40.2 C
Hyderabad
April 28, 2024 18: 26 PM
Slider సంపాదకీయం

అమ్మకానికి అమరావతి: వచ్చే నెలలోనే వేలం, ఎకరానికి ఎంతంటే?

amaravathi 22

అమరావతిని అభివృద్ధి చేయడం మాట అటుంచి అమరావతి భూములను మాత్రం అమ్మేందుకు జగన్ సర్కార్ సిద్ధం అవుతున్నది. ఎకరానికి రూ.10 కోట్ల చొప్పున భూములు విక్రయించనున్నట్లు చెబుతున్నారు. అమరావతిని ఎడారిగా, స్మశానంగా అభివర్ణించిన వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంత రేటు పెట్టి అమ్మబోతున్నారా అని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఎడారిలో స్మశానంలో ఇంత రేటు పలకడం విచిత్రంగానే ఉందని ఎద్దేవా చేస్తున్నారు కూడా. తొలి విడతలో భూముల విక్రయం ద్వారా రూ.2480 కోట్లు సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఈ భూములకు సంబంధించిన వేలం ప్రక్రియ వచ్చే నెలలోనే (జులై) ప్రారంభం కానుంది. తొలి దశలో 248.34 ఎకరాలను విక్రయించాలని భావిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు రాజధాని అమరావతిలో నిర్మాణాలు, మౌలిక సదుపాయలను కల్పించాల్సి ఉంది. ఇందుకోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం. నిర్మాణానికి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకురాక పోవడంతో సీఆర్డీఏ సొంతంగా నిధులు సమకూర్చుకునే పనిలో పడినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే నిధుల సేకరణకు రాజధాని పరిధిలో ఉన్న భూములను కొంత మేర విక్రయించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.

వేలం ద్వారా భూముల విక్రయానికి అనుమతిస్తూ ఇటీవల 389 జీవోను ఏపీ ప్రభుత్వం జారీ చేసింది. మున్సిపల్ శాఖ ద్వారా జారీ చేసిన ఈ ఉత్తర్వుల్లో.. వచ్చే నెలలోనే వేలం ద్వారా భూములను విక్రయించాలని పేర్కొన్నారు. నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మెడ్‌సిటీ నిర్మాణం కోసం గత ప్రభుత్వం 100 ఎకరాలు కేటాయించింది.

అదేవిధంగా లండన్‌ కింగ్స్‌ కాలేజీ నిర్మాణం కోసం 148 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కానీ,ఆయా సంస్థలు ఇప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో ఆ భూములను వేలం వేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. మున్సిపల్ శాఖపై ఇటీవల సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

ఇందులో భాగంగా భూములను విక్రయించాలని నిర్ణయించారు. అమరావతి లో నిర్మాణాలు పూర్తి చేయాలని ఒక వైపు కోర్టు ఆదేశాలు ఉండగా ఇలా భూములు అమ్మడాన్ని న్యాయస్థానం ఎలా చూస్తుందనే విషయం వెల్లడికావాల్సి ఉంది. ఈ అంశంపై ఇప్పటికే కోర్టుకు వెళ్లాలని రాజధాని రైతులు కొందరు భావిస్తున్నారు.

Related posts

మునుగోడులో నైతికంగా గెలిచిన కోమటిరెడ్డి

Satyam NEWS

స‌ర్వ‌భూపాల వాహ‌నంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప

Satyam NEWS

శ్రీరామనవమి వేడుక‌లను ఘనంగా నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment