జాతీయం

భారత సాధికారికతకు ప్రతీక రిపబ్లిక్ డే!

republic day 2

(సత్యం న్యూస్ ప్రత్యేకం)

ప్రపంచంలోనే విస్తృతమైన సమాలోచనలు జరిపి, వివిధ ప్రజాస్వామ్య దేశాలలోని రాజ్యాంగాలను మదింపు చేసి, అత్యుత్తమ మానవీయ విలువలతో రూపొందిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజే రిపబ్లిక్ డే. 1947లో బ్రిటిష్ వలస పాలకులను సాగనంపి, ఆగష్టు 15న స్వతంత్రం సాధించుకొంటే, ఆ తర్వాత సుమారు మూడేళ్లకు రాజ్యాంగం అమలులోకి వచ్చిన జనవరి 26న రిపబ్లిక్ డేగా జరుపుకొంటున్నాము. 

అయితే చాలామంది స్వతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే ల మధ్య గల వ్యత్యాసం గురించి తడబాట్లు పడుతుంటారు. గత సంవత్సరం ఆగష్టు 15ను రిపబ్లిక్ డే గా జరుపుతుకున్న ఢిల్లీ పోలీస్ లకు వ్యతిరేకంగా ఒక కేసు కూడా నమోదైనది. ఆగష్టు 15 విదేశీ పాలకుల నుండి స్వేచ్ఛ పొందిన రోజయితే, మనలను మనం ఒక సర్వ స్వతంత్ర దేశంగా ప్రకటించుకొన్న రోజు రిపబ్లిక్ డే అని చెప్పవచ్చు.

అందుకనే భారత ప్రజల సాధికారికతకు గుర్తు ఈ దినంగా భావించాలి. ఆగష్టు 15న జవహర్ లాల్ నెహ్రు ప్రధానిగా తాత్కాలిక భారత ప్రభుత్వం ఏర్పడినా సాంకేతికంగా బ్రిటిష్ రాజు జార్జ్ VI మన దేశాధినేతగా కొనసాగారు. 1950 జనవరి 26న మన రాజ్యాంగంను అమలులోకి తీసుకు రావడం ద్వారా భారత్ ను ప్రజాస్వామ్య రిపబ్లిక్ దేశంగా మనం ప్రకటించుకొని, మొదటి రాష్ట్రపతిగా డా. రాజేంద్ర ప్రసాద్ ను ఎన్నుకున్నాము.

అందుకనే స్వతంత్ర దినోత్సవాన్ని ఒక విధంగా రాజకీయ పరమైన విజయంగా జరుపుకొంటూ ఉంటే, మన దేశ సాధికారితకు చిహ్నంగా, ప్రజల సార్వభౌమత్వానికి గుర్తుగా రిపబ్లిక్ డే ను జరుపుకొంటాము. రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో భారత సేనలు తమ అత్యాధునిక ఆయుధాలను, పరాక్రమాలను ప్రపంచానికి ప్రదర్శించడం ద్వారా మనది అభేద్యమైన జాతి అనే సంకేతం ఇస్తుంటాయి.

ఈ సందర్భంగా జరిగే పెరేడ్ రాష్ట్రపతి భవన్ కు సమీపంలో గల రైసినా హిల్ నుండి ప్రారంభమై, రాజ్ పత్, ఇండియా గెట్ ల ద్వారా ఎర్రకోట వరకు సాగుతుంది. త్రివిధ దళాల నుండి మన సాయుధ దళాల కమాండర్ ఇన్ చీఫ్ అయిన రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఈ రోజున భారతీయులు అందరు సగర్వంగా మన జాతీయ పతాకాన్ని ఎగురవేసుకొంటూ, మన జాతీయ గీతం “వందే మాతరం”, “జనగణమన”లను ఆలపించుకొని, దేశ స్వాతంత్య్రం కోసం అసమాన త్యాగాలు జరిపిన స్వతంత్ర సమరయోధులకు అంజలి ఘటిస్తారు. 

రిపబ్లిక్ డే పరేడ్ లకు ఒకొక్క సంవత్సరం ఒకొక్క దేశాధినేతను, అంతకు మించి గౌరవ అతిధులుగా ఆహ్వానించడం సంప్రదాయంగా వస్తున్నది. ఈ సంవత్సరం బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ మెస్సియాస్ బాసినరో ముఖ్యఅతిధిగా పాల్గొంటున్నారు. గతంలో 1996, 2014 లలో సహితం బ్రెజిల్ అధ్యక్షలు ముఖ్యఅతిథులుగా పాల్గొన్నారు. బ్రెజిల్ అధ్యక్షుడిని ఆహ్వానించడం వెనుక భారత్ తో పాటు ప్రపంచంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్న దేశం కావడంతో పాటు రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఆర్ధిక,ఆ ధౌత సంబంధాల దృష్ట్యా ప్రాధాన్యత సంతరింప చేసుకొంది. గత సంవత్సరం $7.57 బిలియన్ డాలర్లుగా ఉన్న రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని వచ్చే మూడు, నాలుగేళ్లలో $25 బిలియన్ డాలర్లకు తీసుకు వెళ్లాలనే ప్రయత్నం జరుగుతున్నది.

చలసాని నరేంద్ర

Related posts

రెగ్యులేషన్: నియంత్రిత సాగు విధానంపై 21న విస్తృత సమావేశం

Satyam NEWS

బాధితులకు భరోసా కల్పించేందుకే ప్రజా దివాస్

Satyam NEWS

కువైట్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇద్దరి మృతి

Satyam NEWS

Leave a Comment