38.2 C
Hyderabad
April 29, 2024 19: 50 PM
Slider ప్రత్యేకం

మళ్లీ అసహనానికి లోనైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

Nilam-Sawhaney

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సహానీ మరొక్క సారి తీవ్ర అసహనాన్ని ప్రదర్శించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో తనకు తెలియకుండా మంత్రి వర్గానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ రావడంపై కినుక వహించిన నీలం సహానీ సెలవు పై వెళ్లేందుకు ఉద్యుక్తమయ్యారు.

అయితే మళ్లీ ఇంకో సారి అలా జరగకుండా చూస్తామని సీనియర్ ఐఏఎస్ లు అనునయించి చెప్పడంతో ఆమె అప్పటికి శాంతించారు. అయితే మళ్లీ తాజాగా మరో వివాదం చెలరేగడంతో ఆమె అసహనానికి గురి అవుతున్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవి కాలాన్ని మూడు సంవత్సరాలకు తగ్గించాలని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకురాగా రాష్ట్ర గవర్నర్ దాన్ని ఆమోదించడంతో చట్టంగా రూపుదిద్దుకున్నది.

దీనికి సంబంధించి రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ 617, 618 జీవోలు జారీ చేసింది. ఎన్నికల కమిషనర్ పదవి కాలం కుదించడంతో బాటు మాజీ న్యాయమూర్తిని నియమించాలని ఈ చట్ట సవరణ సారాంశం. దాంతో అప్పటి వరకూ ఎన్నికల కమిషనర్ గా ఉన్న డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ వైదొలగాల్సి వచ్చింది.

కొత్తగా రిటైర్డ్ జస్టిస్ కనగరాజ్ ఎన్నికల కమిషనర్ గా నియమితులయ్యారు. అనంతరం జరిగిన పరిణామాలతో మాజీ ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆర్డినెన్సు చట్టబద్ధతను ఆయన ప్రశ్నించారు. ఈ అంశానికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది.

రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయడం అంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారు. అయితే ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నోటీసుకు వెళ్ల కుండా నేరుగా పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేదీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేసినట్లు తెలిసింది.

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేదీ నే జీవోలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ దాఖలు చేయాల్సిన అవసరం ఏర్పడింది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశాలు అందగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పేరుతో కౌంటర్ రూపొందించారని తెలిసింది.

అయితే ఈ కౌంటర్ పై సంతకం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిరాకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అన్ని కార్యక్రమాలు తన ప్రమేయంతో జరగనందున కౌంటర్ దాఖలు చేసే పని కూడా తాను చేయలేనని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారని అంటున్నారు. దాంతో పంచాయితీరాజ్ శాఖ కార్యదర్శి బాధ్యత తీసుకుని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తరపున రాష్ట్ర హైకోర్టులో కౌంటర్ దాఖలు చేసినట్లు విశ్వసనీయంగా తెలిసింది. తన జోక్యం లేని విషయాలపై తనను బాధ్యురాలిని చేస్తానంటే తాను అలాంటి బాధ్యతను తీసుకునేది లేదని నీలం సహానీ కరాఖండిగా చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

Related posts

నెల్లూరులో విజయవంతంగా సాగుతున్న బాలోత్సవ్

Satyam NEWS

లోక్‌స‌భ‌లో టీఆర్ఎస్ ఎంపీల ఆందోళ‌న‌..

Satyam NEWS

హుజూర్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి అంబులెన్స్ బహుకరణ

Satyam NEWS

Leave a Comment