31.7 C
Hyderabad
May 2, 2024 10: 39 AM
Slider జాతీయం

President election: ఫలితం ముందే తెలిసిన పోరాటం

#drawpadimurmu

భారత దేశానికి మరో మహిళ రాష్ట్రపతి కావడానికి అవకాశం వచ్చిన సందర్భం ఇది. భారతదేశానికి మొట్ట మొదటి మహిళా రాష్ట్రపతి  ప్రతిభా పాటిల్ తర్వాత తిరిగి అటువంటి అరుదైన అవకాశం ద్రౌపది ముర్ము కి రావడం విశేషం. ఒడిశాలో దేశంలోనే అత్యంత వెనుకబడిన జిల్లాలలో ఒకటైన మయూర్ భంజ్ లో గిరిజన సంతాల్ తెగకు  చెందిన  ద్రౌపది ముర్ముని ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక చాలా కసరత్తు జరిగినట్లు బీజెపీ జాతీయ అధ్యక్షుడు జే పీ నడ్డా తెలిపారు.

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం దాదాపు ఇరవై పేర్లను పరిశీలించి, చివరకు మహిళా నేత ద్రౌపది ముర్మును రంగలోకి దింపినట్లు ఆయన అన్నారు. ద్రౌపది ముర్ము ఎంపిక ముందు ఛత్తీస్ ఘడ్ గవర్నర్ అనసూయ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పేర్లు రాష్ట్రపతి అభ్యర్థిత్వం రేసులో గట్టిగా వినిపించాయి. ఒక దశలో రాష్ట్రపతి ఎన్నికపై ఏకాభిప్రాయ సాధనకు బీజేపీ నిర్ణయం తీసుకుంది.

ఇందుకోసం మిత్రులతో పాటు విపక్ష యూపీఏ భాగస్వామ్య పక్షాలతోనూ, ప్రాంతీయ పార్టీలతోను సంప్రదించడానికి బీజేపీ అధ్యక్షడు జేపీ. నడ్డా,రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ లకు ఈ బాధ్యత అప్పగించింది. గతంలో కూడా 2017లో జరిగిన రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రామ్ నాథ్ కోవింద్ ను అభ్యర్థిగా ఖరారు చేశాక చివరి క్షణాలలో తమను సంప్రదించాయని విపక్షాలు ఆరోపించాయి.

అందుకే ఈ సారి వాటికి ఆ అవకాశం ఇవ్వరాదన్నది  బీజేపీ ఉద్దేశం. అయితే..విపక్షాలు ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ను అభ్యర్థిగా ప్రకటించడంతో ఏకాభిప్రాయం సాధ్యం కాలేదని జేపీ నడ్డా తెలిపారు.

ఈ సారి రాష్ట్రపతి ఎన్నిక అటు బీజేపీకి సారథ్యంలోని ఎన్డీఏ కు..ఇటు విపక్షాలకు కీలకం కానుంది. 2024 లో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీఏ ఎత్తుగడకు ఇది తొలి అడుగు అని పరిశీలకులు భావిస్తున్నారు.

వరుసగా మూడో సారి కేంద్రంలో అధికారం చేపట్టి హ్యాట్రిక్ సాధించాలనే ఏకైక అజెండాతో బీజెపీ పావులు కదుపుతోంది. ప్రస్తుతానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నా..2024 ఎన్నికలలో ఒకవేళ  అనూహ్యంగా రాజకీయ సంక్షోభం ఏర్పడితే కేంద్రంలో పార్టీకి పూర్తి మద్దతు ఇవ్వడానికి తమకు అనుకూలంగా ఉండే రాష్ట్రపతి ఉండడం అవసరం అని భావించి ఎన్డీఏ అటువంటి వ్యక్తిని తన అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు మీడియాలో ఒక వర్గం బలంగానే గొంతు వినిపిస్తోంది.

ఇక..మరో వైపు దృష్టి సారిస్తే..బీజేపీని వ్యతిరేకించే రాజకీయ పార్టీలు ఉమ్మడి అభ్యర్థి గా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, గోపాల కృష్ణ గాంధీ తదితరులను సంప్రదించినా వారు అంగీకరించక పోవడంతో ఒకనాటి బీజెపీ నేత , కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా ను రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీలో నిలిపారు.

