33.7 C
Hyderabad
April 29, 2024 00: 46 AM
Slider జాతీయం

ఎనాలసిస్ : ఆలోచన మారితే మళ్లీ మహర్దశ ఖాయం

#Rahul Gandhi

135 ఏళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవం పొందాలంటే తిరిగి మూలాల్లోకి వెళ్ళాల్సిందే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఒక నాడు రవి అస్తమించని బ్రిటిష్ రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్రోద్యమానికి భారత జాతీయ కాంగ్రెస్ నేతృత్వం వహించింది. ఎందరో నిస్వార్థపరులు, త్యాగ ధనులు కాంగ్రెస్ సంస్థకు వెన్నుదన్నుగా నిలిచారు.

పార్టీ కోసం ఆంగ్లేయుల పాలనలో చేస్తున్న ఉద్యోగాలను సైతం విడిచిపెట్టిన వారు ఎందరో ఉన్నారు. ఉన్నత విద్యావంతులు, సంఘ సంస్కరణాభిలాషులు, రాజకీయ మేధావులు అధిక శాతం ఆనాటి కాంగ్రెస్ కు మద్దతు ప్రకటించారు. ప్రముఖ రాజకీయ సంస్కర్త, అప్పటి బ్రిటిష్ ఇంపెరియల్ సివిల్ సర్వీస్ సభ్యుడైన అల్లాన్ ఆక్టేవియన్  హ్యూమ్ ( ఏ.ఓ. హ్యూమ్ ) వ్యవస్థాపకుడుగా దాదాబాయి నౌరోజీ, విలియమ్ వెడర్బన్, సురేంద్ర నాథ్ బెనర్జీ తదితర సంఘసంస్కరణ వాదుల సహకారం తో కాంగ్రెస్ పార్టీ జీవం పోసుకుంది.

పెరిగిన వ్యక్తి ఆరాధన కొంప ముంచింది

అప్పటినుంచి స్వతంత్ర భారతదేశ చరిత్రలో కాంగ్రెస్ అంతర్భాగమైంది. 49 సంవత్సరాల సుదీర్ఘ కాలం దేశం కాంగ్రెస్ ఏలుబడిలో సాగింది. అప్పట్లో దేశంలో చోటుచేసుకున్న అనేక రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిణామాలకు కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించేది.

కాలక్రమంలో కాంగ్రెస్ లో వ్యక్తిఆరాధన  పెరిగిపోయి, అవసరమైన అంతర్గత ప్రజాస్వామ్యం లోపించడంతో రాజకీయ నేతల నిష్క్రమణ ఆరంభమైంది. భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పరిపాలన చివరి కాలంలో మొదలైన అసహనం ఇందిరాగాంధీ పదవీ బాధ్యత చేపట్టే నాటికి కాంగ్రెస్ లోని మేధావి వర్గం పార్టీకి దూరమైంది.

కొంప ముంచిన మితిమీరిన ఆత్మవిశ్వాసం

వివిధ రాజకీయ సమీకరణాల నేపథ్యంలో కాంగ్రెస్ లో చీలికలు చోటు చేసుకున్నాయి. అసలు కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఇందిరా కాంగ్రెస్ పుట్టింది. వాస్తవానికి దేశంలో ఇపుడున్న కాంగ్రెస్ ఇందిరాగాంధీ సృష్టించిన ఆపద్ధర్మ కాంగ్రెస్ కు నకలన్నది చరిత్ర కారుల వ్యాఖ్యానం.

ఇందిర యే ఇండియా….ఇండియా యే ఇందిర అని కాంగ్రెస్ పార్టీ వందిగామాధులు బాకా ఊదడంతో ఆ పార్టీ పతనం ఆరంభమైంది. మితిమీరిన ఆత్మవిశ్వాసం ఎటువంటి  విష పరిణామాలకు దారితీస్తుందో తెలుసుకోవడానికి ఇందిరాగాంధీ వ్యవహార శైలి ఒక ఉదాహరణ అంటారు రాజకీయ విశ్లేషకులు.

తగ్గిపోతున్న ఓట్ల శాతం ఒక హెచ్చరిక

వర్తమాన రాజకీయ పార్టీలు నేర్వదగిన ఎన్నో అంశాలు కాంగ్రెస్ పార్టీ ఉద్ధాన పతనాల చరిత్రలో ఉన్నాయని వారు సూచించారు. విషయానికి వస్తే…..మొదటి లోకసభ ఎన్నికలలో 44.99 శాతం ఓట్లతో ఆరంభమైన కాంగ్రెస్ జైత్రయాత్ర 16 వ లోకసభలో కేవలం 19.52 శాతం ఓట్లు, 17 వ లోక్ సభ ఎన్నికల నాటికి కేవలం 19 శాతం ఓట్లతో 52 స్థానాలకే పరిమితమైంది.

