30.7 C
Hyderabad
April 29, 2024 04: 45 AM
Slider ప్రత్యేకం

పవనిజం: కింగా?? కింగ్ మేకరా??

#pawankalyana

ప్రముఖ తెలుగు సినీహీరో, పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కింగ్ కావాలని అభిలషిస్తున్నారా ? లేక కింగ్ మేకర్ గా ఉండాలని భావిస్తున్నారా? ప్రస్తుతం రాజకీయాలను పరిశీలిస్తున్న వారి మెదడును తొలుస్తున్న ప్రశ్న ఇది.

ఎందుకంటే.. నిన్న మొన్నటి వరకు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తామని, బీజేపీ ఇవ్వనున్న రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని ఆవేశంగా జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అధికార వైకాపా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్త ఓట్లలో చీలిక రానివ్వనని, అవసరమైతే త్యాగాలకు సిద్ధపడైనా కలిసి వచ్చే వ్యక్తులతో, శక్తులతో కలిసి ఐక్యంగా వైకాపా ను ఎదుర్కొంటామని  జనసేన అధినేత ప్రజలకు మాట ఇచ్చారు. అప్పట్నుంచి పార్టీ కార్యకర్తల సమావేశాలు నిర్వహించి, శ్రేణులలో ఉత్సాహం నింపుతున్నారు.

రానున్న ఎన్నికల్లో 2019 లో మాదిరిగా ఒంటరిగా పోటీ చేసేది లేదని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికలలో జనసేన ఒంటరిగా పోటీ చేసి సుమారు 8 శాతం ఓట్లు సాధించింది. ఆ ఎన్నికలలో ఒక్క ఎమ్మెల్యే తప్ప ఆయనతో సహా అందరూ ఓటమి చవిచూశారు. ఆయనకు పోలైన ఓట్లు తెదేపా సానుభూతి పరులవని, 2014 లో వలే జనసేన తెదేపాకు మద్దతు ఇచ్చి ఉంటే తెదేపా రెండోసారి అధికారంలోకి వచ్చి ఉండేదని అప్పట్లో విశ్లేషించారు.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి శక్తిని అంచనా వేయడంలో తప్పు చేశామని ఇటు తెదేపా, అటు జనసేన వర్గాలలో గుసగుసలు వినిపించాయి. యువత, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గాల ఓట్లు జనసేన చీల్చుకుని, కనీసం 30-35 స్థానాల్లో గెలుపు సాధిస్తే రాష్ట్రంలో తెదేపా సునాయాసంగా అధికారంలోకి వస్తుందని అనుకున్న అంచనాలు పూర్తిగా విఫలమైనాయి.

గత ఎన్నికల ఫలితాలు పరిశీలిస్తే ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. 2019 ఎన్నికలలో తెదేపా కేవలం 39.2 % ఓట్లు పొంది 2014 లో కంటే 5.7% శాతం నష్టపోయింది. వామపక్షాలతో కలిసి రంగంలోకి దిగిన జనసేనకు లభించిన 8% ఓట్లు వైయస్ఆర్ సీపీ కంటే తెదేపాకి ఎక్కువ నష్టం కలిగించాయని విశ్లేషకులు వెల్లడించారు. అందువల్లనే వైకాపా  ఏకంగా 49.9 % (+ 5.3%) ఓట్లు రాబట్టగలిగిందని అంచనా వేశారు.

అప్పుడు తేడా కేవలం అరశాతం మాత్రమే

2014 ఎన్నికలలో తెదేపా, బీజీపీ కలిసి జనసేన మద్దతుతో పోటీచేసినా ఓట్లతో 102 స్థానాలలో గెలుపు కైవసం చేసుకుంది. మద్దతు ఓట్లతో బీజేపీ 4 స్థానాలలో గెలిచి, తెదేపా ప్రభుత్వంలో మంత్రి పదవులు పొందింది. వైకాపా ఒంటరిగా బరిలో నిలిచి, 44.6 % ఓట్లు పొందినా 67 స్థానాలను మాత్రమే దక్కించుకుంది. కేవలం 0.5 % ఓట్ల తేడాతో అధికారం జారవిడుచుకుంది.

అదే 2019 ఎన్నికలలో వైకాపా 151 స్థానాలలో విజయభేరీ మోగించగా తెదేపా కేవలం 23 స్థానాలకే పరిమితమైంది. అధికారంలోకి వచ్చిన వైకాపా, తెదేపా కంటే 10.7 % అధికంగా ఓట్లు పొందడం విశేషం. ఆశ్చర్యకరంగా బీజెపీ ఒక్క స్థానంలో కూడా గెలవలేదు. రెండోసారి అధికారంలోకి రాకుండా తెలుగుదేశం పార్టీని నిలువరించిన అంశాలు ఏమిటి అనే విషయంపై లోతుగా విశ్లేషణలు అప్పట్లో చోటుచేసుకున్నాయి. తెదేపా ప్రజా వ్యతిరేక ఓటును తనకు అనుకూలంగా మలుచుకొని అనూహ్య విజయం సాధించడంలో వైకాపా వేసిన వ్యూహం ఫలించింది. ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వైకాపా అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను పదే పదే ప్రాధేయ పడడం ఓటర్ల సానుభూతిని పొందగలిగింది.

రాష్ట్రవిభజన దరిమిలా ఆంధ్ర ప్రదేశ్ కు జరిగిన నష్టాన్ని భర్తీ చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం (2014-19)చేసిన కృషి ఆశించిన మేరకు జరగలేదని ప్రజలు విశ్వసించి వైకాపాకు తిరుగులేని ఆధిక్యం కట్టబెట్టారా? అనే సంశయం ఇప్పటికీ రాజకీయ పరిశీలకులలో ఉంది.

ఇదిలా ఉండగా..వైకాపా పరిపాలన తీరు కనీసం 6 నెలలపాటు పరిశీలించాక మాత్రమే తాను మాట్లాడతానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కానీ ..ప్రధాన ప్రతిపక్షం  తెదేపా మాత్రం చాలా త్వరగా జగన్ మోహన్ రెడ్డి పాలనను విమర్శించడం మొదలుపెట్టింది. అది చిలికి చిలికి గాలి వానై ఇప్పుడు రాష్ట్రంలో మూడు రాజధానుల అంశం చుట్టూ తిరుగుతోంది.

ఇదే విషయం కేంద్రబిందువుగా రానున్న ఒకటిన్నర సంవత్సరం కాలం రాష్ట్ర రాజకీయాలు ఉంటాయని పరిశీలకుల అంచనా. 2024 ఎన్నికలు వైకాపా ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయంపై రెఫరెండం గా ఉంటాయని వారు అంటున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయలబ్ది పొందాలని ఆశించేవారికి ఈ ఎన్నికలు గుణపాఠం చెబుతాయని తెదేపా, వైకాపా, బీజెపీ, జనసేనలను వారు హెచ్చరిస్తున్నారు. మూడు రాజధానుల  ఏర్పాటు మొండిగా వ్యవహరిస్తున్న వైకాపా ప్రభుత్వం  ప్రాంతాల సెంటిమెంట్ కంటే పలు పథకాల పేరుతో దాదాపు అన్ని వర్గాలకు చేరుతున్న ఆర్థిక సహాయం ఎన్నికల్లో పాజిటివ్ ఓట్ బ్యాంక్ గా మారుతుందని గుడ్డిగా నమ్ముతోంది.

ఈ నేపథ్యంలో ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తెదేపా తెలివిగా పావులు కదుపుతోంది. పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ ను ఉపయోగించి రాజకీయ లబ్ది పొందాలని బీజేపీ ఎత్తుగడలు వేస్తోంది. ఎన్నికల నాటికి రోడ్ మ్యాప్ చేతికి వస్తుందని, ఇప్పటికే జనసేనపార్టీతో పొత్తులో ఉన్నామని  రాష్ట్ర భాజపా అధ్యక్షుడు సోము వీర్రాజు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉన్నారు.

రోడ్ మ్యాప్ రాకపోవడమే కారణమా…..?

కాగా…తాజాగా పవన్ కళ్యాణ్ నిర్వహించిన కార్యకర్తల సమావేశం లో రోడ్ మ్యాప్ ఇంకా రాలేదని, అవసరమైతే వ్యూహాలు మార్చుకుంటామని తెలుగుదేశంతో దోస్తీకి సంకేతం ఇచ్చింది. విశాఖలో జనసేన కార్యకర్తలపై అరెస్టుల ఘటన జరిగిన వెంటనే భాజపా, తెదేపాలు పవన్ కళ్యాణ్ కు సంఘీభావం ప్రకటించాయి. వైకాపా అరాచకాలను ఎదుర్కోవడానికి సంఘటితంగా పనిచేస్తానని జనసేన ప్రత్యక్ష యుద్ధానికి ఒక అడుగు ముందుకు వేసింది.

వైకాపా రౌడీ ఎమ్మెల్యేలను రోడ్డుకి ఈడ్చి, ఒక్కొక్కడి తోలు వలుస్తానని, దమ్ముంటే రండని బహిరంగంగా పిలుపు ఇవ్వడం రాజకీయ పరిశీలకులను విస్మయానికి గురిచేస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకొనే లక్యాన్ని మరచి జనసేన అధినేత నేల విడిచి సాము చేస్తున్నారని వారు అంటున్నారు. ఇదెక్కడి భావ ప్రకటన స్వేఛ్చ అని వ్యాఖ్యానించడం గమనార్హం. రానున్న ఎన్నికల క్షేత్రంలో ఒంటరిగా బరిలో నిలిచి చావో రేవో తేల్చుకోవాల్సిన అవసరం ఉందని జనసైనికుల భావన. తెదేపా, వైకాపాలకు ప్రత్యామ్నాయంగా బీజేపీ మద్దతుతో ఎన్నికలకు వెళ్తే ఫలితాలు అనుకూలంగా ఉండగలవని కింది స్థాయి జన శ్రేణులలో బలంగా వినిపిస్తోంది. భాజపా అగ్ర నేతలు ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అంటే తనకు గౌరవం అని, కానీ ఎవరికీ ఊడిగం చేయాల్సిన అవసరం లేదని పవన్ కళ్యాణ్ అనడం వెనుక ఆయన తీసుకోబోయే నిర్ణయం ఏమిటి అనే దానిపై సర్వత్రా ఉత్కఠ నెలకొంది.

