29.7 C
Hyderabad
May 2, 2024 04: 31 AM
Slider సంపాదకీయం

టీఆర్ఎస్ పక్కలో డైనమైట్ వచ్చి చేరింది

#DubbakaElections

ఎన్నిక ఏదైనా గెలుపు టీఆర్ఎస్ దే అనే నినాదాన్ని ఇప్పుడు మార్చి రాసుకోవాలి. మరి దీనికి కేసీఆర్ అంగీకరిస్తారో లేదో కానీ దుబ్బాక ఉప ఎన్నిక తర్వాత  ఇక ఈ స్లోగన్ ఉండే అవకాశం లేదు. కేసీఆర్ సొంత జిల్లాలో, కేసీఆర్ నియోజకవర్గం పక్కనున్న నియోజకవర్గంలో, కేసీఆర్ తో విభేదించి వచ్చిన రఘునందన్ రావు గెలవడం కేసీఆర్ పై తీవ్ర ప్రభావం చూపించే అవకాశమే ఉంది.

దుబ్బాక ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ తొలి నుంచి బిజెపిపై నే ఫోకస్ చేసింది. కాంగ్రెస్ పార్టీని పట్టించుకోలేదు. టీఆర్ఎస్ ముందుగానే బిజెపినే తన ప్రధాన ప్రత్యర్థి అని ప్రకటించింది. చివరకు తాను ఎంచుకున్న ప్రత్యర్థి చేతుల్లోనే తాను ఓడిపోయింది.

టీఆర్ఎస్ కు ప్రమాద ఘంటికలు?

ఒక్క నియోజకవర్గంలో ఓటమి ప్రభుత్వం మొత్తానికి రిఫరెండం కాబోదు. కానీ టీఆర్ఎస్ కు మాత్రం ప్రమాద ఘంటికలు మోగినట్లు అయింది. అత్యంత స్వల్ప మెజారిటీతో బిజెపి గెలవడం టీఆర్ఎస్ పార్టీకి ఊరటనివ్వదు. తక్కువ మెజారిటీ కదా ఫర్వాలేదులే అనుకోవడానికి టీఆర్ఎస్ మనసు అంగీకరించదు.

ఇంతకాలం గెలుపు మజా అనుభవించిన టీఆర్ఎస్ కు ఈ చేదు గుళిక గొంతు జారదు. అందునా కేసీఆర్ ను, కేటీఆర్ ను, హరీష్ రావును అత్యంత తీవ్ర పదజాలంలో విమర్శించే రఘునందన్ రావు గెలవడం వీరెవరికి ఇష్టం లేదు. ఎవరు గెలిచినా టీఆర్ఎస్ లోకే వెళతారు కదా అనే సిద్ధాంతం కూడా ఇప్పుడు మారిపోతుంది.

రాబోయేది మరింత కష్టకాలం

రఘునందన్ రావు టీఆర్ఎస్ కు అమ్ముడుపోయే అవకాశం లేదు. ఇది ఏ రకంగా చూసుకున్నా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు మింగుడు పడే అవకాశం లేదు. ఒక్కడు గెలిచి ఇప్పటికే ఉన్న ఒక్కడితో కలిసి ఏం చేస్తాడు? అనుకోవడానికి వీల్లేదు.

రాబోయేది హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలు. నాలుగు ఎంపి స్థానాలతో తెలంగాణ లో తన స్థానం పదిలం చేసుకున్న బిజెపి, దుబ్బాక విజయంతో ద్విగుణీకృతోత్సాహంతో హైదరాబాద్ మునిసిపల్ ఎన్నికలలో తలపడుతుంది. అప్పుడు బిజెపిని అడ్డుకోవడానికి టీఆర్ఎస్ కు తలకు మించిన భారం అవుతుంది.

దుబ్బాక ఉప ఎన్నికల గెలుపుతో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు కేంద్ర బిజెపి పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించడం ఖాయం. అప్పుడు పోరాటం మరింత తీవ్రం అవుతుంది. ఎటు నుంచి చూసుకున్నా టీఆర్ఎస్ కు ఇక ఆడిందే ఆట పాడిందే పాట గా ఉండదు.

రైతులను దెబ్బ కొట్టిన టీఆర్ఎస్

కుటుంబ పాలన, అవినీతి తదితర ఆరోపణలను ప్రజలు పట్టించుకోలేదు. కానీ వారి భూములతో చెలగాటం ఆడే కొత్త రెవ్యెన్యూ చట్టం, నియంత్రిత పంట మార్పిడి విధానం, పంటలకు గిట్టుబాటు ధర తదితర విషయాలను తీవ్రంగా తీసుకుంటున్నారు.

కరోనా సమయంలో కరెంటు చార్జీలకు రాయితీ ఇవ్వాల్సిందిపోయి బలవంతంగా వసూలు చేయడం, బిఆర్ఎస్, ఎల్ఆర్ఎస్ పేరుతో పాత భూములకు, భవనాలకు కూడా డబ్బులు గుంజాలని చూడటం ప్రజలు హర్షించలేదు. ఇవన్నీ టీఆర్ఎస్ ఓటమికి బాటలు వేశాయి.

మరీ ముఖ్యంగా ముస్లింలకు ఎంత కొమ్ము కాసినా ముస్లిం ఓటు ఈ సారి కాంగ్రెస్ వైపు వెళ్లినట్లు దుబ్బాకలోని కొన్ని ప్రాంతాలలో సూచన ప్రాయంగా వెల్లడి అయింది. ఇది రూఢిగా తేలితే టీఆర్ఎస్ మరింత కష్టాల్లోకి వెళ్లినట్లే భావించాల్సి ఉంటుంది.

ముస్లింల వైపు కేసీఆర్ పక్షపాతంతో ఉన్నారనే వాదన ముందుకు తీసుకురావడం వల్లే రాష్ట్రంలో బిజెపి బలపడుతున్నది. అలాంటి పరిస్థితుల్లో ముస్లింలు కూడా టీఆర్ఎస్ పార్టీతో కలిసి ఉండకపోతే…….? ఇది మరో ప్రమాదం. రఘునందన్ రావు అసెంబ్లీలో అడుగు పెట్టిన తర్వాత గేమ్ ఇప్పుడున్నట్లు ఉండదు. ఫైర్ బ్రాండ్ రాజాసింగ్ పక్కన డైనమైట్ రఘునందన్ ఉండటం అసెంబ్లీలో టీఆర్ఎస్ కు ప్రమాదకరమే.

Related posts

ఫండ్స్ ప్రాబ్లమ్: పేటలో నిఘా నేత్రాలు కనుమరుగు

Satyam NEWS

హైదరాబాద్‌-శ్రీశైలం రహదారిపై ఘోర ప్రమాదం: 8 మంది మృతి

Satyam NEWS

రైతులను మోసం చేసిన బీజేపీ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment