26.7 C
Hyderabad
May 3, 2024 10: 57 AM
Slider సంపాదకీయం

ఎటాకింగ్ పాలిటిక్స్ కాదు… ప్లానింగ్ పాలిటిక్స్ కావాలి

#BandiSainjai

ఎన్నికలు జరిగిన రెండు పట్టభద్రుల ఎమ్ ఎల్ సి స్థానాలలో టీఆర్ఎస్ విజయం సాధించడం ఆషామాషీగా జరిగింది కాదు. అభ్యర్ధుల ఎంపిక నుంచి పోలింగ్ వరకూ ఆ పార్టీ తీసుకున్న జాగ్రత్తలు విజేతగా నిలబెట్టాయి.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో విజయం సాధించడం, ఆ తర్వాత జరిగిన హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి గణనీయమైన స్థానాలు సాధించడంతో తెలంగాణ బిజెపిలో ఆత్మవిశ్వాసం విపరీతంగా పెరిగిపోయింది.

ఆత్మ విశ్వాసంతో బాటు అత్యాస పెరిగిపోయింది. టీఆర్ఎస్ పార్టీని ఢీ కొనేది తామే అనే విశ్వాసం ప్రదర్శించడం కూడా ఎక్కువ అయింది. దుబ్బాకలో బిజెపి గెలిచింది అనడం కన్నా రఘునందన్ రావు గెలిచాడు అనడం కరెక్టుగా ఉంటుంది.

అదే విధంగా హైదరాబాద్ లో వరదలు రావడం, ఆ తర్వాత జరిగిన సహాయ కార్యక్రమాలలో అధికార పార్టీ ఘోరమైన తప్పులు చేయడంతో అది హైదరాబాద్ ఎన్నికలపై ప్రభావం చూపింది. అంతకు ముందు జరిగిన లోక్ సభ ఎన్నికలలో నాలుగు స్థానాలు కైవసం చేసుకున్నప్పుడు బిజెపిలో ఇంత అతిశయం లేదు.

దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత బిజెపి అత్యాశ

నాలుగు స్థానాలలో గెలుస్తామని బహుశ బిజెపి కూడా అప్పటికి అంచనా వేసుకుని ఉండదు. ఆ విజయం తర్వాత బిజెపికి పెద్దగా లాభం కలగలేదు. దుబ్బాక, జీహెచ్ఎంసి ఎన్నికల తర్వాత బిజెపి అత్యాశ పెరగడంతో ఎమ్మెల్సీ ఎన్నికలలో తొడగొట్టింది బిజెపి.

లోక్ సభ, దుబ్బాక, జీహెచ్ ఎంసి ఎన్నికల తర్వాత ఆశ పెంచుకోవడమే తప్ప సంస్థాగతంగా బలపడేందుకు బిజెపి ప్రయత్నం చేసింది లేదు. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలకు విస్తరించేందుకు ఏం చేయాలి? వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్ధులను ఇప్పటి నుంచే ఎలా సన్నద్ధం చేసుకోవాలని అన్న కసరత్తులు జరగలేదు.

టీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకత ఓట్లుగా వచ్చేస్తాయనే మితిమీరిన విశ్వాసంతోనే బిజెపి పని చేస్తున్నది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనునిత్యం ముఖ్యమంత్రి కేసీఆర్ ను తిట్టడం తప్ప పార్టీ పటిష్టతకు చర్యలు తీసుకోవడం లేదు.

అధికారంలో ఉన్న పార్టీని తిట్టడం, ఆ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడం పాత తరం రాజకీయం. ఇప్పుడు కేవలం ప్రభుత్వ వ్యతిరేకత ఒక్కటే సరిపోదు. ప్రజల పాజిటీవ్ మద్దతు పొందాల్సి ఉంటుంది. ఆ దిశగా బిజెపి చర్యలు తీసుకోవడం లేదు.

దీన్నే అతి విశ్వాసం అంటారు

త్వరలో జరగబోయే నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో కూడా బిజెపి తన బలం ఏమిటో అంచనా వేసుకోకుండా సవాళ్లు చేయడం మొదలు పెట్టింది. దీన్నే అతి విశ్వాసం అంటారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి అభ్యర్ధులు వ్యూహాత్మకంగా వ్యవహరించలేదు. గ్రామాలకు విస్తరించలేదు.

అంత యంత్రాంగం కూడా బిజెపి లేదనే విషయం ఎమ్మెల్సీ ఎన్నికలలో అర్ధం అయింది. ఈ లోటును భర్తీ చేసుకోవడానికి బిజెపి ప్రయత్నాలు చేయాలి. అలా కాకుండా కేవలం కేసీఆర్ ను తిడితే ఓట్లు వాటంతట అవే వస్తాయి అనుకోవడం పొరబాటు.

ఎమ్మెల్సీ ఎన్నికలలో మాజీ ప్రధాని పి వి నరసింహారావు కుమార్తె వాణీదేవిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధిగా ప్రకటించగానే బిజెపి సంతోషపడింది. వాణీదేవి తమకు సాటి రాదని అంచనా వేసుకున్నది. తమ పోటీ ప్రొఫెసర్ నాగేశ్వర్ తోనే అని బలంగా నమ్మింది.

రాజకీయ నేపథ్యం లేని వాణిదేవిని తక్కువ అంచనా వేయడమే బిజెపి చేసిన తప్పిదం. టీఆర్ఎస్ డమ్మీ అభ్యర్ధిని పెట్టి తన మద్దతును ప్రొఫెసర్ నాగేశ్వర్ కు అందచేస్తుందని బిజెపి వాట్సప్ యూనివర్సిటీ విస్తృత ప్రచారం చేసింది.

కేవలం వాట్సప్ లతో ఎన్నికలు జరగవు. క్షేత్ర స్థాయిలో యంత్రాంగాన్ని సమకూర్చుకోవాల్సి ఉంటుంది. మరో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర రెడ్డి తన ఎన్నికను ఈజీగా తీసుకోలేదు. తనకు బలమైన ప్రత్యర్థి ఎవరో ముందుగానే అంచనా వేసుకున్నారు.

అందుకు తగిన వ్యూహం రూపొందించుకున్నారు. విజయం సాధించారు. టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన తర్వాత బిజెపి చేసిన ఆరోపణలు కూడా జుగుప్సాకరంగా ఉన్నాయి. తాము గెలిస్తే ప్రజల మద్దతుతో గెలిచినట్లూ, టీఆర్ఎస్ గెలిస్తే ధనబలంతో గెలిచినట్లు కామెంట్లు చేయడం బిజెపి హుందాతనాన్ని ఇవ్వవు. ఇలాంటి కామెంట్లు చేస్తుంటే తమ లోపాలు కనిపించవు, ప్రత్యర్థి బలమూ కనిపించదు. ఫలితంగా మరిన్ని ఓటములు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త.   

Related posts

ఘనంగా మహంకాళీ అమ్మవారి ఆలయ కల్యాణ మండప ప్రారంభోత్సవం

Satyam NEWS

అక్కా, నిను పట్టించుకోని సమాజాన్ని క్షమించు

Satyam NEWS

కొల్లాపూర్ లో నాటు సారా స్థావరాలపై ఎడతెరిపిలేని దాడులు

Satyam NEWS

Leave a Comment