29.7 C
Hyderabad
April 29, 2024 09: 22 AM
Slider ప్రత్యేకం

రైతుల కల్లాలు నిర్మిస్తే బీజేపీ కండ్లు మండుతున్నాయా ?

#BJP government

విశాల వ్యవసాయ భారతావనిలో అత్యధిక శాతం మందికి జీవనోపాధిగా ఉండే వ్యవసాయరంగాన్ని కూడికలు, తీసివేతల లెక్కల్లో కాకుండా, ఉపాధి లభించే రంగంగా, శాశ్వతంగా ప్రజలకు ఆహార అవసరాలు తీర్చే రంగంగా, ఒక సామాజిక బాధ్యతగా భావించి కేంద్రంలోని ప్రభుత్వాలు చర్యలు తీసుకుని ఉండవలసింది. కానీ గత ప్రభుత్వాలు, ప్రస్తుతం కేంద్రంలో ఉన్న నరేంద్రమోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలకు ఉపక్రమిస్తుందనే ఆశ, నమ్మకం పోయింది. నరేంద్రమోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత 2013 సెప్టెంబర్ 8,9,10 తేదీల్లో గుజరాత్ గాంధీనగర్ లోని మహాత్మా మందిర్ లో దేశంలోని 540 జిల్లాలు, 200 కంపెనీలు, 15 దేశాలు, 10 వేల మంది రైతులతో ‘‘ద వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ అగ్రికల్చర్ సమ్మిట్’’ నిర్వహించారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల ఉత్పాదకత, రైతుల ఆత్మహత్యలు, రైతులకు బ్యాంకు రుణాలలో వివక్ష, పంటలకు గిట్టుబాటు ధరల గురించి మాట్లాడారు. పప్పులలో ప్రోటీన్ శాతం గురించి, ఉల్లిగడ్డల కొరత గురించి, పంటల మార్కెటింగ్ విషయంలో రాష్ట్రాల మధ్యలో సమన్వయం, సంబంధాలు లేవని, విశ్వవిద్యాలయాలు, ఢిల్లీ ప్రధాని కార్యాలయానికి సంబంధాలు ఉండాలని అన్నారు. దేశంలో గోదాముల కొరత తీవ్రంగా ఉందని , ఎఫ్ సీ ఐ సంస్థ ఉత్పత్తుల సేకరణ, రవాణా, నిల్వలకు సంబంధించి వికేంద్రీకరణ జరగాలని తెలిపారు. వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులు, దిగుమతుల మీద అస్సలు ప్రణాళిక లేదని, అవసరం ఉన్నప్పుడు దిగుమతుల కోసం ఎగబడుతున్నామని అన్నారు.

2014, 2019 బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వస్తే ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని, స్వామినాధన్ కమిటీ సిఫార్సుల ప్రకారం పంటలకు గిట్టుబాటు ధరలు ప్రకటిస్తామని, 60 ఏండ్లు నిండిన ప్రతి చిన్న, సన్నకారు రైతుకు ఫించను ఇస్తామని, దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వేర్ హౌసింగ్ గోదాములు నిర్మిస్తామని, ధరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకు రూ. లక్ష వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని, వ్యవసాయరంగంలో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి పెడతామని హామీలు గుప్పించారు. అంతేకాదు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని గొప్పగా ప్రకటించారు.

ఇన్ని హామీలు, వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన నరేంద్రమోడీ అందులో ఒక్కటంటే ఒక్కటి కూడా నెరవేర్చిన దాఖలాలు లేవు. తెలంగాణలో రైతుబంధు పథకానికి వచ్చిన ఆదరణ చూసి కేంద్రం ఆర్భాటంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. మూడువిడతలలో ఏడాదికి రూ.6 వేలు అని గొప్పగా ప్రవేశపెట్టిన బీజేపీ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలతో 2019లో తొలి విడతలో 11.84 కోట్ల మందికి ఈ పథకం వర్తింపచేసింది. 2022 నాటికి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన లబ్దిదారుల సంఖ్య 3.87 కోట్లకు కుదించినారు. కేవలం మూడేళ్లలో 8 కోట్ల మంది లబ్దిదారులు ఎగిరిపోవడం కేంద్రప్రభుత్వ చిత్తశుద్దికి అద్దంపడుతున్నది.

కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 2017 లో సుమారు 8 నెలలపాటు తమిళనాడు రైతులు ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఎలుకలను తిని, మల మూత్రాలను సేవించి, పుర్రెలు, ఎముకలు ధరించి రక రకాల పద్దతుల్లో నిరసన తెలిపి తమ గోడు పట్టించుకోవాలని విన్నవించుకున్నా మోడీ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో దయనీయ పరిస్థితుల్లో వారు తిరిగి వెళ్ళిపోయారు. 2018 లో మహారాష్ట్ర రైతులు రైతు రుణ మాఫీ, ఉచిత విద్యుత్, కనీస మద్దతు ధర కొరకు డిమాండ్ చేస్తూ నాసిక్ నుండి ముంబై వరకు 180 కిలోమీటర్లు పాద యాత్ర చేశారు.

ఆ పాదయాత్రలో వృధ్ధ రైతులు, మహిళా రైతుల హృదయ విదారక దృశ్యాలు చూసి దేశమంతా చలించింది. అయినా కేంద్ర ప్రభుత్వ మనసు కరిగింది లేదు. రైతులకు ఒరిగింది లేదు. కేంద్ర ప్రభుత్వ నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీని దిగ్భంధించినా శివార్లలో లక్షల మంది రైతులు 16 నెలలు ఆందోళన చేశారు. చలికి వణుకుతూ, వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ 750 మంది పై చిలుకు రైతులు మరణించడం జరిగింది. వారిపై లాఠీఛార్జ్ లు, వాటర్ క్యానన్లను, భాష్పవాయుగోళాలను ప్రయోగించారు. ఖలిస్తానీయులని, ఉగ్రవాదులని ముద్రవేశారు.

చివరకు వారి ఆందోళనలకు తలొగ్గి ప్రధానమంత్రి నరేంద్రమోడీ జాతికి క్షమాపణ చెప్పి చట్టాలను వెనక్కి తీసుకున్నారు. ఈ సంధర్భంగా పంటలకు కనీస మద్దతుధర విషయంలో స్పష్టమయిన హామీ ఇచ్చి ఆందోళన విరమింపజేశారు. కానీ ఏడాది గడిచినా ఆ హామీ విషయంలో ఉలుకూ పలుకూ లేదు. రైతుల నిజమైన బాగోగులు పట్టించుకుంటే ఏడాదిగా నిమ్మకు నీరెత్తినట్లు ఎలా ఉంటారు ?

మన దేశంలో సహజ వనరులున్నాయి. కానీ కేంద్రంలో ఇప్పటివరకు పాలించిన పాలకులకు వాటిని ఎలా వినియోగించుకోవాలి అన్న విషయంలో స్పష్టత ఉన్నట్లు లేదు. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అనంతంగా అందుబాటులో ఉన్నా, అందిపుచ్చుకోలేని పరిస్థితి దేన్ని సూచిస్తున్నది? 75 ఏండ్లుగా కేంద్ర పాలకుల నిర్వాకమే నేటి రైతాంగ సకల సమస్యలకు కారణం. సాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, మద్దతుధర, మార్కెటింగ్ వసతులు ఏ విషయంలోనూ రైతు, వ్యవసాయ అనుకూల నిర్ణయాలను కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదు. పైగా అసంబద్ద విధానాలు, నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అందువల్ల రైతులు వ్యవసాయం చేయటం దుర్లభంగా మారుతున్నది. పెట్టుబడులు గణనీయంగా పెరిగిపోవడం, ఆదాయం ఆ మేరకు పెరగకపోవటం మూలంగా దేశవ్యాప్తంగా సాగు ఏ మాత్రం లాభసాటి కానిదిగా భావిస్తున్నారు రైతులు.

