38.2 C
Hyderabad
April 29, 2024 21: 35 PM
Slider ప్రత్యేకం

బాగా డబ్బులు ఉన్న వారికే రాజ్యసభ టిక్కెట్లు

#jagan

రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి త్వరలో ఎన్నికలు జరుగనున్న రాజ్య సభ స్థానాలకు ఎంపికలు పూర్తయ్యాయి. ఆంధ్ర ప్రదేశ్ లో 4 స్థానాలలో  ఇద్దరు అభ్యర్థులను రెడ్డి కులంనుంచి,మరో ఇద్దరు అభ్యర్థులను బీసీ వర్గాల నుంచి అధికార వై యస్ ఆర్ సీపీ ఎంపిక చేసింది.

వై ఎస్ ఆర్ పార్టీ విధేయుడు, సీనియర్ నేత , ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయి రెడ్డిని మరోసారి రాజ్యసభకు పంపించడంలో ఎటువంటి కొత్తదనం లేదు. ఆయన ఎంపిక లాంఛనమే అని పార్టీ వర్గాలలో చాలా కాలంగా వినిపిస్తోంది. అదే నిజమైంది. మిగిలిన మూడు స్థానాలకు ఎవరిని ఎంపిక చేస్తారు అనే విషయంలో అనేక ఊహా గానాలు వినిపించినా..వాటన్నిటికీ తెర దించుతూ నిర్మల్, ఆదిలాబాద్ కు చెందిన న్యాయవాది నిరంజన్ రెడ్డిని, అలాగే తెలంగాణకు చెందిన మరో ప్రముఖ వ్యక్తి, బీసీ నేత ఆర్. కృష్ణయ్య ను ఎంపికచేయడం రాజకీయ వర్గాలలో చర్చనీయాంశమైంది.

తెలంగాణ పౌరులకు ఆంధ్రా టిక్కెట్టు

ఇక…నాలుగవ రాజ్య సభ స్థానానికి ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన మరో బీసీ నేత బీద మస్తానరావు ఎంపిక కూడా ఆసక్తికరంగా మారింది. ఉన్న నాలుగు స్థానాలలో రెండు స్థానాలకు తెలంగాణ నుంచి ఎంపికచేయడంతో సొంత పార్టీలో అసంతృప్తి వ్యక్తం కావడం సహజం. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న వై ఎస్ ఆర్సీపీ పార్టీ విధేయులను కాదని తెలంగాణ నుంచి ఎంపిక చేయడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నిరంజన్ రెడ్డి వృత్తి రీత్యా న్యాయవాది కావడంతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రికి సంబధించిన వ్యక్తిగత కేసులను పర్యవేక్షణ చేస్తున్నారు. దానికి ప్రతి ఫలంగా ఆయనకు రాజ్యసభకు ఎంపిక చేసినట్లు భావించాలి. బీసీ వర్గాల జాతీయ నేత ఆర్.కృష్ణయ్య ఎంపిక వెనుక కేవలం ఓటు రాజకీయమే ప్రధానమని పరిశీలకులు అంటున్నారు. రాబోవు శాసన సభ ఎన్నికలలో బీసీల ఓట్ బ్యాంక్ కీలకం కానుంది. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి బీసీలు మద్దతు ఇస్తూనే ఉన్నారు.

కృష్ణయ్య బిసీల గురించి మాట్లాడితే ఒకే

రాష్ట్ర జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీల మద్దతు కోసం రాజకీయ పార్టీలు పావులు కదపడం సహజం. ఆ ఎత్తుగడలో భాగంగానే ఆర్.కృష్ణయ్య ఎంపిక జరిగిందని వినిపిస్తోంది. బీసీల అభ్యున్నతికి అనేక చిరకాలంగా పోరాటం చేస్తున్న ఆర్.కృష్ణయ్య రాజ్య సభలో కూడా తన వాణిని వినిపించే అవకాశం ఉంది.

