33.7 C
Hyderabad
April 30, 2024 00: 37 AM
Slider జాతీయం

Analysis: అమ్ముడు పోతున్న చదువును అడ్డుకోగలమా?

#NarendraModi

“జాతి విద్యావంతమైతేనే ఆశించిన ప్రగతి సాధ్యపడగలదు. ఒక జాతి సర్వతో ముఖాభివృద్ధి ఆ జాతి చైతన్యం పై ఆధారపడి ఉంటుంది. జాతి చైతన్యవంతం కావాలంటే విద్య ఒక్కటే శక్తివంతమైన సాధనం.” – అన్నారు భారత దేశ పూర్వ ప్రధాని స్వర్గీయ పీ.వీ.నరసింహారావు.

1992 లో నూతన జాతీయ విద్యావిధానం ప్రకటన సందర్భంగా ఆయన చేసిన ప్రసంగం జాతికి సవ్యపథాన్ని అందిస్తుందని ఆనాటి విద్యా సంస్కరణవాదులు బలంగా విశ్వసించారు. కానీ… అప్పటికే వేళ్ళూనుకున్న  వ్యవస్థీకృత లోపాలు కారణంగా లక్షించిన ఫలితాలు సాధించడంలో విద్యారంగం విఫలమైందని విద్యారంగ నిపుణులు అంటున్నారు.

 దాదాపు 28 ఏళ్ళ తర్వాత మోదీ ప్రభుత్వం నూతన విద్యావిధానం (ఎన్ ఈ పీ) ప్రకటించి, కార్యాచరణ కు సంబంధించిన ముసాయిదాను ప్రకటించి చర్చకు తెర తీసింది. కొఠారి కమిషన్ సలహాలు, సూచనలు పరిగణనలోకి తీసుకుని విద్యావేత్తలు, నిపుణులతో సమగ్రంగా చర్చించి నూతన విద్యావిధానంలో సమూల మార్పులు చేస్తున్నట్లు ప్రకటించింది.

తాజాగా నేడు భారత రాష్ట్రపతి నేతృత్వంలో నిర్వహించిన విద్యావేత్తల సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల కులపతులు, పలు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు వర్చువల్ సమావేశంలో మాట్లాడారు.

కొత్త విద్యావిధానంతో మార్పు ఉంటుందా?

ఒత్తిడిలేని విద్యను ఈ తరానికి అందించడం లక్ష్యంగా ఎన్ ఈ పీ కొత్త తరహా విద్యావిధానాన్ని ఆవిష్కరించనుందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. భాష, సంస్కృతి, పలు కళలు, ఇతర సృజనాత్మక ఆలోచనలు సమ్మిళితమై ఒక నూతన నమూనా అందించే దిశగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు.

‘ పేషన్, ప్రాక్టికాలిటీ, పెర్ఫార్మన్స్’ ప్రాధాన్యతలుగా ఎన్ ఈ పీ నవీనరూపు సంతరించుకునే దిశగా  బృహత్తర కృషికి కేంద్రం, రాష్ట్రప్రభుత్వాలు భాగస్వామ్యం కావాలని ఆయన జాతికి పిలుపునిచ్చారు. అయితే…. విద్యావేత్తలు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సార్వత్రిక విద్య ప్రయివేటు వ్యవస్థ చేతిలో బందీగా ఉన్నట్లు, రానున్న విద్యాసంవత్సరాలలో విద్య సగటు మనిషికి అందకుండాపోయే ప్రమాదంఉందని వారు ఆవేదన చెందుతున్నారు.

దేశప్రగతికి ఆయువుపట్టయిన విద్య, వైద్యరంగాలలో ప్రయివేటు శక్తుల ధనస్వామ్యం చొరబడిన కారణంగా ఆయారంగాలు సామాన్యులను కష్టాలపాలు చేశాయి. ముఖ్యంగా….రాజ్యాంగ బద్ధంగా అందరికీ అండాల్సిన విద్య అతి ఖరీదైన బ్రహ్మ పదార్ధంగా మారిపోయింది.

చదువు ‘కొనే’ పరిస్థితి దారుణం

చదువుకునే పరిస్థితి నుంచి వేలూ లక్షలు పోసి చదువు కొనుక్కునే దుస్థితి దాపురించింది. పెట్టుబడిదారులకు ఆదాయవనరుగా పరిణమించడంతో విద్యాలయాలు తామరతంపరగా పుట్టుకొచ్చాయి. ప్రభుత్వం నియంత్రణ మృగ్యం కావడంతో విద్యారంగం  వ్యాపారుల చేతిలోకి వెళ్ళి పోయింది.

ఫలితంగా విద్యావ్యవస్థలో విలువలు నశించాయి.  “తరగతి గదిలో దేశభవిత నిర్ణయం చోటుచేసుకుంటుంది” అని విశ్వసించిన ఆనాటి విద్యాసంస్కర్తల ఆశయాలు నీరుగారిపోయాయి. దీనికి తోడు….ఆంగ్లేయులు భారతదేశంపై బలవంతంగా రుద్దిన మెకాలే విద్యా విధానం గుమాస్తాతరహా ఉపాధికే ఉపయుక్తం కాగలదని చాలా కాలంగా విద్యారంగప్రముఖులు విమర్శిస్తూనే ఉన్నారు.

ఇప్పటికీ మౌలికంగా దశాబ్దాలనుంచి అదేవిధానాన్ని కొనసాగించడం ప్రభుత్వ పెద్దల హ్రస్వదృష్టికి అద్దంపడుతోంది. తాజాగా వెలువడిన నివేదిక ప్రకారం భారతదేశంలో 35% నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. సగటు అక్షరాస్యత శాతం పురుషులలో 76.9గా, స్త్రీల లో 54.5 గా నిర్ధారించినట్లు తెలుస్తోంది.

పరిస్థితి ఇలాగే కొనసాగితే 2060 నాటికి మాత్రమే దేశంలో సంపూర్ణ అక్షరాస్యత సాధ్యం కాగలదని అంచనా. చేస్తున్న ప్రణాళికలు ఎంత ఘనంగా ఉన్నా తగినస్థాయిలో ఆర్ధిక కేటాయింపులు లేకపోతే ఆశించిన ఫలితాలు పొందడం అసాధ్యమని నిపుణులు అంటున్నారు. ఇప్పటివరకు అమలులో ఉన్న ‘మానవ వనరుల శాఖ’  ‘విద్యాశాఖ’ పేరు మార్చుకుంది.

అందుకు తగినట్లే సమూల సంస్కరణలు చోటుచేసుకుంటేనే విద్యారంగం కొత్తపుంతలు తొక్కగలదు అంటున్న విద్యావేత్తల సూచన శిరోధార్యం.

పొలమరశెట్టి కృష్ణారావు ( అంతర్జాతీయ అక్షరాస్యతా దినోత్సవం సందర్భంగా)

Related posts

వడివడిగా అడుగులు వేస్తున్న రైజింగ్ ఆర్టిస్ట్ జయశ్రీ రాచకొండ

Satyam NEWS

షర్మిల అరెస్టుపై గవర్నర్ ఆందోళన

Murali Krishna

ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో వివేకానంద జయంతి

Satyam NEWS

Leave a Comment