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక దార్శనిక దృష్టితో వ్యవసాయాన్ని లాభసాటి చేసేందుకు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, అందుబాటులో ఉచితంగా సాగు నీరు, ఏడాదికి ఎకరాకు రూ.10 వేల రైతుబంధు సాయం, రైతు ఏ కారణం చేత మరణించినా రూ.5 లక్షల రైతుభీమా సాయం, అందుబాటులో విత్తనాలు, ఎరువులు, వందశాతం పంటల కొనుగోళ్లదతో అన్నదాతలకు ఆత్మస్థైర్యం పెంచుతున్నారు. సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తుండడంతో పడావుపడ్డ భూములన్నీ పచ్చదనం సంతరించుకున్నాయి.

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి కొత్తతరాన్ని సైతం సేద్యం వైపు ఆకర్షిస్తున్న ఘనత కేసీఆర్‌ పాలనది. ప్రజలకు అవసరమైన వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. ప్రజాస్వామ్యంలో ప్రజల పట్ల ప్రభుత్వానిది తండ్రి బాధ్యత. వ్యవసాయరంగంలో ప్రస్తుతం రైతుల పరిస్థితి, పంటల సాగు, దిగుబడులు, స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ఆహార అవసరాలను తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మార్కెట్ రీసెర్చ్ అనాలసిస్ వింగ్ ద్వారా గుర్తిస్తున్నది.

ఈ నేపథ్యంలోనే సాంప్రదాయ సాగులో పడి నష్టపోతున్న రైతాంగాన్ని మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల సాగు వైపు ప్రోత్సహిస్తున్నది. భూసార పరిస్థితులు, నేల రకాలు, వ్యవసాయానికి అవసరమైన వివిధ రకాల వనరులు, వాతావరణ పరిస్థితులు, స్థానిక భూభౌగోళిక పరిస్థితులు, రైతుల ఆర్థిక స్థితిగతులు, చిన్న కమతాలలో సాగు వంటి సమస్యలను ప్రభుత్వం అధ్యయనం చేసింది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న సాంకేతికతను వ్యవసాయానికి జోడించడం, రైతుల సాగు పెట్టుబడులు తగ్గించడం, పంటల ఉత్పాదకతను పెంచడం తద్వార రైతుకు ఆదాయం పెంచడం, అంతిమంగా వ్యవసాయాన్ని లాభదాయకం చేయడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం.

నేల ఆరోగ్యం కాపాడడం, పర్యావరణ కాలుష్యాన్ని నివారించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని గుర్తించింది. కేసీఆర్ కృషి ఫలితంగా 2014 నాటికి కోటీ 34 లక్షల ఎకరాలు ఉన్న వ్యవసాయ సాగు విస్తీర్ణం 2021 నాటికి అది 2 కోట్ల 15 లక్షల ఎకరాలకు పెరిగింది. 2014 నాటికి 45 లక్షల టన్నులు మాత్రమే ఉన్న వరిధాన్యం ఉత్పత్తి 2021 నాటికి దాదాపు 3 కోట్ల టన్నులకు చేరింది. ఉమ్మడి రాష్ట్రంలో ఆకలితో అల్లాడిన తెలంగాణ ఏడేళ్లలో దేశానికే అన్నపూర్ణ అయిన పంజాబ్ రాష్ట్రాన్ని మించి వరి ధాన్యం దిగుబడులు సాధించింది. ఫలితంగా 2014 – 2015 నుండి 2021 – 22 మధ్య తెలంగాణ వ్యవసాయ వృద్దిరేటు 11.6 శాతంగా నమోదయింది. 2014 – 2015 నుండి 2021 – 22 మధ్య వ్యవసాయరంగం ద్వారా వచ్చే స్థూల ఆదాయం విలువ 16.3 శాతం నుండి 18.3 శాతానికి పెరిగింది.

