32.2 C
Hyderabad
May 8, 2024 22: 15 PM
Slider సంపాదకీయం

ఆలయాల విధ్వంసం వెనుక ఏం జరుగుతున్నది?

#APPolitcks

ఆంధ్రప్రదేశ్ లో దేవుడి విగ్రహాలు ధ్వంసం అవుతున్నాయి. రధాలు దగ్ధం అవుతున్నాయి. ఆలయాల్లో చోరీలు పెరిగిపోతున్నాయి. ఎందుకు? అకస్మాత్తుగా గత ఏడాదిగానే ఈ సంఘటనలు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి?

 ఇది ఎవరైనా కావాలని పనిగట్టుకుని చేస్తున్నారా? లేదా ‘‘పిచ్చివారు’’ చేస్తున్న వెర్రిచేష్టలా? ఈ ప్రశ్నలన్నింటికి సరైన సమాధానాలు ఎవరికి తెలిసే అవకాశం లేదు కానీ ఈ విషయంపై మాత్రం ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోయి తమ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో కులం నుంచి ప్రతి విషయం రాజకీయంగానే అక్కడి ప్రజలు ఆలోచిస్తున్నారు కాబట్టి దేవుడిపై దాడి కూడా కుల కోణంలోనే ఆలోచిస్తున్నారు. కొన్ని కులాల వాళ్లు ‘తెలుగుదేశం హయాంలో జరగలేదా?’ అని ప్రశ్నిస్తారు. ‘ఎప్పుడూ ఇలా జరగలేదు’ అంటూ మరో కులం వారు సమాధానం చెబుతారు.

ఈ ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఒక వేళ పోలీసు దర్యాప్తు జరిపించినా పోలీసు వ్యవస్థపై ఇటీవలి కాలంలో చాలా మందికి నమ్మకం పోయినందున వారు నిజాయితీగా దర్యాప్తు చేసినా వారు చెప్పేది చాలా మంది నమ్మరు.

కాబట్టి దేవాలయాలపై ఎవరు దాడులు చేస్తున్నారు? అనేది ఇప్పటిలో తేలే అంశం కాదు కాబట్టి జరుగుతున్న సంఘటనలలో ఏ పార్టీకి లాభం ఏ పార్టీకి నష్టం అనేది బేరీజు వేసుకుందాం. ముందుగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు ఏ పార్టీకి ఎలా లాభం చేకూరుస్తాయి అనేది చూస్తే:

అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి:

ప్రస్తుతం చాలా సమస్యల్లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ఈ దాడుల వల్ల కొన్ని లాభాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ అంశంపై ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయాలు చెబుతూ ఉన్నందున ముఖ్యమైన సమస్యలు పక్కకు వెళ్లిపోతాయి. రాష్ట్రంలో చాలా మంది ఉద్యోగులకు జీతాలు రావడం లేదు.

సంక్షేమ పథకాలు ఒక వర్గం వారికే అందుతున్నాయి. రాజధాని తరలింపుపై చిక్కుముళ్లు ఉన్నాయి. నీటిపారుదల ప్రాజెక్టులకు ఒక్క పైసా ఖర్చు చేయడం లేదు. రాజకీయ పరంగా పార్టీ అంతర్గతంగా తలెత్తుతున్న అసమ్మతి… ఇలాంటి విషయాలపై నుంచి ప్రజల దృష్టి మరలిపోవడంతో అధికార పార్టీ సేఫ్ గా ఉంది.

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి:

ప్రతిపక్షంగా ఏ అంశం తీసుకువచ్చినా ప్రజలలో ప్రతిష్ట పెరగడం లేదు. అధికార పార్టీ అవినీతి విషయం ప్రజలు పట్టించుకోవడం లేదు. ‘మాపై అక్రమ కేసులు పెడుతున్నారు’ అని చెప్పినా సానుభూతి రావడం లేదు. కరోనా పరిస్థితిని చక్కదిద్దడంలో జగన్ విఫలమయ్యాడని చెప్పినా ప్రజల నుంచి స్పందన రావడం లేదు.

దేవాలయాలపై దాడులు అనేది అందివచ్చిన అంశం. ప్రజల సెంటిమెంటుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి త్వరగా ప్రజల్లోకి వెళ్లేందుకు టీడీపి ప్రయత్నిస్తున్నది. తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ ఇప్పుడు దేవాలయాలపై దాడుల విషయంపైనే మాట్లాడుతున్నారు.