బీసీ ల జనగణన, వర్గీకరణ వంటి అనేక అంశాలపై పెద్దల సభలో మాట్లాడితే ఎంతో కొంత ప్రయోజనం ఉండగలదని ఆశించి బీసీ నేత వై ఎస్ ఆర్ సీపీ అభ్యర్థనకు అంగీకరించి ఉండవచ్చని సమాచారం. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో బీసీ లకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తున్న క్రమంలోనే బీద మస్తాన్ రావు ఎంపిక జరిగింది.

తెలంగాణ లో డబ్బున్నోళ్లకే అందలం

రాష్ట్రంలో ఎన్నికల వేడి పుట్టిస్తున్న బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెక్ పెట్టేందుకే వై ఎస్ ఆర్ సీపీ పెద్దల సభకు అభ్యర్థులను ఎంపిక చేసినట్లు భావించాలి. తెలంగాణ రాష్ట్రంలో రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక మొదటి నుంచీ తెరాస పార్టీలో ఉత్కంఠ రేపింది. తెరాస అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి కె సి ఆర్ ముగ్గురు కొత్తవారిని తెరపైకి తెచ్చారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగే మూడు రాజ్య సభ స్థానాలకు తెరాస పార్టీ విధేయుడు, నమస్తే తెలంగాణ డైలీ సీ ఎం డీ  దీవకొండ  దామోదర్ రావు, హెటిరో గ్రూప్ అధినేత పార్థసారథి రెడ్డి, గాయత్రి గ్రానైట్ ఎండీ వద్దిరాజు రవి చంద్ర ను ఎంపిక చేశారు.

వీరిలో దామోదర్ రావు వెలమ కాగా, గాయత్రి రవి మున్నూరు కాపు, పార్థ సారథి రెడ్డి రెడ్డి కులం. ఈ ఎంపికలో కుల సమీకరణలతో పాటు రాజకీయ అవసరాలు కూడా ముడి పడి ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు. మొదటి నుంచీ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అనేక ఎన్నికల సందర్భంగా బడా పారిశ్రామిక వేత్తలు, వ్యాపార ,వాణిజ్య ప్రముఖుల ఆర్థిక తోడ్పాటు అందిస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అదే ప్రాతిపదిక కారణంగా గాయత్రి రవి, హెటిరో అధినేతను ఎగువ సభకు అభ్యర్థులుగా ఎంపిక చేసినట్లు రాజకీయ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కేంద్రంతో పోరాటానికి ఇది సహకరిస్తుందా?

జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలని భావిస్తున్న తెరాస అధినేతకు  రాజ్యసభ ఎన్నికలు కీలకం కానున్నాయి. త్వరలో జరుగనున్న ఉప రాష్ట్రపతి, రాష్ట్రపతి ఎన్నికలలో తెరాస పాత్ర ఏమిటో తేలాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వంపై..మరీ ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా తెరాస అధినేత చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి.

ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీజెపీ ముఖ్య నేత,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా  తెరాస ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కేంద్రంతో తాడో పేడో తేల్చుకునేందుకు కేసీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేయడానికి కేంద్ర బీజేపీ పార్టీ  వ్యూహాలు పన్నుతున్న నేపథ్యంలో ప్రస్తుత రాజ్య సభ ఎన్నికలు కేసీఆర్ రాజకీయ  అనుభవానికి సవాల్ కానున్నట్లు విమర్శకులు విశ్లేషిస్తున్నారు.  ఇక.. ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రి వై యస్ జగన్ రూట్ మ్యాప్ వేరే విధంగా ఉంటుందని వేరే చెప్పనవసరం లేదు.

పొలమరశెట్టి కృష్ణారావు, రాజకీయ విశ్లేషకులు

Related posts

విజయ్ సేతుపతి నిహారిక కొణిదెల జంటగా “ఓ మంచి రోజు చూసి చెప్తా”

Satyam NEWS

సాయం చేసేందుకు ఎమ్మెల్యేతో పోటీ పడుతున్న ఆయన కుమార్తె

Satyam NEWS

గౌరవేణి సరితకు డాక్టరేట్ ప్రధానం

Satyam NEWS

Leave a Comment