33.7 C
Hyderabad
April 29, 2024 02: 36 AM
Slider ప్రత్యేకం

విశ్లేషణ: కరోనా కన్నా ఘోరమైన వలస వైరస్

#Migrant Workers

కోవిడ్-19 సృష్టించిన విలయం కారణంగా  భారతదేశంలో అతి దారుణంగా బలైనవారు వలస కార్మికులు. వారు ఎదుర్కొంటున్న బాధలు వర్ణనాతీతం. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో దేశంలో అకస్మాత్తుగా విధించిన మొదటి దశ లాక్ డవున్ ప్రకటించిన మార్చి 23 నుంచి అసంఘటిత రంగంలో ఉన్న లక్షలాది వలస కార్మికులకు కష్టాల కడగండ్లు మొదలయ్యాయి.

2018 గణాంకాల ప్రకారం 471.5 మిలియన్ల శ్రామిక శక్తిలో కేవలం 12.3 శాతం మాత్రమే ఉద్యోగభద్రత కలిగిఉన్న శాశ్వత కార్మికులు. మిగిలిన వారిలో అత్యధికులు రోజువారీ కార్మికులుగా లేదా చిన్న స్థాయి వృత్తి, వ్యాపారాలు నిర్వహిస్తూ స్వల్పాదాయాలతో జీవనం గడిపే అసంఘటిత శ్రామిక వర్గం అనేది కఠోర వాస్తవం.

అసంఘటిత కార్మికులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పటికీ ప్రభుత్వాల వద్ద లేకపోవడం బాధాకరం. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశ వ్యాప్తంగా 54.3 మిలియన్ల వలస కార్మికులు ఉన్నట్లుగా కేంద్రప్రభుత్వం గుర్తించింది. వారిలో బీహార్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, ఉత్తరప్రదేశ్ ,మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వలస కార్మికులే  50శాతం పైగా  ఉన్నారు.

గ్రామాలలో బతుకు లేకే పట్టణాలకు

ఇంత భారీ సంఖ్యలో ప్రజలు పల్లెసీమలు విడిచి పట్టణాలు, నగారాల బాట పట్టడానికి ప్రేరేపించిన కారణాలను సామాజిక రంగ నిపుణులు పలు కోణాలలో  అధ్యయనం చేశారు. గ్రామాలలో నివసిస్తున్న యువత జీవనోపాధి కి కనీస హామీ ఇవ్వగల పనులు లభించకపోవడం ప్రధాన సమస్యగా వారు గుర్తించారు.

పట్టణాలలో పెరుగుతున్న మిశ్రమ సంస్కృతి కి గ్రామీణ యువత ఆకర్షితులు కావడం కూడా మరో అంశంగా అధ్యయనం తెలిపింది. వ్యవసాయం, కర్షక అనుబంధ వృత్తులలో ఆశించిన స్థాయిలో ఆదాయం లభించకపోవడంతో గ్రామవాసులు వలసబాట ఎంచుకోవడం విధిగా పరిణమించింది.

నానాటికీ శరవేగంతో పెరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా వలసదారుల శ్రమశక్తికి ఆదరణ దొరకడంతో గ్రామీణ యువత ఆకర్షితమౌతోంది. కనీస జీవనోపాధి కరవైన తప్పనిసరి  పరిస్థితులలో పల్లెప్రజలు గ్రామాలను విడిచి పట్టణాలకు తరలి వెళ్ళడం నిరంతర ప్రక్రియగా రూపాంతరం చెందింది.

చిన్న వేతనాలతో కడుపునింపుకుంటున్న వలసకార్మికులు

ఈ కారణంగానే లక్షల సంఖ్యలో వలసదారులు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. పట్టణాలు, నగరాలకు వలస వచ్చినవారు వారి సామర్ధ్యాలకు అనుగుణంగా వృత్తి, వ్యాపకాలలో నిలదొక్కుకున్నారు. చిన్న,మధ్యతరగతి కర్మాగారాలలో కార్మికులుగా, డ్రైవర్లు, సెక్యూరిటీ సిబ్బంది, కూరగాయలు మార్కెట్లు, నిర్మాణ వ్యవస్థ, పలు ఉత్పత్తి కారక సూక్ష్మ తరహా పరిశ్రమలు ఇత్యాది రంగాలలో వేతనజీవులుగా స్థిరపడ్డారు.

వీరిలో చాలా మందికి వలస కార్మికుల భద్రతాచట్టం-1979 అమలులో ఉందన్న విషయం తెలియదని సాంపిల్ సర్వేలు తెలిపాయి. యాజమాన్యాలు కూడా చట్టానికి అనుగుణంగా వలస కార్మికులకు వేతనాలు ఇవ్వడం లేదు. కొన్ని యాజమాన్యాలు వసతి సౌకర్యం కల్పించినా, అధికసంఖ్యలో వలస కార్మికులు మురికివాడలలో  అరకొర మౌలిక వసతులతో జీవనం సాగిస్తున్నారు.