ఒక్క 1984 లో మాత్రమే 415 స్థానాలలో 49.01 శాతం ఓట్లు సాధించి చరిత్ర సృష్టించింది. ఇప్పటికీ భారతదేశ రాజకీయ చరిత్రలో ఓ అరుదైన రికార్డుగా నమోదైంది. అది ఒకనాటి మాట. ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కేవలం మూడు.

ఇతర పార్టీలతో భాగస్వామ్యం పంచుకుని ఏలుబడిలో ఉన్న రాష్ట్రాలు రెండు. కాంగ్రెస్ పార్టీ దుస్థితికి కారణాలను ఆ పార్టీ అధిష్టానవర్గం నిజాయతీగా అన్వేషించక పోవడం పెద్ద తప్పుగా రాజకీయ విమర్శకులు అంటున్నారు.  సుదీర్ఘ ఘన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకత్వం  వారసత్వ పదవిగా మారిపోయింది. 

బలమైన నాయకులు లేకపోవడం ఒక బలహీనత

ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి రాజకీయ శక్తుల నిర్మాణాత్మక తోడ్పాటు అవసరం ఎంతైనా ఉంది. కాంగ్రెస్ విధానాలతో విబేధించి సొంతపార్టీలతో రాజకీయాలు సాగిస్తున్న శరద్ పవార్, మమతాబెనర్జీ వంటి బలమైన నాయకుల స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీకి లేక పోవడం విడ్డూరం.

నెహ్రూ కుటుంబ వారసులైన సోనియా గాంధి, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ప్రభృతులు కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. కానీ… ఇప్పుడున్న మోదీ ప్రభంజనాన్ని తట్టుకొని పార్టీలో పూర్వ జవసత్వాలు నింపడానికి నామమాత్ర కసరత్తు సరిపోదని నిపుణులు సూచిస్తున్నారు.

ఉదాహరణకు ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభ సమయంలో కూడా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆశించిన స్థాయిలో స్పందించలేదని విమర్శలు వస్తున్నాయి. కేవలం ప్రకటనలకు, ప్రధానమంత్రి పై నిర్హేతుక విమర్శలు ఎక్కుబెట్టడం కాకుండా…..బాధితులకు ప్రత్యక్ష సాయం అందిస్తే పార్టీ పట్ల సానుభూతి పెరిగేది.

సరైన దిశానిర్దేశం ఉంటే పూర్వవైభవం ఖాయం

రాజకీయాలకు అతీతంగా దేశంలో  నెలకొన్న దుర్భరస్థితి దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వానికి గుణాత్మక సూచనలు, సలహాలు ఇచ్చిఉంటే ప్రజలలో కాంగ్రెస్ పరపతి కాస్తయినా మెరుగయ్యేది. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ కు ఇప్పటికీ బలమైన ఓటు బ్యాంకు ఉంది. సరైన దిశానిర్దేశం చేస్తే కాంగ్రెస్ కు పూర్వ వైభవం సాధ్యమే.

కావాల్సిందల్లా…అధిష్టానం ఆలోచనా ధోరణి మారాలి. గ్రామీణ స్థాయిలోకి కాంగ్రెస్ పార్టీ ఆశయాలు, సిథ్దాంతాలు, సెక్యులర్ కోణాన్ని తీసుకువెళ్ళే కార్యా చరణకు పార్టీ పరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలి. ” రాజకీయ పార్టీలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేం” అంటున్న రాజ్యాంగ నిపుణుల మాట సర్వదా ఆమోదయోగ్యం.

పరిమిత ప్రయోజనాలకు కట్టుబడిన ప్రాంతీయ పార్టీల హవా జోరుగా సాగుతున్న వ్యవస్థ లో కాంగ్రెస్ పార్టీ వంటి జాతీయ పార్టీల పునర్నిర్మాణం దేశ విశాల హితానికి  అవసరమని ప్రజాస్వామ్య ప్రియులు ఆకాంక్షిస్తున్నారు.

కృష్ణారావు

Related posts

పల్నాడుకు నీరు ఇచ్చేలా ముఖ్యమంత్రి జగన్ చర్యలు

Satyam NEWS

ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాసిన రేవంత్ రెడ్డి

Satyam NEWS

మోడీ సలహాదారుగా మాజీ ఐఏఎస్ అమిత్ ఖరే

Sub Editor

Leave a Comment