గత ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయరంగం, సాగునీటి రంగం మీద లక్షల కోట్లు ఖర్చుచేశారు. ఇందులో ఒక్క రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకపోవడం గమనార్హం. గత 9 విడతలలో కేవలం రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాలలో రూ.58 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. సుమారు రూ.1 లక్షా యాభై వేల కోట్లతో సాగునీటి ప్రాజెక్టులను చేపట్టారు. ఏడాదికి రూ.10,500 కోట్లు ఉచిత విద్యుత్ అందించడానికి ఖర్చు చేస్తున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ ప్రతి పనికి అడ్డంకులు సృష్టిస్తున్నది. మొదట వరి ధాన్యం వద్దన్నారు.

తర్వాత ఫలానా రకం వడ్లే కొంటాం అని పేచీపెట్టారు. ఆ తర్వాత ధాన్యం నిల్వలు పేరుకుపోయాయి మేము ధాన్యం కొనం అని అన్నారు .. ఆ తర్వాత నిల్వలు కరిగిపోయాయి అని ఇప్పుడు ధాన్యం ఎగుమతుల మీద ఆంక్షలు విధించారు. ఏటా పంటలకు మద్దతుధర ప్రకటించి చేతులు దులుపుకుంటున్నారు. పండిన పంటలో కేవలం 25 శాతం మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు గిట్టుబాటు ధర దక్కక నష్టాల పాలవుతున్నారు. కేవలం తెలంగాణ రాష్ట్రం మాత్రమే రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నష్టాలను భరిస్తూ వందశాతం పంటల కొనుగోళ్లను చేపడుతున్నది.

ఎనిమిదేళ్లలో కేంద్రం నుండి ఎలాంటి సహకారం లేకుండా ఎదుగుతున్న తెలంగాణ వంటి రాష్ట్రానికి చేయూతనివ్వాల్సిన కేంద్రం అన్ని విషయాలలో అడ్డంకులు పెడుతూ వేధిస్తున్నది. ఉపాధిహామీ పథకం కింద తెలంగాణలో నిర్మించిన రైతుల కల్లాల విషయంలో వివక్ష చూపుతూ దాని కోసం వెచ్చించిన రూ.151 కోట్లు వెనక్కు ఇవ్వాలని నరేంద్రమోడీ ప్రభుత్వం కోరడం వారి తెలంగాణ వ్యతిరేక, రైతు వ్యతిరేక విధానాలకు పరాకాష్ట. బిజెపి అధికారంలోకి రావడానికి, రెండోసారి అధికారం దక్కించుకోవడానికి ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేదు.

వ్యవసాయ విధానాల గురించి, రైతాంగా విధనాల గురించి అధికారంలోకి రాకముందు అనేక విషయాలు చెప్పిన బిజెపి అధికారంలోకి వచ్చి ఎనిమిదిన్నరేళ్లు కావస్తున్నా ఈ దేశం కోసం ఒక స్పష్టమయిన వ్యవసాయ విధానం రూపొందించకపోవడం విషాదం. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ, రైతాంగ అనుకూల పథకాలు, విధానాలు ఈ దేశమంతా అమలు కావాల్సిన ఆవశ్యకత ఉన్నది. అందుకే ‘‘అబ్ కి బార్ కిసాన్ సర్కార్’’ రాబోయే కాలానికి దేశానికి అత్యవసరం.

సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి

Related posts

సినీ ఫక్కీలో వీరోచితంగా పోరాడి మృతి చెందిన పోలీసు

Satyam NEWS

Free|Trial | How Do You Lower A High Blood Pressure How To Control High Blood Pressure In Summer How Do I Lower My Systolic Pressure Blood Pressure Naturally

Bhavani

శాడ్: పాపం భగవాన్ రెడ్డి ..జర్నలిస్ట్ గా

Satyam NEWS

Leave a Comment