లక్షలాది మంది రోడ్లపాలయ్యారు

కరోనా దెబ్బకు లక్షల సంఖ్యలో వలస  కుటుంబాలు వీధులపాలయ్యాయి. ఆకస్మిక లాక్ డవున్ తో ఉపాధి కోల్పోయినవారిని సంబంధిత యజమానులు అన్యాయంగా గాలికి వదిలేశారు. తినడానికి తిండిలేక, నిలువనీడ లేక అనేక మంది గగ్గోలు పెట్టే పరిస్థితి దాపురించింది.

మార్చి నెల 29 న హోం మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటనలో  వలస కార్మికులకు మార్చి నెల వేతనం యాజమాన్యాలు చెల్లించాలని ఆదేశించింది. ఐనా, యజమానులు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. చిన్న,మధ్యతరగతి కర్మాగారాలలో సైతం వలస పని వారికి ఇవ్వాల్సిన వేతనంలో కోత విధించారు.

తమిళనాడు లో వలస కార్మికుల జీతంలో సగటున  63% తగ్గించినట్లు స్వచ్చంద సంస్థల పరిశీలనలో తేలింది. స్థానిక ఎంజీవోలు, పౌర సమాజాల ఆదరణ తో వలస కార్మికుల ఆకలిబాధ కొంత వరకు తీరింది. కేంద్రప్రభుత్వం ఆలస్యంగానైనా మేల్కొని వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు శ్రామిక రైళ్ళు నడిపిస్తున్నాయి.

తరలింపు ప్రక్రియ ఎప్పటికి పూర్తయ్యేను?

రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బస్సులు,ఇతర వాహనాలలో వలస కూలీలను వారి సొంత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ఇప్పటికీ కాలి నడకన సొంత ప్రాంతాలకు వెళ్తున్న ఉదంతాలు రోజూ కనిపిస్తున్నాయి. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేని కారణంగా వలస కార్మికులు ఇటువంటి దుర్భర స్థితిని ఎదుర్కొంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలావుండగా….లాక్ డవున్ దుర్భర స్థితి నుంచి బయటపడటానికి భారతదేశ ప్రభుత్వం భారీస్థాయిలో ఉద్దీపన చర్యలు చేపట్టింది. అస్తవ్యస్తమైన ఆర్థిక సంక్షోభాన్ని గాడిలో  పెట్టడానికి దేశచరిత్రలోనే మొదటిసారి మొత్తం బడ్జెట్ లో 10 శాతం నిధుల్ని…అక్షరాలా 20 లక్షల కోట్ల రూపాయలు వివిధ రంగాల ఉద్దరణకు కేటాయించింది.

వలస కార్మికవ్యవస్థను కూడా బలోపేతం చేసేందుకు తగిన నిధులు ఇస్తామని కేంద్ర విత్త మంత్రి ప్రకటించడం ముదావహం. వలస కార్మిక కుటుంబాలకు రానున్న రెండు నెలలకు సరిపడా తిండిగింజలు,ఇతర సదుపాయాలు సమకూర్చనున్నట్లు ప్రభుత్వా వర్గాలు చెబుతున్నాయి.

శాశ్వత పరిష్కారం చూపించగలరా?

రేషన్ సరఫరా వ్యవస్థ ద్వారా ఆయా కుటుంబాల ఆహార అవసరాలు తీర్చడానికి అవసరమైన అన్ని  చర్యలు తీసుకుంటారని వినవస్తోంది. కుదేలైన అన్నిరంగాల  సముద్దరణతో పాటు వలస కార్మికుల జీవన్మరణ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సామాజిక శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

గ్రామాలలో తగిన ఉపాధి అవకాశాలు కల్పిస్తే నిరుద్యోగ సమస్య తీవ్రత అరికట్టేందుకు సాధ్యపడగలదని వారు సలహా ఇస్తున్నారు. కరోనా నియంత్రణ ఉద్దేశ్యంతో నెలకొల్పిన పీఎం కేర్స్ ఫండ్ నిధులను వలస పనివారి శ్రేయస్సుకోసం వినియోగించాలని సీపీఎం సీనియర్ నేత బృందాకారత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బ్రెజిల్ తరహాలో వలస కార్మికులకు నేరుగా రూ. 7500 వంతున నగదు రూపంలో అందించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ గట్టిగా వాదిస్తున్నారు. ఎన్నికల యజ్ఞంలో వలస కార్మికులు కూడా సాధారణ ఓటర్లే అన్న విషయం మరచి నిర్లక్ష్యం వహిస్తే  రాజకీయులు భారీగా నష్టపోగల ప్రమాదం ఉందటున్న  రాజకీయ విమర్శకుల విశ్లేషణ గమనార్హం. వలస కార్మికులు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్తున్న క్రమంలో చోటుచేసుకుంటున్న  ఆకస్మిక దుర్మరణాలు మరో విషాదం..అత్యంత బాధాకరం.

కృష్ణారావు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ విశ్రాంత ఉన్నతాధికారి

Related posts

వివాహ వ‌య‌సు పెంచితే.. కొంద‌రికి బాధ

Sub Editor

మైనింగ్ ద్వారా నష్టపోయిన వారికే పెద్ద పీట

Satyam NEWS

జైలా? బెయిలా?: సీబీఐ కోర్టు ఆదేశాలపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ

Satyam NEWS

Leave a Comment