వైకాపా అంటున్నట్లు తేదేపా, జనసేన మధ్య ఉన్న రహస్య ఒప్పందం ఎప్పుడూ ఉన్నదని, ఇప్పుడు ముసుగు తొలగిపోవడం నిజమైతే రాష్ట్రంలో కొత్త రాజకీయ సమీకరణలకు తెర లేవడం ఖాయమని తెలుస్తోంది. రెండో సారి అధికారం కోల్పోయిన తేదేపా ఈ సారి ఎన్నికలలో ఎలాగైనా గెలిచి తీరాలని పట్టుదలగా ఉంది. అదే విధంగా వరుసగా రెండోసారి విజయం సాధించి, అధికారం నిలబెట్టుకోవాలని వైయస్ఆర్ సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

ఇటువంటి ఆసక్తికర అంశాల నేపథ్యంలో జనసేన ఆచి తూచి అడుగులు వేయకపోతే ఏదో ఒక పార్టీకి ఊడిగం చేయాల్సి వస్తుందని విశ్లేషకులు అంటున్నారు.  పొత్తులో భాగంగా జనసేనకు పోటీ చేసే అవకాశం వచ్చి ఒక వేళ వైయస్ ఆర్ సీపీ కి వ్యతిరేకంగా  ప్రభుత్వం ఏర్పడితే సంకీర్ణ ధర్మానికి వేరే పార్టీలు అంగీకరిస్తాయా అనే ప్రశ్నకు సమాధానం కష్టమే.

రెండు పార్టీలకు తప్ప అభ్యర్ధులు దొరికే పరిస్థితి లేదు

వాస్తవ దృష్టితో పరిశీలిస్తే… మొత్తం 175 నియోజక వర్గాలలో వైయస్ఆర్ సీపీ, తెదేపా లకు తప్ప వేరే ఇతర పార్టీలకు అభ్యర్దులు దొరికే పరిస్థితి కూడా లేదు. బీజేపీ, జనసేనలకు క్షేత్రస్థాయి బలం లేదు. అధికార వైకాపా ను ఒకవైపు రాజకీయంగా ఎదుర్కొంటూనే , మరోవైపు బలం పెంచుకోవాలనే స్పృహ ఆ రెండు పార్టీలకు లేకుండా పోయింది. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ తనకు ఉన్న విశేష అనుభవం, ప్రజల్లో ఉన్న సానుభూతి ఉపయోగించి పార్టీని బలోపేతం చేసుకుంటోంది. బలమైన ప్రత్యర్థికి ఎన్నికలలో గట్టిగా సమాధానం చెప్పాలంటే కేవలం సినిమా డైలాగులు కాదు.

ప్రజాస్వామ్య ప్రియులు మెచ్చే విధంగా పరిణతితో కూడిన విజ్ఞత అవసరం అన్న విషయం జనసేన ఇప్పటికైనా గురిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయి. నాయకుని మాటలు గందరగోళంగా ఉంటే కార్యకర్తలు  అయోమయానికి గురవుతారు. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో పడితే పార్టీకి నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది. జనసేన పార్టీకి అధినేత సర్వం తానై నడిపించడం దీర్ఘ కాలం సాగదు. పవన్ కల్యాణ్ కాకుండా మాజీ ముఖ్యమంత్రి తనయుడు నాదెండ్ల మనోహర్ ఒక్కరే మొదటి నుంచీ కనిపిస్తున్నారు.

సమర్థులైన నాయకులను తయారుచేసి, ఎన్నికలకు సిద్ధంగా వెళ్ళాల్సిన సందర్భంలో కూడా ఆ దిశగా ఆలోచన చేయకపోవడం ఆ పార్టీ బలహీనతగా విశ్లేషకులు అంటున్నారు. అనుభవ రాహిత్యంతో పాటు భాజపా లేదా తెలుగుదేశం పార్టీతో పొత్తుకు ఆరాటపడడం పరిశీలిస్తున్న వారికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కింగ్ కావాలని అభిలషిస్తున్నారా? లేక కింగ్ మేకర్ గా ఉండాలని భావిస్తున్నారా? అనే ప్రశ్నకు సమాధానం రాజకీయ తెరపై వెతుక్కోవాల్సిందే!

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ సామాజిక విశ్లేషకుడు

Related posts

కళ్యాణలక్ష్మి, షాది ముబారాక్, సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

Satyam NEWS

క్రాప్ ఆర్డర్: ప్రభుత్వం చెప్పిన పంటలనే వేయాలి

Satyam NEWS

మునుగోడు కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

Leave a Comment