బిజెపి జనసేన కాంబినేషన్ కి:

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తే తెలుగుదేశం పార్టీకి లాభం కలుగుతుందని వెనకాముందూ ఆడుతున్న బిజెపి ఈ అంశాన్ని తలకెత్తుకున్నట్లు కనిపించాలని ప్రయత్నిస్తున్నది. ఛలో అంతర్వేది ని రాష్ట్ర ప్రభుత్వం భగ్నం చేసినా మెత్తమెత్తగానే విమర్శించింది తప్ప గట్టిగా పోరాడలేదు.

దేవాలయాలపై జరుగుతున్న దాడుల విషయంలో బిజెపి తెగించి పోరాడితే లాభం ఉంటుందని వాదించే వారు ఎక్కువగా ఉన్నా కూడా ఎందుకో ఆ దిశగా బిజెపి రాష్ట్ర నాయకత్వం చర్యలు తీసుకోవడం లేదు. బిజెపి జనసేన ఈ అంశంపై తెగించి పోరాడితే రాబోయే నాలుగేళ్లలో ఒక శక్తిగా మారవచ్చు.

దేవాలయాల అంశంపై వివిధ పార్టీలకు నష్టం ఏమిటంటే:

ప్రభుత్వ ప్రతిష్ట చాలా వరకూ దిగజారిపోయింది. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయింది. టీటీడీ బోర్డు చైర్మన్ వై వి సుబ్బారెడ్డి కదిలించిన డిక్లరేషన్ వ్యవహారం, కొడాలి నాని దేవాలయాలపై చేసిన దారుణమైన వ్యాఖ్యలు ప్రభుత్వ ప్రతిష్టను ఈ అంశంలో మరింత దిగజార్చాయి.

తెలుగుదేశం పార్టీ తన పంథా మార్చి మత ఎజెండాను తలకెత్తుకోవడం వల్ల ముస్లిం మైనారిటీలు ఆ పార్టీకి దూరం అయ్యే ప్రమాదం ఉంది. బిజెపితో పొత్తు పెట్టుకోవడంతో చాలా వరకూ ముస్లింలు తెలుగుదేశం నుంచి వెళ్లిపోగా మిగిలిన వారు కూడా ఇప్పుడు దూరం జరిగే ప్రమాదం పొంచి ఉంది.

ఉత్తరాదిన ఉండే పరిస్థితులు ఏపిలో ఉండవు కాబట్టి హిందూత్వ ఎజెండా ఎత్తుకోవడం వల్ల శ్రమ తప్ప ఓట్లు వచ్చే అవకాశం బిజెపికి చాలా తక్కువగానే ఉంటాయి.

పైగా పోలరైజేషన్ హిందువులకు ముస్లింలకు మధ్య జరుగుతుంది. ఇప్పుడు దేవాలయాలపై దాడులు చేస్తున్నది ముస్లింలు కానందున (సంఘటనలు జరిగిన చోట్ల ముస్లిం జనాభా చాలా తక్కువగా ఉన్నందువల్ల ఈ వ్యాఖ్య చేయాల్సి వస్తున్నది తప్ప దీనికి ఎలాంటి శాస్త్రీయత లేదు)  

పోలరైజేషన్ కు ఆస్కారం లేకపోతే బిజెపి తనకు ఉన్న ఓట్లు కూడా కోల్పోవాల్సి వస్తుంది. ఇన్ని దేవాలయాలపై దాడులు జరుగుతున్నా కూడా బిజెపి చేయాల్సినంత పోరాటం చేయడం లేదని కూడా మెజారిటీ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడు పార్టీలకూ నష్టాలూ లాభాలూ కనిపిస్తున్నాయి. మరిన్ని రోజులు గడిస్తే కానీ ఏ పార్టీకి ఎంత లాభం అనేది మరింత క్లియర్ గా తెలియదు.

Related posts

క్లీన్ అభ్యర్ధి వాణీదేవిని ఎమ్మెల్సీ గా ఎన్నుకోండి

Satyam NEWS

ఆసుపత్రి భవనం పైనుంచి దూకి కరోనా పేషెంట్ ఆత్మహత్య

Satyam NEWS

డిమాండ్: ఎన్నికలు వాయిదా కాదు వెంటనే రద్దు చేయాలి

Satyam NEWS

Leave a Comment