ఢిల్లీ ఎన్నికల ఫలితాలు పౌర సత్వ చట్టం విషయంలో గానీ ఎన్ ఆర్ సి, ఎన్ పి ఆర్ విషయంలో గానీ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చలేవని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికలను గెలుపు ఓటముల దృష్టిలో చూడదని, తమ కార్యక్రమాల ప్రచారానికి మాత్రమే వేదికగా వినియోగించుకుంటుందని అన్నారు. ఢిల్లీ ఎన్నికలలో బిజెపి ఘోర పరాజయం తర్వాత ఆయన తొలి సారిగా స్పందించారు.
ఢిల్లీ అసెంబ్లీ పోల్ ప్రచారం సందర్భంగా కొద్దిమంది బీజేపీ నేతలు ‘ గోలీ మారో ‘, ‘ ఇండో-పాక్ మ్యాచ్ ‘ వంటి వ్యాఖ్యలు తమ విజయావకాశాలను దెబ్బ తీశాయని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీ ఓటమికి కారణాల్లో ఒకటి అయి ఉండవచ్చని ఆయన అన్నారు. ’ఇలాంటి ప్రకటనలు చేసి ఉండకూడదు. మా పార్టీ ఇలాంటి వ్యాఖ్యానాలను ఆమోదించదు’ అని ఆయన అన్నారు.