40.2 C
Hyderabad
April 29, 2024 18: 32 PM
Slider ఆంధ్రప్రదేశ్ సంపాదకీయం

కొత్త అప్పులు పుట్టని పాత అప్పుల ఊబి ఆంధ్రప్రదేశ్

Amaravathi

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధికంగా ఊబిలో చిక్కుకుపోయి ఉంది. దేశం, ఆ మాటకు వస్తే ప్రపంచం మొత్తం ఆర్ధిక మాంద్యంలో ఉంది కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇలా ఉండటం సహజం అనుకుంటున్నారా? కానే కాదు. ఇది స్వయం కృతం. విచ్చలవిడి ఖర్చులతో, ఉత్పాదకత లేని, రాని పథకాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారుణమైన ఆర్ధిక పతనం వైపు పరుగులు తీస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన చంద్రబాబునాయుడు ఆర్ధిక పతనానికి బాటలు వేస్తే అదే మార్గంలో జగన్ ప్రభుత్వం కూడా పయనిస్తున్నది.

పదవి చేపట్టిన కొత్తలో డబ్బు ఆదా చేస్తున్నట్లు చెప్పిన జగన్ ప్రభుత్వం ఆ తర్వాత విచ్చలవిడి ఖర్చులు చేయడం ప్రారంభించింది. ఉత్పాదక ఖర్చు చేయకుండా కేవలం డబ్బులు పంచే పథకాలే అమలు చేస్తున్నందున దేశంలోని ఏ ఆర్ధిక సంస్థ కూడా కొత్త అప్పులు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక పెద్ద బ్యాంకును అప్పు కోసం సంప్రదించగా ‘మీరు అమలు చేస్తున్న పథకాలు ఉత్పాదకత పెంచే విధంగా లేవు. అందుకోసం మీకు కొత్త అప్పు ఇవ్వలేం’ అని సమాధానం ఇచ్చింది.

పని చేసుకునే ఆటో వారికి డబ్బులు పంచిపెట్టడం, కేసులు వాదించుకునే లాయర్లకు డబ్బులు పంచడం, ప్రయివేటు స్కూళ్లలో చదివే వారికి కూడా అమ్మ వొడి లాంటి పథకాలు అమలు చేయడం, విచ్చలవిడిగా జీతాలు పెంచడం తదితర అన్ని స్కీమ్ లూ కూడా తిరిగి ఆర్ధిక వ్యవస్థను మెరుగుపరిచేవి కాదని ఆర్ధిక సంస్థలు చెబుతున్నాయి. మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టేందుకు అప్పు తీసుకుంటే ఫర్వాలేదు కానీ సంక్షేమం పేరుతో డబ్బులు పంచిపెట్టే పథకాల వల్లే ఆంధ్రప్రదేశ్ ఈ స్థితికి వచ్చిందని ఆర్ధిక సంస్థలు చెబుతున్నాయి.

వీటన్నింటితో బాటు ప్రభుత్వ ఉద్యోగులను పూర్తి స్థాయిలో వినియోగించుకోకుండా పదవి విరమణ చేసిన వారిని, తమకు అనుకూలమైన వారిని నామినేటెడ్ పోస్టుల్లో సలహాదారులుగా పెట్టుకుని రెండున్నర నుంచి 3 లక్షల రూపాయల వరకూ జీతం ఇవ్వడం వల్ల కోట్లాది రూపాయలు వృధా అవుతున్నాయి. ఒక్క ఆర్ధిక శాఖ లోనే దాదాపు 6 గురు సలహాదారులు ఉన్నారు. ప్రభుత్వానికి ప్రతి నెలా జీతభత్యాలు, పెన్షన్లు, ఇతర ఖర్చులకు దాదాపుగా 7 నుంచి 8 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయి. అయితే ఆ మేరకు ఆదాయం లేదు. ఇటీవలి కాలంలో జిఎస్ టి వసూళ్లు కూడా పడిపోయాయి. ఎఫ్ఆర్ బిఎం నిబంధనల ప్రకారం రిజర్వు బ్యాంకు నుంచి 24 వేల కోట్లు మాత్రమే ఓడీ తీసుకునే వీలు ఉండగా ప్రభుత్వానికి 32 వేల కోట్లు కావాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్ గ్యారెంటీ ఇస్తే కూడా రుణం ఇచ్చేందుకు ఆర్ధిక సంస్థలు ముందుకు రావడం లేదు. ఇవన్నీ చూస్తుంటే ఆర్ధికంగా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాల కన్నా ముందే దివాలా తీసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.

Related posts

హుజూర్ నగర్ పట్టణంలో విగ్రహాలు తొలగింపులో ఉద్రిక్తత

Satyam NEWS

కోడికత్తి కేసు: స్టేట్ మెంట్ లో సంచలన విషయాల వెల్లడి

Satyam NEWS

ATM మోసాలకు చెక్‌ పెట్టేందుకు ఇక ఓటీపీ

Satyam NEWS

Leave a Comment