ఈ నేపథ్యంలో ఒక ఆదివాసీ గిరిజన మహిళ ను రాష్ట్రపతి అభ్యర్థిగా బలపరచడానికి కేవలం రాజకీయ లబ్ది మాత్రమే నని విపక్షాలు విమర్శిస్తున్నాయి. విపక్షాల ఉమ్మడి  అభ్యర్థి  యశ్వంత్ సిన్హాఒక అడుగు ముందుకు వేసి ఆదివాసీల సంక్షేమం కోసం ద్రౌపది ముర్ము అసలు ఏమి చేశారని, జార్ఖండ్ గవర్నర్ సహా వివిధ పదవుల్లో కొనసాగిన ఆమె ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

వాజ్ పేయి హయాంలో కేంద్ర మంత్రి హోదాలో తాను ఎస్టీలకు,వెనుకబడిన తరగతులకు ఎంతో చేశానని ఆయన తెలిపారు. ఆదివాసీ కుటుంబంలో జన్మించినంత మాత్రాన ఆ వర్గానికి ద్రౌపది ముర్ము  ఆ వర్గానికి ఛాంపియన్ కాలేరని , ఆ వర్గానికి ఏం చేశామన్నది

ముఖ్యమని యశ్వంత్ సిన్హా అన్నారు. ఆమె ఒడిశా రాష్ట్రంలో ఏర్పడిన బీజేడీ – బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం లో మంత్రిగా ఉన్న కాలంలో జరిగిన ఒక సంఘటనలో 12 మంది ఆదివాసీలు పోలీసు కాల్పులలో చనిపోయారు. ఆ ఘటనపై కనీసం సానుభూతి కూడా తెలపలేదు అని యశ్వంత్ సిన్హా ను బలపరుస్తున్న  తెరాస మంత్రి కే. తారక రామారావు విమర్శించారు.

ఇలాంటి విమర్శలు, ప్రతి విమర్శల మధ్య జూలై 18 న జరుగనున్న రాష్ట్రపతి ఎన్నికలలో ఎవరికి వారే గెలుపు మాదేనని రెండు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రపతిని ఎన్నుకునే ఎలెక్టోరల్ కాలేజిలో ఎన్డీఏ కు 48 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయి.

వీటికి తోడు బీజేడీ, వైయస్ ఆర్ సీ పీ కూడా ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వానికి మద్దతు ప్రకటించడంతో ఆమె విజయం తథ్యం అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా పీఐటీ తో మాట్లాడుతూ ‘ ఈ సారి రాష్ట్రపతి ఎన్నికలు జరుగుతున్నది గుర్తింపు కోసం కాదు సిద్ధాంతం కోసం ‘ అనడం ప్రాధాన్యత సంతరించుకుంది.

రాష్ట్రపతి పదవి కేవలం అలంకార ప్రాయం లేదా రబ్బర్ స్టాంప్ కాకూడదని  ప్రజాస్వామ్య ప్రియులు ఆశిస్తున్నారు. ఏదో ఒక వర్గాన్ని సంతృప్తి పరచడం కోసం రాజ్యాంగం నిర్వచించిన అత్యున్నత పదవులైన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి వంటి కీలక స్థానాల హందాను, గౌరవాన్ని, ప్రతిష్టను పెంచేలా రాజకీయ పార్టీలు వ్యవహరించాలని వారు సూచిస్తున్నారు.

అదృష్ట వశాత్తూ భారత దేశానికి రాష్ట్రపతులుగా సేవలు అందించిన వారు అందరూ..ఏవో కొన్ని చిన్న చిన్న సంక్లిష్టత లు  చోటుచేసుకున్న సందర్భాలలో తప్ప …హుందా గానే వ్యవహరించారు. ఈ సారి కూడా రాష్ట్రపతిగా ఎవరు గెలిచినా దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను పరిరక్షించేందుకు నిబద్దులై ఉంటారని విశ్వసిద్దాం.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ, సామాజిక విశ్లేషకుడు

Related posts

తిరుపతిలో మద్యం దుకాణాలు మూసివేయాలి

Satyam NEWS

అమరావతిలో సుజనా చౌదరి భూములు ఇవి

Satyam NEWS

ప్రికాషన్: కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధింపు

Satyam NEWS

Leave a Comment